తాడేపల్లి: రాష్ట్రంలో అన్నింటా విఫలమైన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, అందుకే స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి, ఎలాగైనా గెలిచేందుకు అంతులేని అక్రమాలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్న చంద్రబాబు, ఆ దిశలో స్థానిక ఎన్నికల్లో అష్ట కుట్రలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం యథేచ్ఛగా బేఖాతర్ చేస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కానీ, ప్రభుత్వం కానీ వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన వెల్లడించారు. అన్ని కుట్రలకు పితామహుడు చంద్రబాబు అని, ఆయన ఫోర్జరీ, మోసాలు, కుట్రలు తారాస్థాయికి చేరాయని తెలిపారు. తొండి, అన్యాయం. దౌర్జన్యంతో స్థానిక ఎన్నికలు గెలవాలని చూస్తున్నారని, అలా ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా పాతర వేస్తున్న చంద్రబాబు, నియంతృత్వ ధోరణితో ముందుకెళ్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ప్రజా హక్కులు ఉంటాయని, నియంతృత్వ వ్యవస్థలో హక్కులు, స్వేచ్ఛ ఉండవన్న ఆయన, కాబట్టి ఈ విషయంపై ప్రజలంతా ఆలోచించాలని కోరారు. ‘ఈరోజు పోలీసులు, అధికారుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలు లాక్కుంటున్న టీడీపీ గుండాలు, రేపు ప్రజల ఆస్తులను కూడా అలాగే లాక్కుంటారని శ్రీ వైయస్ జగన్ హెచ్చరించారు. అందుకే ప్రజలంతా తిరగ బడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, లేని పక్షంలో ఏ ఒక్కరి ఆస్తులు, స్వేచ్ఛ, హక్కులకు రాష్ట్రంలో గ్యారెంటీ లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ఇంకా ఏమేం మాట్లాడారంటే..: వ్యవస్థ దిగజారింది. అది ఎలా అంటే..?: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు చేస్తున్న అక్రమాలపై గత ఆదివారం ప్రెస్‌మీట్‌లో అన్ని ఆధారాలు చూపడంతో పాటు, ఇక్కడ ఎస్‌ఈసీని కలిసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశాం. ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి, అన్ని ఆధారాలు చూపడంతో, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కి అక్షింతలు వేసింది. నామినేషన్ వేయలేకపోయిన వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. ఇవి పార్టీ పరంగా జరుగుతున్న ఎన్నికలు. అలాంటప్పుడు మా పార్టీ అభ్యర్థులతో నామినేషన్ వేయించమని అడిగితే, ఎదుటి పక్షం మాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. మా పార్టీ అభ్యర్థుల నామినేషన్ వేయనివ్వడం లేదు. అంటే వ్యవస్థ దిగజారిపోయింది అనే కదా వాస్తవం. ఇవి పార్టీ పరంగా జరిగే ఎన్నికలు. అయినా మా అభ్యర్థులను ఎందుకు నామినేషన్ వేయనివ్వడం లేదు, ఎందుకీ డ్రామాలు. అబద్ధాలు: సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అక్టోబరు 25 వరకు తుది జాబితాలు ప్రకటించవద్దని, నామినేషన్లు వేయలేకపోయిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని, అవసరమైతే జిల్లా కలెక్టరేట్ల వద్ద అందుకు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని, ఆ దిశలో ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలని ఆదేశించింది. మొత్తం మీద ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాలని నిర్దేశించింది. మా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయనిస్తే, అసలు గొడవే లేదు కదా? నిజంగా మీరు ప్రజలకు మంచి చేశామని అనుకుంటే, మాతో నామినేషన్లు వేయించే అవకాశం ఇచ్చి, ప్రజాతీర్పు కోరాలి. కానీ, ఆ పని చేయకుండా, మమ్మల్ని అడ్డుకోవడం అంటే, మీరు ఓడిపోతారన్న భయం ఉంది కదా? ఈ చర్యల ద్వారా ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఎన్నికలను బుల్డోజ్ చేయాలని చూస్తున్నారు కదా? అందుకే స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న దారుణాలపై సుప్రీంకోర్టు చాలా లోతుగా కామెంట్స్ చేసింది. ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేస్తే, జోక్యం చేసుకోక తప్పదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు: ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినా, చంద్రుబాబునాయుడుగారిలో ఏ మాత్రమైనా మార్పు వచ్చిందా? ఎస్‌ఈసీలో ఏమైనా మార్పు వచ్చిందా? చంద్రబాబు చేతిలో తోలుబొమ్మ మాదిరిగా మారిన డీజీపీలో ఏమైనా మార్పు వచ్చిందా? డీఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే, ఏమీ రాలేదు. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై గౌరవం లేదు. ప్రజాస్వామ్యం అంటే అంతకన్నా గౌరవం లేదు. 19కి బదులు, 4 మున్సిపాలిటీల్లోనే..: 19 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయనివ్వలేదని మేము ఆధారాలతో సహా, ఫిర్యాదు చేస్తే.. కేవలం మైదుకూరులో మొత్తం వార్డులు, తిరుపతిలో 18 డివిజన్లు, కడపలో 11 డివిజన్లతో పాటు, రాజంపేటలో మరో 11 వార్డుల్లో మాత్రమే రీనామినేషన్లకు అవకాశం ఇస్తున్నారు. 19 మున్సిపాలిటీల్లో మమ్మల్ని నామినేషన్లు వేయనివ్వలేదని ఆధారాలతో సహా, మేము సుప్రీంకోర్టుకు వెళ్తే, కోర్టు మొట్టికాయలు వేసినా, వీరిలో మార్పు లేదు. కేవలం 4 మున్సిపాలిటీల్లో మాత్రమే రీనామినేషన్లకు అనుమతి ఇచ్చారు. అసలు వీరికి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ఉందా? నామినేషన్ విధానంలో ఎంపిక చేస్తే సరిపోతుంది కదా? ఎవరి కళ్లకు గంతలు కడుతున్నారు? ఇవి పార్టీపరమైన ఎన్నికలు. మా అభ్యర్థులను నామినేషన్ వేయించమని అడుగుతున్నాం. నామినేషన్లు వేయనివ్వకుండా, గెలుపు ఏకపక్షం చేసే పని చంద్రబాబు చేస్తున్నాడు. ఇది ధర్మమేనా?. కడపలో 66 వార్డులు ఉంటే, కేవలం 11 వార్డుల్లో మాత్రమే రీనామినేషన్ అంటున్నారు. వాటిలో కేవలం రెండే రెండు వార్డుల్లో పోటీ ఉండేలా చేసిన వీరు, మరో 11 చోట్ల ఇప్పుడు అనుమతి అంటే.. మొత్తం 13 వార్డుల్లో మాత్రమే పోటీకి అనుమతి ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా? రాజంపేటలో 32 వార్డులుంటే, ఇంతకు ముందు కేవలం 3 వార్డుల్లో మాత్రమే పోటీ ఉండేలా చేశారు. కాగా, ఇప్పుడు మరో 11 వార్డుల్లో రీనామినేషన్‌కు అనుమతి ఇచ్చారు. అంటే 32 వార్డులకు గానూ, కేవలం 14 వార్డుల్లో మాత్రమే మా పోటీకి అనుమతి ఇస్తున్నారు. ఎస్‌ఈసీ ఎవరి ఆదేశాలు పాటిస్తోంది: అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తోందా? లేక చంద్రబాబు ఆదేశాలు పాటిస్తోందా?. టీడీపీ దాడులు, పోలీసులు అడ్డుకోవడం వల్ల 19 మున్సిపాలిటీల్లో మేము నామినేషన్లు వేయలేకపోయామని సుప్రీంకోర్టుకు వెళ్లాం. వాటితో పాటు, మరో 4 మున్సిపాలిటీల్లో స్క్రుటినీ పేరుతో మా అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. అంటే మొత్తం 23 అర్బన్ లోకల్‌బాడీస్‌లో పోటీ లేకుండా చేశారు. ఇవీ ఆ 23 మున్సిపాలిటీలు: పుంగనూరు, రాయచోటి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, కమలాపురం, గురజాల, దాచేపల్లి, దర్శి, గుత్తి, మైదుకూరు, రాజంపేట, జమ్మలమడుగు, తిరుపతి, పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, తాడిపత్రి, కనిగిరి, చిత్తూరు, చిలకలూరిపేట, నెల్లూరు, కనిగిరి. మొత్తం 23 మున్సిపాలిటీలు. వీటిలో 15 చోట్ల ఏకంగా పోటీయే లేదు. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు కూడా లేరు. 8 చోట్ల నామినేషన్లు అస్సలు అనుమతించలేదు. గురుజాల, పిడుగురాళ్ల, దర్శి, రాయచోటి, కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూరు, పుంగనూరులో నామినేషన్లు వేయనీయలేదు. 7 చోట్ల కొన్ని నామినేషన్లు పడ్డాయి. కానీ స్క్రుటినీ పేరుతో మళ్లీ అక్రమంగా ఛైర్మన్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. దాచేపల్లి, కనిగిరి, బద్వేలు, రాజంపేట, పొద్దుటూరు, గుత్తి, నగిరి తదితర 15 చోట్ల ఛైర్మన్ అభ్యర్థి లేకుండా చేశారు. ఇంకా చిత్తూరు, నగరి, చిలకలూరిపేట, నెల్లూరులో స్క్రుటినీ పేరిట నామినేషన్లు తిరస్కరించారు. (అంటూ.. ఎక్కడెక్కడ ఏం చేశారనే జాబితా పీపీటీలో చూపారు) ఎందుకంత తొండి. దౌర్జన్యం. అన్యాయం: అసలు చంద్రబాబుగారు ఎందుకింత తొండి. దౌర్జన్యం. అన్యాయం చేస్తున్నారు. మీకు ధైర్యముంటే ఈ ఎన్నికలు ఎదుర్కోవచ్చు కదా? అసలు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీటిని ఎన్నికలు అంటారా? మహాభారతంలో శకునికి పాచికలు ఉండేవి. ఆయన కోరుకున్నట్లు నెంబర్లు వచ్చేవి. ఇక్కడ నీవు కూడా శకునిలా మారావు. నీ ఇష్టానుసారం ఎన్నికలను నిర్దేశిస్తున్నావు. ఎక్కడెక్కడ ఏం జరగాలో నీవే ఆదేశిస్తున్నావు. ఒక చోట తల (ఛైర్మన్) ఉండదు. కొన్ని చోట్ల కాళ్లు, చేతులు (వార్డు మెంబర్లు) ఉండవు. అంటే ఎక్కడా పూర్తి స్థాయిలో సక్రమంగా ఎన్నికలు జరగవు. మా హయాంలో కనీసం ఒక్క ఫిర్యాదైనా వచ్చిందా?: మీరు ప్రజలకు నిజంగా మంచి చేసి ఉంటే, వాటిని చూపి, మీ పనితీరు చూపి ఎన్నికల్లో ఓట్లు అడగాలి. మీరు ఆ పని చేయడం లేదు. కానీ, ఆ పని మేము చేశాం. మా హయాంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్. ఆయన చంద్రబాబు నియమించిన వ్యక్తి. నాడు ఎన్నికల షెడ్యూల్ రాగానే, ఆయన ఇష్టానుసారం ఆఫీసర్లను బదిలీ చేశారు. అయినా మేం ఏమీ అనలేదు. తీవ్ర కోవిడ్ ఉన్నా, ఎక్కడా ప్రజలకు మేలు చేయడంలో మేము వెనుకంజ వేయలేదు. వారికి ఎంతో మంచి చేశాం. అందుకే ఆ ఎన్నికల్లో విజయం సాధించాం. మ్యానిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతం అమలు చేసి చూపాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పెనుమార్పులు తీసుకొచ్చాం. అందుకే ఆ ఎన్నికల్లో మేము 86 శాతం విజయం సాధించాం. అదే ఈరోజు అంతా మోసం. సూపర్‌సిక్స్ లేవు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. నాడు సంతకాలు చేసి ఇంటింటికీ పంపించిన బాండ్లు ఒట్టివే అయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రజలు నిలదీసే పరిస్థితి. అందుకే ఈ స్థానిక ఎన్నికలు జరగనివ్వకుండా, అన్నీ ఏకగ్రీవం అయ్యేలా తొండి, దౌర్జన్యం. అన్యాయం చేస్తున్నారు. ఎంపీటీసీ. జడ్పీటీసీ ఎన్నికలు. నామినేషన్ల ప్రక్రియ: అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేలా తగిన భద్రత కల్పించాలని, ఏర్పాట్లు చేయాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశించినా, అది అమలు చేయకుండా బరితెగిస్తున్నారు. జంగిల్‌రాజ్ నడుపుతున్నారు. ఇక్కడ నారాసుర రక్త చరిత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలోని 659 మండలాల్లో 101 మండలాల్లో జీరో నామినేషన్లు. అక్కడా అదే పద్ధతి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమాయంలో ఏం చేశారో.. ఇప్పుడూ అదే చేస్తున్నారు. నామినేషన్ కేంద్రాల్లో టీడీపీ మనుషులు ఉంటారు. వారికి పోలీసులు అండగా ఉంటారు. అక్కడికి మా పార్టీ వారు పోగానే అడ్డుకుంటున్నారు. చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాగేసుకుంటున్నారు. చింపేస్తున్నారు. ఎవరైనా నామినేషన్ వేస్తే, చివరకు ఆర్‌ఓ (రిటర్నింగ్ అధికారి) చేతిలో నుంచి కూడా నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేస్తున్నారు. ఇంకా 70 మండలాల్లో 5 నామినేషన్ల కంటే తక్కువ పడ్డాయి. 227 మండలాల్లో నామినేషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. స్థానిక ఎన్నికల సందర్భంగా మా వారిపై జరుగుతున్న దాడులకు ప్రధాన కారణం.. సీఎం చంద్రబాబు. ఆయన చెప్పినట్లు ఆడుతున్న పోలీసులు. ఇతర అధికారులు. మరి వారిని బాధ్యతల నుంచి తప్పించకుండా, నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా జరుగుతాయి?. నామినేషన్ కేంద్రాల రిగ్గింగ్!: చంద్రబాబు ఒకప్పుడు పోలింగ్ కేంద్రాల రిగ్గింగ్ నుంచి, ఇప్పుడు ఏకంగా నామినేషన్ కేంద్రాల రిగ్గింగ్‌కు దిగజారాడు. మనం గతంలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ కేంద్రాల రిగ్గింగ్ చూశాం. రాష్ట్రం రావణ కాష్టం. 8 కుట్రల పర్వం: తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబుగారు రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్నారు. ఆ దిశలో చంద్రబాబు, ఆయన గ్యాంగ్ కలిసి, ఈ స్థానిక ఎన్నికల్లో 8 కుట్రలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో నామినేషన్లు ముగిసే దాకానే ఈ అష్ట కుట్రలు. కుట్ర–1: – నామినేషన్ వేయకముందే, వైయస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వారికి బెదిరింపులు. కుట్రలో భాగంగా, అభ్యర్థులు, వారికి సహకరించే వారిని బెదిరించడం. బైండోవర్ చేయడం. ముందస్తు అరెస్టులు చేయడం. కుట్ర–2: – నాయకుల గృహ నిర్భంధం. నామినేషన్ల ప్రక్రియ అంతా మీరు గమనించండి. ఎక్కడా అభ్యర్థులకు తోడుగా నాయకులను వెళ్లనీయడం లేదు. కుట్ర–3: – నామినేషన్ కేంద్రాలు స్వాధీనం చేసుకుని, ప్రతిపక్ష అభ్యర్థులు లోపలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మా పార్టీ అభ్యర్థులు ఎలాగోలా నామినేషన్ కేంద్రాలకు వెళ్లే సరికే అక్కడ టీడీపీ వారు మారణాయుధాలతో ఉంటారు. అక్కడ ఉన్న పోలీసులు వారికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. కుట్ర–4: – పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలు లాక్కోవడం, కొన్ని చోట్ల ఆర్వోల చేతిలో నుంచి లాక్కుని చింపడం. కుట్ర–5: – ఇన్ని జరుగుతున్నా పోలీసులు అడ్డుకోకపోగా, బాధిత అభ్యర్థులను, అంటే మా పార్టీ వారినే పోలీసులు బయటకు నెట్టేస్తారు. నామినేషన్ వేయడానికి అభ్యర్థి కాకుండా, కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతిస్తున్నారు. నామినేషన్ కేంద్రం గేటు, ఎక్కడో దూరంగా ఉంటుంది. అక్కణ్నుంచి వారు లోపలికి నడిచి వెళ్తుండగానే అడ్డుకోవడం. నామినేషన్ పత్రాలు లాక్కోవడం చేస్తున్నారు. కుట్ర–6: – దాడి చేసిన వారిని పూర్తిగా వదిలేసి, దాడులకు గురైన వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. అలా కేవలం మా వైయస్సార్‌సీపీ అభ్యర్థులతో పాటు, వారితో ఉంటున్న మా పార్టీ నాయకులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అలా వారిని ఇంటికే పరిమితి చేయడం. లేదంటే జైలుకు పంపడం చేస్తున్నారు. కుట్ర–7: – స్క్రుటినీ పేరుతో నామినేషన్ల తిరస్కరణ. ఆ సమయంలో అభ్యర్థులను ఆఫీసులకు రానివ్వకుండా, ఇష్టానుసారం చేస్తున్నారు. కొన్ని చోట్ల వారే కొన్ని పేపర్లు చింపేయడం. కొన్ని చోట్ల అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేసి, విత్‌డ్రా చేసుకున్నట్లు చెప్పడం జరుగుతోంది. ఉదా: నంద్యాల మున్సిపాలిటీ. 51వ వార్డు అభ్యర్థి నాగమణి. ఆమె స్క్రుటినీకి హాజరు కాగా, ఆమె నామినేషన్ ఓకే చేశారు. ఆ తర్వాత ఆమె సంతకం ఫోర్జరీ చేసి, ఆమె విత్‌డ్రా చేసుకున్నట్లు ప్రకటించారు. (అంటూ ఆ వివరాలు చూపడంతో పాటు, ఆమెను స్వయంగా మీడియాకు చూపారు) అలా నాగమణి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆమె విత్‌డ్రా చేసుకున్నట్లు ప్రకటించి, ఆ వార్డులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత నగరి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి బాలకృష్ణ విషయంలో కూడా చేశారు. తొలుత ఆయన నామినేషన్ ఆమోదించినట్లు చెప్పారు. తుది జాబితాలో ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు. కుట్ర–8: – అభ్యర్థులను బెదిరించి, భయపెట్టి, లోబర్చుకుని నామినేషన్ ఉపసంహరణకు ఒత్తిడి చేయడం. ఇలా అష్ట కుట్రలతో చంద్రబాబు, ఆయన ఆధ్వర్యంలోని ఎస్‌ఈసీ దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మహిళలపై నిర్దాక్షిణ్యంగా దాడులు: ఇక్కడ దారుణ విషయం ఏమిటంటే.. దాడులకు ఎక్కువగా గురైంది మహిళలే. ఎందుకంటే వారికి 50 శాతం రిజర్వేషన్లు. దాన్ని తీసుకొచ్చింది మనమే. నాడు మన హయాంలో మహిళలు వర్థిల్లారు. అదే ఇప్పుడు చంద్రబాబు పుణ్యమా అని వారంతా దాడికి గురవుతున్నారు. ఈ ఎన్నికలు సజావుగా జరిగితే డివిజన్లలో కార్పొరేటర్లు మొదలు, గ్రామస్థాయిలో వార్డు సభ్యుల వరకు దాదాపు 80 వేల మంది మహిళలు ఎన్నికవుతారు. అందులో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ పదవుల్లో 7,216 మంది మహిళలు ఎన్నికవుతారు. మరి ఇన్ని వేల మంది మహిళలు నామినేషన్లు వేయడానికి వస్తే, వారి జుట్టు పట్టుకోవడం, చీరలు లాగేయడం, వారిని తిట్టి కొట్టి దాడులు చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను. చంద్రబాబు అనేవాడు అసలు మనిషేనా? మహిళలపై దాడులు ప్రోత్సహిస్తున్న చంద్రబాబునాయుడుగారు, ఆ పని చేస్తున్న ఆయన పార్టీ గుండాలు, మరోవైపు ప్రత్యక్షంగా దీన్ని చూస్తూ ఊర్కుంటున్న పోలీసు అధికారులు, ఎస్‌ఈసీ.. చేస్తోంది ధర్మమేనా?. ఇక ఈ ఎన్నికల్లో నామినేషన్ల పర్వంలో జరుగుతున్న దౌర్జన్యాలు: (అంటూ.. అన్నీ వరసగా పేర్లు, వివరాలతో సహా వీడియోల్లో చూపారు). ఇవీ ఆ వివరాలు: 1). పెనుకొండలో మంత్రి సవిత ముఖ్య అనుచరుడు ఆర్వో చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశాడు. 2). చిత్తూరు జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై దాడి. ఆయన కారు ధ్వంసం. 3). ధర్మవరం మున్సిపాలిటీ. 32వ వార్డులో నామినేషన్ వేయడానికి వెళ్తున్న తలారి నళినిపై టీడీపీ అభ్యర్థి దాడి చేసి చీర లాగాడు. 4). పలమనేరు నియోజకవర్గం, వి.కోట జడ్పీటీసీ అభ్యర్థి జీ.వీ.ప్రకాష్‌పై దాడి. నామినేషన్ పత్రాలు చింపివేత. 5). చిలకలూరిపేట. 47వ వార్డులో వైయస్సార్‌సీపీ అభ్యర్థిపై ఆర్‌ఓ సమక్షంలోనే టీడీపీ గుండాల దాడి. 6). చిత్తూరులో జడ్పీటీసీ అభ్యర్థినిపై కె.సుష్మను అసభ్యంగా తాకి, నామినేషన్ పత్రాలు లాక్కునే ప్రయత్నం చేసిన టీడీపీ గుండాలు. 7). చిత్తూరు జడ్పీ ఆఫీస్‌లోనే జీడీ నెల్లూరు జడ్పీటీసీ అభ్యర్థిని నిరీషాపై దాడి చేసి, నామినేషన్ పత్రాలు చింపేశారు. టీడీపీ మహిళా నేత ఆ పని చేసింది. 8). జీడీ నెల్లూరు వైయస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు టీడీపీ గుండాలు బలవంతంగా లాక్కున్నారు. 9). శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రిలో మండల నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన పోలీసులు వారిని కొట్టారు. 9 నెలల గర్భిణీ అని కూడా చూడలేదు. 10). కడప జిల్లాలో ఎంపీటీసీ అభ్యర్థి భారతి నామినేషన్‌ను టీడీపీ గుండాలు చింపేశారు. 11). కనిగిరిలో మా ఎంపీటీసీ అభ్యర్థిని పోలు వరలక్ష్మి చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశారు. 12). కడప జిల్లా చాపాడు మండలంలో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయడానికి వచ్చిన 9 నెలల గర్భిణీ భారతిపై దాడి చేసిన టీడీపీ మూకలు నామినేషన్ పత్రాలు లాక్కున్నారు. 13). నర్సారావుపేటలో, పిడుగురాళ్ల జడ్పీటీసీ జడ్పీటీసీ అభ్యర్థి భారతి భర్త, లక్ష్మారెడ్డిపై నర్సారావుపేటలో దారుణంగా దాడి చేశారు. 14). కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఇంట్లో ఉన్న మా పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి వినోద్‌ను దుస్తులు చింపి, దారుణంగా కొట్టిన ఎస్‌ఐ విజయ్. 15). కనిగిరిలో 18వ వార్డు అభ్యర్థి సమీర నామినేషన్ వేయనివ్వాలంటూ పోలీసుల కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించలేదు. 16). దాచేపల్లిలో మా పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి పద్మావతి చీర లాగేందుకు టీడీపీ మహిళలు ప్రయత్నించారు. 10 మంది ఆ పని చేశారు. ఇదంతా నర్సారావుపేటలో జరిగింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు. 17). పుంగనూరులో వార్డు నెం.1 లో ఎస్సీ మహిళ కమలమ్మ చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు దౌర్జన్యంగా లాక్కున్నారు. 18). జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా నామినేషన్ వేయడానికి బయలుదేరిన ఇందిరమ్మను పోలీసులు తుపాకీ చూపించి బెదిరించారు. 19). కడప వైయస్సార్‌సీపీ ఆఫీస్‌లో ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన ఎంపీ అన్న కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ఆయన్ను ఒక తీవ్రవాది మాదిరిగా చూశారు. అలా అక్రమంగా అరెస్టు చేశారు. 20). తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరులు అమానవీయ ప్రవర్తన. ఒక మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తుండగా, దాడి చేసి అమానవీయ ప్రవర్తన. 21). తిరుపతి జిల్లా చంద్రగిరిలో అనుపల్లి ఎంపీటీసీ అభ్యర్థి ఎస్సీ మహిళ శారద సీఐ కాళ్లు పట్టుకుంది. నామినేషన్ వేయనివ్వాలని వేడుకుంది. 22). నగరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ బాలకృష్ణ, నామినేషన్ తొలుత ఓకే అన్నారు. అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత తుది జాబితాలో టీడీపీ అభ్యర్థి పేరు మాత్రమే ఉంది. ఇది ‘అరాచక ప్రదేశ్’ కాక మరేమిటి?: ఇవన్నీ చూశాక, ఆంధ్రప్రదేశ్‌ను అరాచక ప్రదేశ్ అని కాక ఏమంటారు? మా హయాంలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఒక్కటైనా ఇలా జరిగిందా? అంత సాఫీగా మేము ఎన్నికలు జరిపాము. అదే ఈరోజు అందుకు పూర్తి భిన్నంగా ఎన్నికలు. తొండి. అన్యాయం. దౌర్జన్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో కూడా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం మాదిరిగా జరుగుతోంది. ఆ అధికారులు. ఆ పోలీసులే ఉన్నారు. మరి ఏ విధంగా నామినేషన్లు వేస్తారు? వైయస్సార్‌సీపీ పేరుతో దొంగ నామినేషన్లు. అందుకు ఎన్నికల కమిషన్ డేటా ఆధారం: చంద్రబాబు కుట్రల్లో పరాకాష్ట.. మా పార్టీ పేరుతో వారే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అలా సంఖ్యను పెంచి చూపి, రాష్ట్రంలో అంతా శాంతియుతంగానే జరుగుతోందని కోర్టులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఈ వివరాలు చూడండి. నిజంగా ఆశ్చర్యపోతారు. ఎన్నికల కమిషన్ డేటా చూస్తే, అది మీకు అర్ధమవుతుంది. ‘ఒక్కసారిగా వైయస్సార్‌సీపీ నామినేషన్ల అసాధారణ పెరుగుదల’ (ఎక్స్‌పొనెన్షియల్ సర్జ్ ఇన్ వైయస్సార్‌సీపీ నామినేషన్స్) కనిపిస్తుంది. రాష్ట్రంలో 9,829 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరుగుతుంటే, ఈనెల 21 నాటికి, అంటే మొన్న బుధవారం నాటికి వైయస్సార్‌సీపీ పక్షాన దాఖలైన నామినేషన్లు కేవలం 1,918 మాత్రమే. ఆ మర్నాడు, అంటే 22వ తేదీ గురువారం నాటికి వాటి సంఖ్య ఏకంగా 10,501 కి పెరిగింది. అంటే ఒక్కరోజులోనే వైయస్సార్‌సీపీ నామినేషన్ల దాఖలులో 547% పెరుగుదల. అలాగే 659 జడ్పీటీసీ పదవులకు ఎన్నికలు జరుగుతుంటే, ఈనెల 21 నాటికి వైయస్సార్‌సీపీ పక్షాన దాఖలైన నామినేషన్లు కేవలం 192 మాత్రమే. ఆ మర్నాడు, అంటే 22వ తేదీ నాటికి వాటి సంఖ్య ఏకంగా 900 కి పెరిగింది. అంటే ఒక్కరోజులోనే వైయస్సార్‌సీపీ నామినేషన్ల దాఖలులో 468% పెరుగుదల. ఒకవైపు ఎక్కడికక్కడ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. మండల కేంద్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ అదే మాదిరిగా ఉంది. కానీ ఇక్కడ ఎన్నికల కమిషన్ డేటా చూస్తే.. ఆ స్థాయిలో మా పార్టీ నామినేషన్లు పెరిగాయి!. అంటే వైయస్సార్‌సీపీ పేరుతో వెన్నుపోటు పార్టీ వారే ఫేక్ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. (ఇవీ కొన్ని వివరాలు అంటూ ఆధారాలతో సహా పీపీటీలో చూపారు). ఇది కొండాపురం మండలం కొండాపురంలో14, 15, 16, 17, 18 వార్డులు. అన్నీ ఫేక్ నామినేషన్లు. వైయస్సార్‌సీపీ పేరుతో వెన్నుపోటు పార్టీ వారే వేశారు. మైలవరం మండలం దొమ్మల నంద్యాల. అక్కడ సిలివేరు లక్ష్మీదేవి వైఫ్ ఆఫ్ సిలివేరు గోపాలకృష్ణ పేరుతో వైయస్సార్‌సీపీ అభ్యర్థి అంటూ నామినేషన్. ఆమె మా పార్టీ అభ్యర్థిని కాదు. పులివెందుల నియోజకవర్గం, వేముల మండలంలో లోకేపల్లి మల్లికార్జునరెడ్డి, ఎస్.లక్ష్మీదేవి పేరుతో, వారు వైయస్సార్‌సీపీ పక్షాన వేశారంటూ, ఫేక్ నామినేషన్లు దాఖలు చేశారు. కుట్రలన్నింటికీ పితామహుడు చంద్రబాబు: ఈ కుట్రలకు నిజంగా పితామహుడు చంద్రబాబే. ఆయన ఇంత దారుణమైన ఎత్తుగడ ఎందుకు వేశాడంటే, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ సజావుగా సాగుతున్నాయని సుప్రీంకోర్టుకు ఒక భ్రమ కల్పించే కుట్ర. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లలో వెన్నుపోటు పార్టీ వారే, మా వైయస్సార్‌సీపీ తరపున ఫేక్ నామినేషన్లు వేస్తున్నారు. అందుకే ఒక్క రోజే ఎంపీటీసీ నామినేషన్లలో 547%, జడ్పీటీసీ నామినేషన్లలో ఒకేసారి 468 శాతం పెరుగుదల చూపించారు. ఇటు చూస్తే, మండల కేంద్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ మా వాళ్ళని అడ్డుకుంటూ నామినేషన్లను వేయనీయకుండా కుట్ర చేస్తున్నారు. అటు మా పార్టీ పేరుతో వాళ్లే ఫేక్ నామినేషన్లు వేస్తున్నారు. ఆ నామినేషన్లలో ఎక్కడా ఏ ఫామ్స్, బీ ఫామ్స్ ఉండవు. వారంతట వారే వైయస్సార్‌సీపీ అని చెప్పుకోవడం, నామినేషన్ వేయడం, అదే ఎన్నికల కమిషన్ డేటాలో చేర్చడం.. అంతా కుట్రలో భాగంగా జరుగుతోంది. అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా?. ఈ కుట్రను అందరి దృష్టికి తీసుకెళ్తాం: ఈ స్థాయిలో అంతులేని అక్రమాలు జరుగుతుంటే, సీఎం చంద్రబాబు, ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో ఇంత జరుగుతుంటే, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? అన్న సందేహం కలుగుతోంది. ఇవి పార్టీ పరంగా జరిగే ఎన్నికలు. అందుకే మేము మా పార్టీ అభ్యర్థులను ప్రకటించాం. వారికి ఏ ఫామ్స్, బీ ఫామ్స్ కూడా ఇచ్చాం. అందుకనే మా పార్టీకి సంబంధించిన మొత్తం అభ్యర్థుల జాబితాలను ఎస్‌ఈసీకి ఇస్తాం. హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా సమర్పిస్తాం. న్యాయం చేయమని అడుగుతాం. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం!: రాజ్యాంగం కుప్ప కూలినట్లు కాదా?: ప్రజలకు ఏ మాత్రం మంచి చేయని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు.. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసు కాబట్టే, ఎన్నికలను బుల్డోజ్ చేస్తున్నారు. అందుకే, నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని, కేంద్ర బలగాలు మొహరించాలని కోరుతున్నాం. (పశ్చిమ బెంగాల్‌లో అలాగే చేశారు). ఇంకా మా పార్టీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరుతున్నాం. దాని కోసం హైకోర్టుకు కూడా వెళ్లాం. హైకోర్టు అందుకు అనుగుణంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా ఎస్‌ఈసీ పట్టించుకోలేదు. అసలు ఎన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పెట్టారని ఎస్‌ఈసీని మేము అడిగితే, సమాధానం లేదు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏం చర్యలు తీసుకున్నారని అడిగాం. దానికీ సమాధానం లేదు. ఇంకా ఏ ఒక్కరిపై చర్యలు లేవు. ఆర్‌ఓల చేతిలో నుంచి నామినేషన్లు లాక్కుని చింపేసినా, వారు కనీసం ఫిర్యాదు కూడా చేయడం లేదు. ఇంకా మా ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు లేవు. ప్రజాస్వామ్యం అంటే, నిర్భయంగా ఓటు వేయాలి. అన్ని ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి. మరి ఇవన్నీ లేనప్పుడు రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలినట్లు కాదా? ఇవీ మా ప్రధాన డిమాండ్స్: తక్షణం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, ఒక సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌ను తీసుకొచ్చి, అతడి ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలి. దాడులు జరిగిన జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, ఐజీలను బదిలీ చేయాలి. కక్షపూరితంగా విధులు నిర్వర్తిస్తున్న 59 మంది డీఎస్పీలపై మేము ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. తక్షణం వారిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలి. నామినేషన్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సుల స్టోర్స్, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వెంటనే కేంద్ర బలగాలు రప్పించాలి. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి. తిరగబడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొండి: ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ప్రజా హక్కులు కాపాడపడతాయి. అదే నియంతృత్వ వ్యవస్థలో ప్రజలకు ఎలాంటి హక్కులు, స్వేచ్ఛ ఉండదు. కాబట్టి ప్రజలంతా ఆలోచించాలి. ఈరోజు మీ ఓటు ఎంతో ముఖ్యం. దాన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే, రేపు మీ ఆస్తులను ఇలాగే లాక్కుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో అధికారుల సమక్షంలోనే పత్రాలు లాక్కుని చింపేస్తున్నారు. రేపు మీ ఆస్తి పత్రాలు కూడా ఇలాగే అధికారులు, పోలీసుల సమక్షంలోనే లాక్కుని చింపేస్తారు. కాబట్టి, తిరగ బడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొండి. లేకపోతే ఏ ఒక్కరి ఆస్తులు, స్వేచ్ఛ, హక్కులకు గ్యారెంటీ లేదు. ఇంత క్రిమినల్స్ చేతిలో అధికారం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఇప్పుడు వీరి చేతిలో అధికారం వల్ల, ఏం అవుతుందనేది ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు అనేవి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే కాదు. అది ఒక దారుణమైన నేరం. అందుకే ఈ ప్రజాస్వామాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే, చంద్రబాబుది క్రిమినల్ కుట్ర. వారందరికీ నా హ్యాట్సాఫ్: ఈ దుర్మార్గులను ఎదుర్కొంటున్న, పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారికి తోడుగా నిలబడుతున్న నాయకులు, పార్టీ వివిధ విభాగాలు.. ముఖ్యంగా లీగల్‌సెల్ వారికి నా హ్యాట్సాఫ్. ఇంకా ముఖ్యంగా చాలా గట్టిగా నిలబడి ఈ ఎన్నికల్లో పోరాడుతున్న నా మహిళా అక్క చెల్లెమ్మలకు నా హ్యాట్సాఫ్. మీకు జరుగుతున్న అన్యాయంపై మన లీగల్‌సెల్‌కు వివరించండి. డిజిటల్ డెయిరీలోకి ఎక్కించండి. రేపు మన ప్రభుత్వం రాగానే, ప్రతి ఒక్కరిపై చర్య తీసుకుంటాం. ఈ తప్పులు, నేరాలు చేసిన ఎవ్వరినీ వదిలి పెట్టబోము. అందరికీ శిక్ష పడుతుంది. మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రజలు కసితో ఉన్నారు: ఈ అక్రమాలు, కుట్రలపై ఎస్‌ఈసీని కలిసినా లాభం లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టులే న్యాయం చేయాలి. ఇలా తొండి, అన్యాయం, దౌర్జన్యంతో ఎన్నికలు గెలవొచ్చని చంద్రబాబు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే రేపు సాధారణ ఎన్నికల్లో ఇలా చేసే అవకాశం రాదు. ప్రజలు కసితో ఉన్నారు. కచ్చితంగా బుద్ధి చెబుతారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి: ఈ కుట్రలు, అక్రమాలన్నింటినీ మేము మళ్లీ కోర్టులో వేస్తాం. అన్ని ఆధారాలు చూపుతాం. ఇవి పార్టీపరంగా జరిగే ఎన్నికలు. కాబట్టి మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. నామినేషన్లు స్వేచ్ఛగా వేసే పరిస్థితి ఉండాలని కోరుతున్నాం. ఆ పని ఎన్నికల కమిషన్ చేయాలి. కానీ, ఎస్‌ఈసీ ఆ పని చేయడం లేదు. అసలు మనం ఏ వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? లేక నియంతృత్వ వ్యవస్థలో ఉన్నామా? ఈ విష సంస్కృతి మంచిది కాదు: ఈ ప్రభుత్వం అన్నింటా విఫలమైంది. ఈ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. అందుకే ఎన్నికలను బుల్డోజ్ చేసి, ఎలాగైనా గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇలాంటి విష సంస్కృతి మంచిది కాదు. ఈరోజు నామినేషన్ పత్రాలు లాక్కుంటున్నారు. రేపు మన ఆస్తి పత్రాలు లాక్కుంటారు. అది కూడా పోలీసులు, అధికారుల సమక్షంలోనే జరుగుతుంది. ‘పచ్చమూకల దాడులు’ బుక్: ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఘటనను చూపుతూ.. ఒక బుక్ రిలీజ్ చేస్తున్నాం. ‘పచ్చమూకల దాడులు’ పేరుతో బుక్ రిలీజ్ చేస్తున్నాం. దీన్ని అందరికీ ఇవ్వబోతున్నాం. కోర్టులకు కూడా చూపుతాం. దాంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని, కాబట్టి ఈ వివరాలన్నింటినీ ప్రజలకు చెప్పాలని శ్రీ వైయస్ జగన్, మీడియాకు విజ్ఞప్తి చేశారు.