ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెట్రి సెల్విని కలిసి వినతిపత్రం అందజేశారు. పెదవేగి, పెదపాడు, దెందులూరు మండలాల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న సమయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు పూర్తిస్థాయి పోలీసు భద్రత కల్పించాలని, రిటర్నింగ్ అధికారుల వద్దకు సురక్షితంగా చేరుకుని నిర్ణీత గడువులోగా నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అభ్యర్థులను అడ్డుకోవడం, బెదిరించడం, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, ధ్వంసం చేయడం వంటి ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు, సాక్షుల వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ వంటి ఆధారాలను భద్రపరచాలని, నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులను పరిశీలించి ఎన్నికల నిబంధనల పరిధిలో తగిన పరిష్కారం కల్పించాలని కోరారు. ప్రతి అర్హత కలిగిన అభ్యర్థికి స్వేచ్ఛగా, ఎలాంటి భయభ్రాంతులు లేకుండా నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందని కొఠారు అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు. నామినేషన్ల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పెదవేగి, పెదపాడు, దెందులూరు మండలాల్లో అవసరమైన అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసి, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికలకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు.