తాడేపల్లి, అనంతపురం: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ప్రణాళికాబద్ధంగా వేధిస్తూ, వారి సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ ప్యానలిస్ట్ జ్వాలాపురం శ్రీకాంత్ విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అనంతపురం పార్టీ కార్యాలయంలో జ్వాలాపురం శ్రీకాంత్‌లు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. విజయవాడ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ గొర్తి శ్రీనివాసరావు ఆత్మహత్య ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఆయన మరణానికి ముందు వాట్సాప్ గ్రూపులో చేసిన సందేశం, సూసైడ్ నోట్‌లోని అంశాలపై ప్రభుత్వం తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలు, ఉద్యోగులపై ఒత్తిళ్లపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గొర్తి శ్రీనివాసరావు బంగారు ఆభరణాలను బలవంతంగా తీసుకున్నారనే ఆరోపణలపైనా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, ఎండీ చంద్రశేఖర్ ఆజాద్, సీఈవో నాగసాయి, బాలా త్రిపురసుందరి పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ గారి ప్రభుత్వ హయాంలో అర్హులైన బ్రాహ్మణ కుటుంబాలకు సుమారు రూ.800 కోట్ల సంక్షేమ ప్రయోజనాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో పాటు దాదాపు 50 వేల మందికి పెన్షన్లు అందించినట్లు వారు చెప్పారు. ప్రస్తుతం గరుడ పథకం ద్వారా అందించే అంత్యక్రియల సాయం నిలిచిపోవడం, బ్రాహ్మణ కార్పొరేషన్, సహకార సొసైటీల కార్యకలాపాలు కుంటుపడటంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గొర్తి శ్రీనివాసరావు కుటుంబానికి న్యాయం చేసి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ను పునరుద్ధరించి, అర్హులైన బ్రాహ్మణులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే... ప్రణాళిక ప్రకారం బ్రాహ్మణ సామాజికవర్గంపై వేధింపులు - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని వేధింపులకు గురిచేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. విజయవాడ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్య ఘటన దీనికి నిదర్శనం. ఆయన తన మరణానికి ముందు వాట్సాప్ గ్రూపులో పెట్టిన సందేశంలో ఆడిట్ వివరాలు సమర్పించేందుకు రెండు రోజుల గడువు కోరినా అవకాశం ఇవ్వలేదని పేర్కొన్న నేపథ్యంలో, ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపించాలి. ఉద్యోగుల ఆడిటింగ్, ఆర్థిక లావాదేవీలు పరిశీలించాల్సిన అధికారులు ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలపై వాస్తవాలను బయటపెట్టి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలి. వైఎస్ జగన్ గారి ప్రభుత్వ హయాంలో అర్హులైన బ్రాహ్మణ కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా సుమారు రూ.800 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం, దాదాపు 50 వేల మందికి పెన్షన్లు అందించాం. అర్చకులు, పురోహితులు, ఉపాధ్యాయులు, బ్రాహ్మణ ఉద్యోగులకు ఉపయోగపడేలా బ్రాహ్మణ కార్పొరేషన్, సహకార సొసైటీని బలోపేతం చేసి రుణ సదుపాయాలు కల్పించాం. కానీ ఇప్పుడు గరుడ పథకం ద్వారా అంత్యక్రియల కోసం అందించే రూ.10 వేల సాయాన్ని కూడా నిలిపివేసి ఆఖరుకి వెబ్‌సైట్‌ను కూడా మూసివేశారు. గొర్తి శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్, సహకార సొసైటీలను పునరుద్ధరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులపై తీసుకున్న చర్యలు, బ్రాహ్మణ జర్నలిస్టుపై నమోదైన కేసుల విషయంలోనూ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. గొర్తి శ్రీనివాసరావు మృతిపై అనుమానాలు - అనంతపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ప్యానలిస్ట్ జ్వాలాపురం శ్రీకాంత్ అనంతపురం: బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజర్ గొర్తి శ్రీనివాసరావు మృతి అత్యంత బాధాకరమైన విషయం. ఆయన మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి, ఆయన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అంశాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, ఎండీ చంద్రశేఖర్ ఆజాద్, సీఈవో నాగసాయి, బాలా త్రిపురసుందరి పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసింది. వైఎస్ జగన్ గారి ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమయ్యేవి, ఇప్పుడు పథకాలు అందకుండా పోయాయి. కార్పొరేషన్ డైరెక్టర్లను పక్కనపెట్టి కొందరే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కార్పొరేషన్‌లో మూడు, నాలుగు కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సంబంధిత బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. శ్రీనివాసరావు బంగారు ఆభరణాలను బలవంతంగా తీసుకున్నారనే ఆరోపణలపైనా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలి. ఆయన మృతిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, దర్యాప్తు విషయంలో జాప్యం చేయకుండా బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు ఆయన కుటుంబానికి న్యాయం చేయాలి. బ్రాహ్మణ కార్పొరేషన్‌లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై పారదర్శక విచారణ జరిపించి, బ్రాహ్మణుల సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది.