వైయస్ఆర్ కడప జిల్లా: మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం వెదురూరులో వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నందిమండలం ప్రశాంతిని నామినేషన్ దాఖలు చేయకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. తొమ్మిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను, ఆమె బంధువులను అడ్డుకుని నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారని పేర్కొన్నాయి. వెదురూరు, నక్కలదిన్నె, అల్లాడుపల్లె ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారని పార్టీ శ్రేణులు ఆరోపించాయి. నామినేషన్ కేంద్రం వద్ద అభ్యర్థులకు తగిన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును అడ్డుకోవడం సరికాదని, అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులు కోరారు.