రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి

ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా జ‌రిగే ప‌రిస్థితి లేదు

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల స్ప‌ష్టీక‌ర‌ణ 

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ని క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు 

రాష్ట్రంలో ప్ర‌మాద‌క‌ర స్థితిలో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌

పోలీసుల ఎదుటే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల‌పై దాడులు

ఎన్నిక‌ల అధికారులే మా నామినేష‌న్లు తీసుకోవ‌డం లేదు

అధికార కూట‌మితో పోలీసులు కుమ్మ‌క్కై కుట్ర రాజ‌కీయాలు

నిజాయితీగా పోటీ చేసి గెలిచే స‌త్తా లేక‌నే అడ్డదారులు 

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల స్ప‌ష్టీక‌ర‌ణ 

విజయవాడ: ఎన్నికల వ్యవస్థను, పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన ఈ అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని రాష్ట్రంలో బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నిక‌ల కమిష‌న‌ర్‌ని క‌లిసి నామినేష‌న్ల ప్ర‌క్రియ‌లో అధికార కూట‌మి నాయ‌కులు, పోలీసులు కుమ్మ‌క్కై చేస్తున్న దుర్మార్గాల‌ను ఆధారాల‌తో స‌హా వివ‌రించారు. అనంత‌రం వారు మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి పోలీసు అధికారి, కూట‌మి నాయ‌కులు చట్టం ముందు దోషులుగా నిలబడే కాలం దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలను హైజాక్ చేయాలని చూస్తున్న చంద్రబాబు కుట్రలను ప్రజల గొంతుతో ఎండగడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేదని వారు మండిపడ్డారు. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో నామినేషన్లు వేయడానికి వస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను, నాయకులను అడ్డుకుంటూ పోలీసులే ప్రత్యక్షంగా టీడీపీ గుండాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల అండతో నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుని చింపేయడం, ప్రత్యర్థులపై భౌతిక దాడులకు తెగబడటం ఈ ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రిటర్నింగ్ ఆఫీసర్లు సైతం ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి నామినేషన్లు స్వీకరించడానికి నిరాకరిస్తున్నారని ధ్వజమెత్తారు. మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా కూట‌మి నాయకులు దౌర్జ‌న్యాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎన్ని బెదిరింపులు, అడ్డంకులు సృష్టించినా వైయ‌స్ఆర్‌సీపీ త‌న పోరాటాన్ని ఆపబోదని, 2029లో గెలుపే లక్ష్యంగా ఈ పోరాటం కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులంతా చివరి వరకు వెనకడుగు వేయకుండా పోరాడుతాయని తేల్చిచెప్పారు.

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ని క‌లిసిన వారిలో శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ తూమాటి మాధ‌వ‌రావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసుర‌త్నం, మురుగుడు హ‌నుమంత‌రావు, క‌ల్ప‌ల‌తారెడ్డి, రూహుల్లా, ముధుసూద‌న్‌, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌తీష్ రెడ్డి, పార్టీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయ‌ణ‌మూర్తి, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, పార్టీ అధికార ప్ర‌తినిధి నాగార్జున యాద‌వ్ త‌దిత‌రులు. 

ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే... 

ఆర్వోలే నామినేష‌న్లు తిర‌స్క‌రిస్తున్నారు
- సింగారెడ్డి సతీష్ కుమార్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పోలీస్ యంత్రాంగం ఉందా అనే సందేహం కలుగుతోంది. నామినేషన్ కేంద్రాల వద్దే దౌర్జన్యాలు చేసి పత్రాలు చించివేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల అధికారులు కూడా ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి నామినేషన్లను స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడూ చూడలేదు. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్క అధికారికీ తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుంది.

పోలీసుల స‌మ‌క్షంలోనే దాడులు 
- తూమాటి మాధవరావు, మండలి డిప్యూటీ చైర్మన్ 

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి, లా అండ్ ఆర్డర్ అనే మాటే లేకుండా పోయింది. పోలీసులు చట్టానికి సెల్యూట్ చేయాల్సింది పోయి, అధికార పార్టీ నాయకుల ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారు. నామినేషన్లు వేయడానికి వెళ్తున్న మా నాయకులపై, అభ్యర్థులపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందడం వల్లనే ఈ అనూహ్య పరిస్థితులు తలెత్తాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం.

నిజాయితీగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే ధైర్యం లేక అడ్డ‌దారులు
- లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ 

తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసుల వేధింపులను తట్టుకుని నామినేషన్లు వేస్తే, వాటిని బలవంతంగా లాక్కుని చింపేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అరాచక పాలనపై మేము ఇప్పటికే ఎస్ఈసీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల ప్రక్రియలో మార్పు రాకపోతే మా పార్టీ శ్రేణులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతాం.

ఎస్ఈసీ కఠినమైన చర్యలు తీసుకోవాలి
- మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే వాతావరణం ఎక్కడా లేదు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకుండా ముందే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు పోలీసులే అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎస్ఈసీ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజల తీర్పును గౌరవించకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.

మ‌హిళ‌లపై దాడులు హేయం
- కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ 

ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న మా నాయకురాళ్లపై కూడా దాడులు చేయడం దారుణం. పోలీసులు కనీసం మహిళలని కూడా చూడకుండా వారిని ఇబ్బంది పెడుతూ నామినేషన్లు అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కులను కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. మహిళలపై దాడులు చేస్తున్న వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా పోలీసులే వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ అన్యాయాలను ఎదిరించి మహిళా లోకం అంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజు వస్తుంది.

అప్ర‌జాస్వామికంగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌
- ఏసురత్నం, ఎమ్మెల్సీ 

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరియు నామినేషన్ల ప్రక్రియ అత్యంత అప్రజాస్వామికంగా సాగుతోంది. అధికార పార్టీ నేతలు పోలీసుల సహకారంతో మా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా భయపెట్టి అడ్డుకుంటున్నారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తోంది. ఎన్నికల కమిషన్‌కు ఎన్ని ఫిర్యాదులు చేసినా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మేమంతా చివరి వరకు ఈ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాం.

రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం న‌డుస్తోంది
- టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే

ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అధికారులు బాహాటంగా నిరూపిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్నారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుంది. ఎన్నికల వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన ఈ ప్రభుత్వానికి ప్రజలే త్వరలో తగిన పాఠం నేర్పుతారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించినా, దాడులు చేసినా మేము ఎక్కడా వెనకడుగు వేయం.

Back to Top