మాచర్లలో ఖాకీల అండతో ప‌చ్చ గూండాల దాడులు

అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులా?

పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ధ్వ‌జం

మాచ‌ర్ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్సార్‌సీపీ ప‌ల్నాడు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి 

మాచర్లలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూటమి నేతల అరాచకాలు

నామినేషన్లు వేయకుండా అడ్డంకులు.. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల బీ ఫారాల చించివేత.

అయినా వెనక్కి తగ్గకుండా బీరువా గుర్తుతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్న మా అభ్యర్థులు.

ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక కొత్త కుట్రలకు తెరతీశారు.

ఏజెంట్‌ ఫారాలు సమర్పించేందుకు పిలిపించి, అక్కడే రౌడీ, గంజాయి బ్యాచ్‌లతో అభ్యర్థులపై దాడులు.

దాడులు జరుగుతున్నా ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.

నాపై ఇప్పటికే 19 కేసులు పెట్టారు.. బెయిల్‌ రద్దు చేయిస్తామంటూ బెదిరిస్తున్నారు.

ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పోరాటం ఆపేది లేదు.

అధికారం శాశ్వతం కాదు.. అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు

మీడియా స‌మావేశంలో తేల్చి చెప్పిన‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి

మాచ‌ర్ల‌: మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బీ ఫారాలను చించివేయడం, బీరువా గుర్తుతో ప్రచారం చేస్తున్న అభ్యర్థులపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పోలీసుల అండతో కూటమి నేతలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వాటిని ప్రశ్నించిన పార్టీ నాయకులు, కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. తనపై ఇప్పటికే 19 కేసులు నమోదు చేశారని, బెయిల్‌ రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొంటూ, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్టీ అభ్యర్థుల తరఫున పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. మాచర్లలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మీడియా స‌మావేశంలో పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..

- మాచర్లలో పోలీసుల అండతో దాడులు.. బాధితులపైనే అక్రమ కేసులు

మాచర్లలో ఓటమి భయంతోనే టీడీపీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి అరాచకాలకు తెరతీసింది. మా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు, బీ ఫారాలు చించేసినా వెనక్కి తగ్గకుండా బీరువా గుర్తుతో ప్రజల్లోకి వెళ్లి మద్దతు కోరుతున్నారు. జగనన్న ఆదేశాల మేరకు మైనారిటీ మహిళ సుల్తానాను చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా నిలబెట్టాం. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక ఏజెంట్‌ ఫారాల సమర్పణ సమయంలో రౌడీ, గంజాయి బ్యాచ్‌లతో మా అభ్యర్థులు, నాయకులపై దాడులు చేయించారు. ఎన్నికల అధికారి, కమిషనర్‌, పోలీసులు చూస్తూ ఉండిపోయారు. పల్నాడు జిల్లాలో కారంపూడి, దుర్గి, వెల్దుర్తి, నాగార్జునసాగర్‌ ఎస్‌ఐలు సైతం టీడీపీ ఏజెంట్లలా వ్యవహరిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని, నామినేషన్లు వేస్తే గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. సంబంధం లేని వారిని సైతం బైండోవర్‌ పేరుతో పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నారు. ఈ ఘటనలపై ఆధారాలతో జిల్లా ఎస్పీకి, ఎస్‌ఈసీకి ఫిర్యాదులు పంపించాం. దాడులకు పాల్పడినవారు, వెనుకుండి నడిపించినవారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

- మాచర్ల అభివృద్ధి మా ప్రభుత్వ హయాంలోనే.. కూటమి హామీలకు దిక్కేది?

మాచర్ల అభివృద్ధి వైయస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. జాతీయ రహదారి రింగ్‌ రోడ్డు నిర్మాణం, 30 పడకల ఆసుపత్రిని 50 పడకలకు పెంచి, 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే ప్రతిపాదన, 5,400 మంది పేదలకు రిజిస్ట్రేషన్‌తో ఇళ్ల పట్టాల పంపిణీ మా ప్రభుత్వంలోనే చేపట్టాం. మిగిలిన పేదలందరికీ జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇళ్ల పట్టాలు అందిస్తామని మా అభ్యర్థులు ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో కొత్తగా ఒక్క పెన్షన్‌ కూడా ఇవ్వలేదు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 66 లక్షల 40 వేలకుపైగా పెన్షన్లు అందుతుండగా, కూటమి అధికారంలోకి రాగానే 6 లక్షల 40 వేల పెన్షన్లు తొలగించి, అదే డబ్బుతో రూ.4 వేల పెన్షన్‌ ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలోనే 6,400 మందికిపైగా తల్లులకు అమ్మఒడి నిలిపివేశారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ వంటి హామీలను అమలు చేయలేదు. గ్యాస్‌ సిలిండర్లలోనూ 4 నుంచి 5 కిలోల గ్యాస్‌ తగ్గించి సరఫరా చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ హయాంలో అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, డాక్టర్‌ వైఎస్సార్‌ రుణమాఫీ, విద్యా దీవెన, వసతి దీవెన, వాహన మిత్ర, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి పథకాలతో ప్రతి నెలా పేదలకు ఏదో ఒక రూపంలో సంక్షేమం అందించాం. కరోనా సమయంలోనూ అండగా నిలిచాం. ప్రజలు హామీల గురించి ప్రశ్నిస్తే పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. 11వ వార్డులో ప్రజలు నిలదీసినప్పుడు మా పార్టీ నాయకుడు అగ్గిరాముడిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోబెట్టారు.

- 19 కేసులు పెట్టినా భయపడం.. 36 మంది అభ్యర్థుల పోరాటం ఆగదు

నామినేషన్‌ వేసినప్పటి నుంచి నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే నాపై 18 కేసులు ఉండగా, తాజాగా మరో కేసు పెట్టి 19కు చేర్చారు. గతంలో బుర్రిపాలెం జంట హత్యల కేసులో అన్యాయంగా ఇరికించి 98 రోజులు జైలులో పెట్టారు. ఇప్పుడు అదే కేసును సాకుగా చూపి బెయిల్‌ రద్దు చేయిస్తామంటూ బెదిరిస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, బెయిల్‌ రద్దు చేసినా భయపడే ప్రసక్తే లేదు. ప్రలోభాలు, బెదిరింపులు, దాడులు ఎదురైనా వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన 36 మంది అభ్యర్థులు జగనన్న నాయకత్వంపై నమ్మకంతో పోటీలో నిలిచారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు జరిగిన అన్యాయాలను వివరిస్తూ, జగనన్న మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇస్తున్నారు. మా అభ్యర్థులపై దాడులు చేసినవారు, చైర్‌పర్సన్‌ను బెదిరించినవారు, మహిళా కౌన్సిలర్‌పై చేయి చేసుకున్నవారు, అక్రమాలకు పాల్పడిన అధికారుల వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని అన్ని ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అధికారం శాశ్వతం కాదు. ప్రజలపై నమ్మకం ఉంటే మా అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వండి, స్వేచ్ఛగా ఎన్నికలు జరగనివ్వండి. ప్రజలే ఎవరిని గెలిపించాలో నిర్ణయిస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా పార్టీ కోసం పోరాటం ఆపేది లేదు. కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలి. జగనన్న పిలుపు మేరకు ముందుకు సాగుతామని మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.

- ఎన్ని కుట్ర‌లు చేసినా మా విజ‌యాన్ని ఆపలేరు
: సుల్తానా, వైయ‌స్సార్‌సీపీ బ‌ల‌ప‌రిచిన మాచ‌ర్ల మున్సిపాలిటీ చైర్‌ప‌ర్స‌న్ అభ్య‌ర్థి

మాచర్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా నన్ను బలపరిచిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి గారికి, వెంకటరామిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మైనారిటీ మహిళను రాజకీయంగా ఎదగనీయకుండా బీ ఫారాలు ఇవ్వకుండా, మహిళా అభ్యర్థులను, ఏజెంట్లను అడ్డుకుంటూ ఎన్నో ఇబ్బందులు పెట్టారు. పోలీసులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ మా అభ్యర్థులపై దాడులకు దిగారు. అయినా ఫ్యాన్‌ గుర్తు లేకపోయినా బీరువా గుర్తుతో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల అభిమానాన్ని సంపాదించాం. ప్రజలు తమ రేషన్‌ కార్డులు, వాలంటీర్‌ ఉద్యోగాలు తొలగించారని, తాగునీరు, రోడ్లు, కాలువల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని మా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్‌ సిక్స్‌ హామీలతో వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయలేదని ప్రజలే చెబుతున్నారు. జగనన్న ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేసిన సేవలను వారు గుర్తుచేసుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల అభిమానాన్ని ఎవరూ దూరం చేయలేరు. ఎన్ని కుట్ర‌లు చేసినా మా విజ‌యాన్ని ఆప‌లేరు అని సుల్తానా ధీమా వ్య‌క్తం చేశారు.  

Back to Top