కర్నూలు జిల్లా ఆలూరు: ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, సంక్షేమానికి భరోసా ఇచ్చే వైయస్ఆర్‌సీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పిలుపునిచ్చారు. చిప్పగిరి మండలం ఏరూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, జెడ్పీటీసీ అభ్యర్థి ఉనేబది జ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థి తిమ్మాపురం వెంకటలక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. వైయస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని బుసినే విరుపాక్షి పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భూకబ్జాలు, దందాలు, అరాచకాలు పెరిగాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని గెలవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటామని, ప్రతి గడపకు అండగా నిలిచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల హక్కులకు భంగం కలిగించే చర్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జెడ్పీటీసీ అభ్యర్థి ఉనేబది జ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థి తిమ్మాపురం వెంకటలక్ష్మికి అత్యధిక మెజారిటీతో విజయాన్ని అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.