పల్నాడు జిల్లా, మాచర్ల: మాచర్ల మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియను అడ్డుకుని బూత్ క్యాప్చరింగ్, భారీ రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కుట్ర జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల ఫారాలు సమర్పించకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఫారాలు స్వీకరించేందుకు అవకాశం లేదంటూ అభ్యర్థులకు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ఏజెంట్ల ఫారాలను బలవంతంగా లాక్కుని చించివేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఏజెంట్ల ఫారాలను అడ్డుకుంటున్న వారిని ప్రశ్నించిన వైయస్ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ వ్యవహారంలో మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుకుమార్ కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ శ్రేణులు, ఎన్నికల అధికారులు కుమ్మక్కై ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించకుండా ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఏజెంట్ల ఫారాల స్వీకరణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.