వైయస్‌ఆర్ జిల్లా, కడప: కడప కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ జరగకపోవడంపై వైయస్ఆర్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరికి ఇంటి వద్దకే ఓటరు స్లిప్పు అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ఇళ్లకు వెళ్లి స్లిప్పులు పంపిణీ చేయలేదని పేర్కొంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాల మేరకే ఓటరు స్లిప్పుల పంపిణీని అడ్డుకుంటున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఓటరు స్లిప్పులు కావాల్సిన వారు సచివాలయానికి వచ్చి తీసుకోవాలని ఆడియో సందేశాలు పంపడంతో పాటు, మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్లిప్పులు అందిస్తామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. ఇంటింటికీ స్లిప్పులు పంపిణీ చేయాల్సిన బాధ్యతను వదిలేసి, ఓటర్లను సచివాలయాల చుట్టూ తిప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో కార్పొరేషన్ ఎన్నికల అధికారులు తమ బాధ్యతను నిర్వర్తించాలని, ప్రతి ఓటరికి సకాలంలో స్లిప్పు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.