వైయ‌స్ఆర్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బుల్లె సుజాతకు మద్దతుగా సాకే శైలజానాథ్‌ ప్రచారం

 సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు వివరించిన మాజీ మంత్రి

అనంతపురం జిల్లా : బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బుల్లె సుజాతకు మద్దతుగా మాజీ మంత్రి, సింగనమల నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలు, ఓటర్లను కలుసుకుని స్థానిక సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో కొనసాగాయని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని శైలజానాథ్‌ పేర్కొన్నారు. కొత్తగా అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమవడంతో పాటు, గతంలో పెన్షన్లు పొందుతున్న కొందరి పెన్షన్లను కూడా తొలగించిందని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించే వేదికలని శైలజానాథ్‌ స్పష్టం చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థి బుల్లె సుజాతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రుత్విక్‌ హృదయ్‌, మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌, నీలం భాస్కర్‌, బోనాల హరికృష్ణ, వెంకట కొండారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, నాగముని, కాటి ఈశ్వరయ్య, సూర్యనారాయణరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top