కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ గృహ నిర్బంధం

మమ్మల్ని నిర్బంధించి.. నామినేషన్ కేంద్రం వద్ద మా అభ్యర్థులపై దాడులు చేయిస్తారా?

పోలీసుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ కందుకూరు ఇన్‌ఛార్జి ఆగ్రహం

కందుకూరు: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కందుకూరు వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్‌ను పోలీసులు పార్టీ కార్యాలయంలోనే గృహ నిర్బంధం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్లవద్దంటూ నోటీసులు జారీ చేసి ఆయనను అడ్డుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఒకవైపు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచగా, మరోవైపు నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ శ్రేణులు పోలీసుల సమక్షంలోనే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులకు దిగాయని పార్టీ వర్గాలు ఆరోపించాయి. అభ్యర్థులకు అండగా నిలవాల్సిన నాయకులను నిర్బంధించి, నామినేషన్ కేంద్రాల వద్ద తమ అభ్యర్థులకు రక్షణ లేకుండా చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి చీకటి రోజులు వస్తాయని అనుకోలేదు

తనను గృహ నిర్బంధం చేయడంపై బుర్రా మధుసూదన్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  “మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి.. నామినేషన్ కేంద్రం వద్ద మా అభ్యర్థులను కొట్టిస్తారా?”  అంటూ పోలీసుల తీరును ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చీకటి రోజులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించడం, వారికి భద్రత కల్పించడం అధికార యంత్రాంగం బాధ్యత. కందుకూరులో చోటుచేసుకున్న ఘటనలపై విచారణ జరిపి, అభ్యర్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, నామినేషన్ల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగేలా చూడాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి. 

Back to Top