పులివెందులలో అరాచకాలకు వెన్నుపోటు పార్టీ భారీ స్కెచ్‌

సీఎంఓ, డీజీపీ కార్యాలయం నుంచి పోలీసులకు ఆదేశాలు 

డీఐజీ కోయ ప్రవీణ్‌ కనుసన్నల్లో ఎన్నికల అరాచకాలు 

ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఫైర్‌ 

పులివెందుల వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ అవినాష్‌ రెడ్డి 

గతంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన దారుణాలే ఇప్పుడూ జరుగుతున్నాయి

బయట ప్రాంతాల నుంచి వేలాదిగా గూండాలను పులివెందులలో మోహరించారు

వారికి పోలీసులే లాడ్జిలు, ఫంక్షన్‌ హాల్స్‌లో ఆశ్రయం కల్పిస్తున్నారు

చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ డైరెక్షన్‌లో డీఐజీ కోయ ప్రవీణ్‌ దారుణాలు

వైయ‌స్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు ఆధారాలున్నా కనీస విచారణ లేదు

ప్రశాంతమైన పులివెందులలో మళ్లీ కక్షలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నాడు

ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ఎస్‌ఈసీ చూడాలి  

ప్రెస్‌మీట్‌లో ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి డిమాండ్‌ 

పులివెందుల: పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా జరగనీయకుండా వెన్నుపోటు పార్టీ భారీ స్కెచ్‌ వేసిందని, ప్రభుత్వ పెద్దల అండదండలతో విపరీతమైన అరాచకాలకు పాల్పడుతోందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మండిపడ్డారు. పులివెందులలో మున్సిపల్‌ ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ప్రత్యక్ష ఆదేశాలు వస్తున్నాయని, సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఈ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. డిజిపి ఆఫీస్, డిఐజి కోయ ప్రవీణ్‌ కనుసన్నల్లో పూర్తిగా వన్‌ సైడెడ్‌గా వ్యవహరిస్తూ పోలీసులు టీడీపీ నేతలకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ గారు, జగన్‌ గారి కృషితో పులివెందుల ప్రాంతానికి కృష్ణా జలాలు వచ్చి రైతులు ప్రశాంతంగా జీవిస్తుంటే, చంద్రబాబు, బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ ప్రాంతంలో మళ్లీ కక్షలు సృష్టిస్తున్నారని  మండిపడ్డారు. అందుకే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి వెబ్‌కాస్టింగ్, లైవ్‌ ఫుటేజ్‌ ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేశామని పులివెందులలో మీడియాతో మాట్లాడిన ఎంపీ అవినాష్‌రెడ్డి వెల్లడించారు.
ప్రెస్‌మీట్‌లో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

అడ్డదారిలోనైనా గెలవాలనే కుట్ర: 
    పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఎలాగైనా అడ్డదారిలో గెలవాలన్న కుట్రతో వెన్నుపోటు పార్టీ భారీ స్కెచ్‌ వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా సీఎంఓ నుంచే ఆదేశాలు జారీ అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్‌ కనుసన్నల్లో టీడీపీకి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వెన్నుపోటు పార్టీ కార్యకర్తలను పులివెందులకు తరలిస్తున్నారు.

నామినేషన్లు ప్రారంభమైన నాటి నుంచే అక్రమాలు: 
    నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకునే కార్యక్రమం మొదలుపెట్టారు. రెండో రోజు నామినేషన్లు వేయడానికి మేము బయలుదేరుతుంటే పోలీసు అధికారులే మ.1.30 గం.కు రావాలని చెప్పారు. తీరా ఆ సమయానికి వెళ్లేందుకు సిద్ధమైతే పోలీసులే మమ్మల్ని అడ్డుకున్నారు. మా కౌన్సిలర్‌ అభ్యర్థులను పోలీసులే తీసుకెళ్లి నామినేషన్లు వేయించాలని కోరినా అంగీకరించలేదు. చివరకు 37 రౌండ్ల కాల్పులు జరిపి, పొగ బాంబులు, బాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జి చేసి మా వారిని అడ్డుకున్నారు. మహిళా అభ్యర్థులను సైతం నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారు. 

నాటి ఏకగ్రీవాలపై అబద్దాల ప్రచారం:
    పులివెందులలో గతంలో 33 వార్డులు ఏకగ్రీవమయ్యాయని బీటెక్‌ రవి మాట్లాడుతున్నారు. అప్పట్లో విపక్షంలో ఉన్న వెన్నుపోటు పార్టీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఘోర పరాజయం తప్పదని తెలుసు కాబట్టి, ఆ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. మరి అలాంటప్పుడు ఎన్నికలు ఏకగ్రీవం కాక మరేమవుతుంది?.

వారి దారుణాలకు ఆధారాలు చూపించినా విచారణ లేదు: 
    ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా మా కార్యకర్తలు, అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు. మా కార్యకర్త సునీతకు చెందిన షాపును, హరిబాబుకు చెందిన రెండు బైకులను పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లో నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నారు. అయినా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 33వ వార్డులో మా అభ్యర్థి నిరంజన్‌రెడ్డికి చెందిన ట్రక్కును, ఎస్టీ అభ్యర్థి అంజినప్ప బైకును తగులబెట్టారు. అంజినప్ప ఇంటిపై కూడా పెట్రోల్‌ పోశారు. గుడ్డునగరిగుట్టలో మా సీనియర్‌ కార్యకర్త నాగరాజుకు చెందిన ఎక్స్‌యూవీ వాహనాన్ని సైతం తగులబెట్టారు. ఇన్ని ఘటనలకు సంబంధించిన ఆధారాలు ఇచ్చినా నిందితులను కనీసం విచారణకు పిలవలేదు. 
    మరోవైపు మా కార్యకర్తలపై 307 సెక్షన్‌ కేసులు పెడుతున్నారు. ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అరెస్టులు, రిమాండ్లతో వేధిస్తున్నారు. మాపై దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం ఏ రకమైన న్యాయం?.

బయటి ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చి..:
    గత ఏడాది ఆగస్టులో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బయట ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చి స్థానిక ఓటర్లను, పోలింగ్‌ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలిస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారికి లాడ్జిలు, ఫంక్షన్‌ హాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ సీఎంఓ రాజకీయ ఆదేశాలతో, డీజీపీ కార్యాలయం నుంచి వచ్చే సూచనలతో, డీఐజీ కోయ ప్రవీణ్‌ కనుసన్నల్లో జరుగుతున్నాయి. పోలింగ్‌ రోజున కూడా దొంగ ఓట్లు వేయించడం, నిజమైన ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

వెబ్‌ కాస్టింగ్‌ చేయాలని హైకోర్టును కోరాం: 
    ఈ అక్రమాలను అడ్డుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు ఫిర్యాదు చేశాం. మరోవైపు హైకోర్టులో కూడా పిటిషన్‌ వేశాం. నిజమైన ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని, దొంగ ఓట్లు పూర్తిగా నిరోధించాలని కోరాం. అందుకు ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పూర్తి స్థాయిలో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలి. లైవ్‌ ఫుటేజ్‌ అందుబాటులో ఉంచాలి.

పులివెందుల అభివృద్ధి చూసి ఓటెయ్యండి: 
    పులివెందుల అభివృద్ధి, రైతుల సంక్షేమం విషయంలో వైఎస్సార్‌ గారు, జగన్‌ గారు చేసిన కృషి ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. వారు ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించారు. జగన్‌ గారు రూ.500 కోట్లతో నిర్మించిన మెడికల్‌ కాలేజీకి మంజూరైన 50 ఎంబీబీఎస్‌ సీట్లను కూటమి ప్రభుత్వం వద్దని కోరింది. సుమారు 8 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి, కాలనీల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు, బోర్‌వెల్స్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాం. కానీ, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ కాలనీల్లో ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. రైతుల కోసం రూ.25 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ను కూడా వినియోగంలోకి తీసుకురాలేకపోయారు.
    వీటన్నింటినీ స్థానిక ప్రజలు గుర్తించాలి. పులివెందుల మున్సిపాలిటీని దొంగల చేతుల్లో పెట్టకుండా, వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ప్రమీలమ్మతో పాటు, పార్టీ పోటీ చేస్తున్న 20 వార్డుల్లో మా అభ్యర్థులను గెలిపించాలి. 

బీటెక్‌ రవి దౌర్జన్యాలు పెరిగిపోయాయి: 
    కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి బీటెక్‌ రవి ఆధ్వర్యంలో అక్రమ బెరైటీస్‌ మైనింగ్, ఇసుక అక్రమ తరలింపు జరుగుతోంది. కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్‌ తవ్వకాలతో పాటు లక్షలాది ట్రిప్పుల ఇసుకను బెంగళూరుకు తరలిస్తున్నారు. ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే దీన్ని నిరోధించాలి. యథేచ్ఛ దోపిడి అరికట్టాలి.

Back to Top