నగరడోణలో మహిళలపై పోలీసుల వేధింపులు

 పోలీసుల తీరుపై ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆగ్రహం

కర్నూలు జిల్లా, ఆలూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిప్పగిరి మండలం నగరడోణ గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీకి ఓటేస్తారనే ఉద్దేశంతో మహిళలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మండిపడ్డారు. గ్రామానికి చెందిన మహిళలపై ఎస్‌ఐ నరసింహులు బైండోవర్‌ కేసులు పెట్టేందుకు ప్రయత్నించడమే కాకుండా, గంజాయి కేసులు నమోదు చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు తెలిపారు. మహిళలను అరెస్టు చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, టీడీపీ నేతలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలను బైండోవర్‌ చేసేందుకు తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లడంతో వారు పోలీసులను, తహసీల్దార్‌ను నిలదీశారు. తమపై బైండోవర్‌ కేసులు ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తూ పోలీసుల వైఖరికి నిరసనగా ఆదోని–గుంతకల్లు రహదారిపై ధర్నాకు దిగారు. మహిళలను బెదిరించి ఎన్నికల్లో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని విరుపాక్షి డిమాండ్‌ చేశారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోలీసులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top