శ్రీకాకుళం జిల్లా, టెక్కలి: సంతబొమ్మాళి మండలంలో వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను బైండోవర్ కేసుల పేరుతో పోలీసులు బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎంపీటీసీ-1 అభ్యర్థి కల్లూరి పాపారావు, ఎంపీటీసీ-2 అభ్యర్థి మల్ల నిర్మలరాజు, తల్లవలస ఎంపీటీసీ అభ్యర్థి కొన్న జగ్గారావులను అచ్చెన్నాయుడు ప్రోద్బలంతో సంతబొమ్మాళి సీఐ, ఎస్‌ఐ వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త కొన్న శ్రీరాములును రోజంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని, మందులు వేసుకోవాలని, మధ్యాహ్నం భోజనం చేయాలని శ్రీరాములు కోరినా పోలీసులు అనుమతించకుండా దుర్భాషలాడారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని, బైండోవర్ పేరుతో వేధింపులకు స్వస్తి పలకాలని కోరాయి. పోలీస్ స్టేషన్‌లో జరిగిన వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.