విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో చోటు చేసుకుంటున్న అంతులేని అక్రమాలపై లోక్‌భవన్‌లో గవర్నర్ శ్రీ అబ్ధుల్ నజీర్‌ను కలిసిన శ్రీ వైయస్ జగన్ ఫిర్యాదు చేశారు. అన్నింటిపై పూర్తి సాక్ష్యాధారాలను ఆయన గవర్నర్‌కు సమర్పించారు. రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారని, పలుచోట్ల రిటర్నింగ్ అధికారుల ఎదుటే నామినేషన్ పత్రాలను చింపేసిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటూ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మౌనం వహించడం, పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుగా మారి తప్పుడు కేసులు బనాయిస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడి, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, మద్దిల గురుమూర్తిలపై పెట్టిన అక్రమ కేసులను కూడా ఆయన ప్రస్తావించారు. వీటన్నింటి నేపధ్యంలో స్థానిక ఎన్నికల్లో పారదర్శకత తీసుకు రావడానికి నామినేషన్ల ప్రక్రియను ఆన్లైన్ విధానంలో లేదా సెంట్రలైజ్డ్ విధానంలో స్వీకరించాలని, ఎన్నికల విధుల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించాలని, పోలింగ్ బూతులు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి సీసీ కెమెరాల నిఘాతో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ వెబ్‌కాస్టింగ్) నిర్వహించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం లోక్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..: దేశంలో ఎక్కడా లేని విధంగా అప్రజాస్వామ్య పరిస్థితులు: రాష్ట్రంలో ఎంతటి దారుణమైన అప్రజాస్వామ్య పరిస్థితి ఉందంటే.. బహుశా దేశంలో ఎక్కడా ఈ రకమైన పరిస్థితి ఉండదు. ఇదే విషయాన్ని గవర్నర్ గారికి అర్థమయ్యేలా సుదీర్ఘంగా వివరించాం. రాష్ట్రంలో దాదాపు 8 మున్సిపాలిటీల్లో అసలు నామినేషన్లే పడని పరిస్థితి కల్పించారు. కౌన్సిలర్ గా గానీ, చైర్మన్‌గా గానీ అసలు ఏడు చోట్ల పూర్తిగా జీరో నామినేషన్లు నమోదు కాగా, మరో చోట కేవలం 3 మాత్రమే పడ్డాయి. ఇంకొక 19 చోట్ల కేవలం 36 శాతం మాత్రమే నామినేషన్లు పడగలిగాయి. మరో 8 చోట్ల మా అభ్యర్థులు నామినేషన్లు వేసి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్పులు తీసుకున్నప్పటికీ, ఏకంగా 6 ఆర్వో ఆఫీసుల్లో అధికారుల ఎదుటే నామినేషన్ పత్రాలను చింపేశారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేదంటే పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రేపు ఎన్నికల రోజున ఏ స్థాయిలో అరాచకాలు ఉంటాయో రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీల పరిస్థితి ఏమిటి?: మున్సిపాలిటీలు, అర్బన్ లోకల్ బాడీస్లోనే ఈ దుస్థితి ఉంటే, బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ప్రజలు గమనించాలి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీసం నామినేషన్లు కూడా వేసి పోటీలో నిలబడే పరిస్థితి లేదంటే.. ఒక ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా తాము గెలుస్తామన్న నమ్మకం చంద్రబాబుకు లేదని స్పష్టమవుతోంది. ప్రజలకు మంచి చేశానని, ఆ మంచి వల్ల తనకు ఓట్లు పడతాయని నమ్మే ఏ ముఖ్యమంత్రీ ఇలా ఎన్నికల్లో పోటీని చూసి భయపడడు. ఎన్నికల్లో పోటీకి దిగితే కనీసం ఓట్లు కూడా పడవని భయపడే ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా లాలూచీ పడింది: ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియను న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నడిపించాల్సిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) పూర్తిగా ప్రభుత్వంతో లాలూచీ పడింది. ప్రస్తుతం ఎస్ఈసీగా ఉన్న అనిల్ చంద్ర పునీత ట్రాక్ రికార్డు చూస్తే అంతా స్పష్టమవుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన్నే చీఫ్ సెక్రటరీగా నియమించారు. అప్పట్లో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం కోసం ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశిస్తే, సీఈసీ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ చంద్రబాబు మెప్పు కోసం ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి నియమించిన చరిత్ర ఈయనది. దాంతో సీఈసీ ఆగ్రహించి ఏకంగా అనిల్ చంద్ర పునీతను సీఎస్ పదవి నుంచే తొలగించింది. దానిపై చంద్రబాబు కోర్టుకు వెళ్లినా.. న్యాయస్థానం మొట్టికాయలు వేసి సీఈసీ నిర్ణయమే కరెక్ట్ అని తేల్చింది. అలాంటి వ్యక్తి పదవీ విరమణ పొందాక, మళ్లీ తీసుకొచ్చి చంద్రబాబు ఎస్ఈసీగా కూర్చోబెట్టారు. అలాంటి కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది? పోలీసులు బాబుకు ఊడిగం చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది ఆలోచించాలి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తీరు అత్యంత దారుణంగా మారింది. ఉన్నత స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలు, డీఐజీలు పూర్తిగా చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తున్నారు. వాళ్లని నేను మార్చలేను. కానీ చిన్న స్థాయిలో ఉన్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా.. కనీసం మీరైనా మనస్సాక్షితో ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. పోటీ చేయడానికి వచ్చిన వారిని నిలబడనీయకపోవడం, ఓటు వేయడానికి వచ్చే ఓటర్లను ఓటు వేయనీయకపోవడం అంటే మన చేతులతో మనమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఈ అన్యాయాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు పోలీసులు, చిన్న ఉద్యోగులు, ప్రజలంతా ప్రశ్నించాలి. అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి గట్టిగా తిరగబడాలి. ఆర్వో ఆఫీసుల్లో టీడీపీ గూండాలు.. వైయస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు: తప్పులు, దౌర్జన్యాలు వీళ్లే చేస్తూ మళ్లీ ఎదురు మా వాళ్లపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఆర్వో ఆఫీసుల్లోకి తెలుగుదేశం మూకలను వందలు, వేల సంఖ్యలో మారణాయుధాలతో అనుమతిస్తున్నారు. పోలీసులు వారికి రక్షణగా నిలుస్తున్నారు. అదే వైఎస్సార్సీపీ అభ్యర్థుల విషయానికి వస్తే కేవలం నలుగురిని (1+3) మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. లోపలికి వెళ్లిన అభ్యర్థుల చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చింపేస్తున్నారు. పులివెందులలో మొత్తం 40 వార్డులు ఉంటే తొలిరోజు కేవలం 21 వార్డుల్లో మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. మిగిలిన 19 చోట్ల నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న వీళ్లే మా వారిపై 307 హత్యాయత్నం కేసులు పెట్టారు. డీఎస్పీ, సీఐలను చంపేందుకు ప్రయత్నించారంటూ ఎఫ్ఐఆర్లో ‘50 ప్లస్ 500 మంది ఇతరులు’ అని రాశారు. అంటే నియోజకవర్గంలో ఉన్న వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులందరినీ ఆ 500 మంది జాబితాలో ఇరికించి జైల్లో పెట్టడమే వీరి కుట్ర. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నాటికి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున ఎవరూ లేకుండా అందరినీ అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఎంపీలపై దాడులు.. కార్లలో మందు బాటిళ్లు పెట్టిన పోలీసులు: వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై జరిగిన దాడులన్నింటినీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. ఎంపీ మిథున్ రెడ్డి పక్కనే సీఆర్పీఎఫ్ బలగాలు ఉండగానే ఆయన కాన్వాయ్‌పై దాడి చేసి కార్లను ఏ రకంగా బోల్తా కొట్టించారో వివరించాం. బోల్తా పడిన కార్లలో మందు బాటిళ్లను నిటారుగా నిలబెట్టి పోలీసులు తప్పుడు సాక్ష్యాలు సృష్టించిన ఫొటోలను గవర్నర్‌కు చూపించాం. ఎంపీ గురుమూర్తి, ఎంపీ అవినాష్ రెడ్డిలపై పెట్టిన తప్పుడు కేసులను ఆధారాలతో సహా తెలియజేశాం. గవర్నర్ గారు మంచి మనిషే, ఆయన బాధపడుతూ చేయగలిగినదంతా చేస్తానని చెప్పారు. కానీ ఆయన పరిధి కూడా పరిమితమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో రాజ్యాంగబద్ధ వ్యవస్థలు విఫలమైతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఈ పరిణామాలన్నింటిలో బాధాకరమైన విషయం ఏమిటంటే.. నిలదీసి సరిదిద్దాల్సిన వ్యవస్థలు చూసీచూడనట్లు వదిలేయడం. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు జోక్యం చేసుకుని గట్టిగా మందలించి ఎన్నికల ప్రక్రియను సరిచేయాల్సి ఉండగా, చూసీచూడనట్లు ఉండటం ఆవేదన కలిగిస్తోంది. ప్రజాస్వామ్యంలో న్యాయం జరగనప్పుడే అసంతప్తి పెరిగి సమాజంలో నక్సలిజం పుడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తీవ్రంగా పోరాడే క్రమంలోనే తీవ్రవాద ఆలోచనలు వస్తాయి. అందుకే మేము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాం, అత్యున్నత న్యాయస్థానంలో కచ్చితంగా పిటిషన్లు దాఖలు చేస్తాం. గవర్నర్‌కు చేసిన ప్రధాన విజ్ఞప్తులు: ఎన్నికలు న్యాయంగా జరగడం కోసం గవర్నర్ గారికి పలు స్పష్టమైన డిమాండ్లు చేశాం. – నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి తీసుకురావాలి. – లేదా ఎస్ఈసీ ఆఫీసు, కలెక్టరేట్లలో సెంట్రలైజ్డ్ విధానంలో నామినేషన్లు స్వీకరించాలి. – రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేనందున ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించాలి. – పోలింగ్ బూతుల లోపల, బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి లైవ్ ఫుటేజీని ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. – బ్యాలెట్ బాక్సులు ట్యాంపరింగ్ కాకుండా స్ట్రాంగ్ రూమ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలి. – కౌంటింగ్ హాళ్లలోనూ సీసీ కెమెరాలు పెట్టాలి. ఫారం–17సి పై నమోదైన ఏజెంట్ల సంతకాలు అసలైనవా లేక ఫోర్జరీ సంతకాలా అన్నది సీసీ కెమెరాల నిఘాలో పారదర్శకంగా వెరిఫై చేయాలి. వచ్చే ఎన్నికల్లో బాబు ఓటమి తప్పదు: ఎల్లకాలం తమ ఆటలే సాగుతాయని విర్రవీగే ముఖ్యమంత్రులకు కాలమే సమాధానం చెబుతుంది. ప్రజలు, దేవుడు ఇవన్నీ చూస్తూ ఊరుకోరు. కచ్చితంగా మొట్టికాయలు వేస్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు పార్టీకి సింగిల్ డిజిట్ కూడా దాటని పరిస్థితిని దేవుడు, ప్రజలు కలిసి తీసుకొస్తారు. ఈరోజు అధికారం చేతిలో ఉంది కాబట్టి కొడుతున్నారని.. అయితే అలా కొట్టినా పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, గట్టిగా నిలబడాలని శ్రీ వైయస్ జగన్ పిలుపునిచ్చారు. 2029లో వైయస్సార్సీపీదే విజయం అన్న ఆయన, అప్పుడు ఈ అక్రమ వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేద్దామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, డాక్టర్ మధుసూధన్, కల్పలతారెడ్డి, రహుల్లా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు శ్రీ వైయస్ జగన్ వెంట, గవర్నర్‌ను కలిశారు.