విజయవాడ: రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) పని చేస్తోందని, టీడీపీ కార్యాలయానికి అనుబంధ విభాగంలా కమిషన్ ్యవహరిస్తోందని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవస్థలు పని చేస్తున్నాయని, ఎన్నికల నిబంధనల అమలులో పక్షపాత ధోరణి కనిపిస్తోందని వారు స్పష్టం చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ తన బాధ్యతను విస్మరిస్తోందని ఆక్షేపించారు. వందలాది ఫిర్యాదులు, ఆధారాలు సమర్పించినా స్పందన లేకపోవడం ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోందని తెలిపారు. ఈ అంశాలన్నింటిపై విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన వైయస్ఆర్సీపీ నాయకులు, అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. మీడియాతో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే..: - ఎన్నికల సంఘం బాధ్యత విస్మరించింది: లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు కూడా వందలాది ఫిర్యాదులు, వీడియోలు, ఆడియో ఆధారాలు సమర్పించినా ఎస్ఈసీ కనీసం విచారణ చేపట్టలేదు. 150 మంది పోలీసు అధికారులపై రెండుసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. పోలీసు, రెవెన్యూ అధికారులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ నామినేషన్ పత్రాలు, పోలింగ్ ఏజెంట్ ఫారాలు చించేస్తున్నా పట్టించుకోవడం లేదు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి బ్రాంచ్ ఆఫీస్‌గా ఎస్ఈసీ మారిపోయింది. - పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలపై నిర్లక్ష్యం రాష్ట్రంలో 12,224 పోలింగ్ కేంద్రాలకు కేవలం 36,351 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో 60 వేల నుంచి 70 వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తే, ఇప్పుడు సగానికి తగ్గించడం వెనుక ఉద్దేశం ఏమిటి? బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు, రిగ్గింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారా? ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని న్యాయస్థానాలు చెప్పినా అమలు చేయడం లేదు. 12 వేలకుపైగా బూత్‌లలో 7 వేలకైనా ఈ సదుపాయాలు ఉన్నాయో లేదో స్పష్టత లేదు. సమస్యాత్మక కేంద్రాల జాబితాను కూడా వెల్లడించడం లేదు. - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం ఆగదు కడప, పులివెందుల, కర్నూలులోని కొన్ని వార్డుల్లో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం లేదు. డబ్బులు పంచుతూ, పెన్షన్లు తొలగిస్తామని బెదిరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. మాచర్లలో తల్లి మృతదేహాన్ని చూసేందుకు కూడా ఒక వ్యక్తిని అనుమతించని పరిస్థితి ఉంది. నెల్లూరు, గూడూరులో పోలీసు అధికారుల ప్రమేయంతో అభ్యర్థులను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా స్పందించని ఎస్ఈసీపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైయస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుంది. ఓటు అనే ఆయుధంతో ప్రజలు తమ తీర్పును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. - రాయలసీమ, పల్నాడులో ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఎన్నికలు: ఎం. మనోహర్‌రెడ్డి, వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో ఏకగ్రీవాల కోసం టీడీపీ నేతలు పోలీసుల సహకారంతో బెదిరింపులు, దాడులు, అక్రమ అరెస్టులు, కేసులకు పాల్పడ్డారు. పోటీ నుంచి తప్పుకోకపోతే గంజాయి కేసులు పెడతామని, రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు. కేసులు లేని వారిని సైతం బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి, వైయస్ఆర్సీపీకి మద్దతుగా నిలిస్తే ఇబ్బందులు తప్పవని భయపెడుతున్నారు. గతంలో పులివెందల, ఒంటిమిట్ట ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి గుండాలను తీసుకొచ్చి ఓటర్లను అడ్డుకున్నట్లుగానే, రేపటి పోలింగ్‌లోనూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పులివెందలలోని పోలింగ్ కేంద్రాలను ఆక్రమించే కుట్ర జరుగుతోందన్న సమాచారం మాకు ఉంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ప్రశాంతమైన ఎన్నికలు, పౌరుల స్వేచ్ఛాయుత ఓటు హక్కు కోసం న్యాయపోరాటం కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యవాదులంతా ఈ అరాచకాలను అడ్డుకుని, నిష్పక్షపాత ఎన్నికలకు సహకరించాలని మనోహర్‌రెడ్డి కోరారు. - 150 ఫిర్యాదులిచ్చినా చర్యలు లేవు.. ఓటర్లకు రక్షణ కల్పించాలి: నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గత 15 రోజులుగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రోజుకు సగటున పది చొప్పున దాదాపు 150 వినతిపత్రాలు సమర్పించాం. అయినా ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు. ఒంగోలు, కర్నూలు తదితర ప్రాంతాల్లో వైయస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్ల ఫారాలను రిటర్నింగ్ అధికారుల ఎదుటే టీడీపీ గుండాలు చించేస్తున్నా పోలీసులు, అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకుండా, నిబంధనల ప్రకారం పనిచేసిన సీఐ సుధాకర్‌రెడ్డిని సస్పెండ్ చేయడం ఏంటి? పోలింగ్‌కు పోలీసు బందోబస్తును గతంతో పోలిస్తే సగానికి తగ్గించి, ఒక్కో బూత్‌కు ఇద్దరు పోలీసులనే ఏర్పాటు చేయడం ఆందోళనకరం. రేపటి ఎన్నికల్లో ఏజెంట్లకు రక్షణ కల్పించాలి. పులివెందలలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉండకుండా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి, అక్రమాలకు పాల్పడిన గూండాలు, అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ప్రతి ఓటరూ భయపడకుండా తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేసేలా ఎన్నికల సంఘం భద్రత కల్పించాలని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్ఈసీని కలిసిన వారిలో వైయస్ఆర్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, పార్టీ స్టేట్ సెక్రటరీ మస్తాన్, మీడియా ప్యానలిస్ట్ షరీఫ్, పార్టీ నాయకుడు మందపాటి శేషగిరిరావు, తదితరులు ఉన్నారు.