ముంపు గ్రామాల్లో బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ నేతల అండ

వరద నీటిలో పర్యటన.. బాధితులకు భోజనాలు, తాగునీరు, నిత్యావసరాల పంపిణీ

 సాడి శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, పిలక రాజలక్ష్మి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

 ఇచ్చాపురం:  భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అండగా నిలిచారు. నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిలక రాజలక్ష్మి ముంపు గ్రామాలు, ఇచ్చాపురం పట్టణంలోని నీటమునిగిన కాలనీల్లో పర్యటించి బాధితుల కష్టాలను తెలుసుకున్నారు. ఇళ్లలోకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో వంట చేసుకునే పరిస్థితి లేకపోవడం, బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు తడిసి పాడవడం, రెండు రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలకు ధైర్యం చెబుతూ కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు సాడి శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, పిలక రాజలక్ష్మి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు రోడ్డుపై పొయ్యిలు ఏర్పాటు చేసి, టెంట్లు వేసి భోజనాలు సిద్ధం చేశారు. వేడి అన్నం, పప్పు, కూర, సాంబార్‌, పులుసుతో పాటు భోజన పొట్లాలు, తాగునీరు, బిస్కెట్లు, మజ్జిగ, బ్రెడ్‌ ప్యాకెట్లు బాధితులకు అందించారు. వృద్ధులు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా భోజనాలు, మందులు అందిస్తూ సహాయక చర్యలు కొనసాగించారు. వరద బాధితుల ఇళ్లకు వెళ్లి వారి అవసరాలను తెలుసుకుంటూ సహాయం అందించారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా అండగా నిలవడమే వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యమని సాడి శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, పిలక రాజలక్ష్మి స్పష్టం చేశారు. వరదలు తగ్గే వరకు బాధితులకు రోజూ మూడు పూటలా భోజనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి వరద నీటి తొలగింపు, విద్యుత్‌ పునరుద్ధరణ, బాధితులకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. కష్టకాలంలో తమ వద్దకు వచ్చి భోజనాలు, అవసరమైన సహాయం అందిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
 

Back to Top