తాడేపల్లి: కాకినాడ జిల్లా కత్తిపూడి మండలం రావికంపాడు జంక్షన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవానీ దీక్ష పూర్తి చేసుకుని విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.