తాడేపల్లి: రాష్ట్రంలో ఓవైపు వైయస్ఆర్సీపీఅభ్యర్ధుల్ని నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం, వేసినా భయపెట్టి నామినేషన్లు విత్ డ్రా చేయించడం, కాదంటే దాడులకు దిగడం చేస్తున్న వెన్నుపోటు పార్టీ.. చివరికి వైయస్ఆర్సీపీ చేతులెత్తేసిందని, కూటమి అభ్యర్ధులు ఏకగ్రీవంగా గెలిచారని చెప్పుకోవడం సిగ్గుచేటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం అండతో టీడీపీ చెలరేగిపోతోందని, పోలీసులు అంతకంటే ఓవర్ యాక్షన్ చేస్తూ వైయస్ఆర్సీపీ అభ్యర్ధులపై దాడులకు దిగుతున్నారని ఆయన ఆక్షేపించారు. పులివెందులలో ఎలాంటి కవ్వింపు లేకుండానే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకేమన్నారంటే.. చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు: ప్రజాస్వామ్యంలో ప్రజలదే విజయం, మాదే విజయం, నామినేషన్లు వేయలేదంటే అభ్యర్ధులే లేరని, వైయస్ఆర్సీపీదౌర్జన్యాలు చేస్తోందంటూ చంద్రబాబు తాను చెప్పుకోవడంతో పాటు తన మీడియాలోనూ ప్రచారాలు చేయించుకుంటున్నారు. ఓవైపు మా కార్యకర్తలు, నాయకుల మీద దాడులు చేయిస్తూ, మరోవైపు మాపైనే దుష్ప్రచారాలు చేస్తున్నారు. తన గంజాయి బ్యాచ్ ను, తాము చేస్తున్న హింసను మాకు ఆపాదిస్తున్నారు. పోలీసులతో మా కార్యకర్తలపై దాడులు చేయిస్తూ, తప్పుడు కేసులు పెట్టిస్తూ, టీడీపీ నాయకులకు రక్షణ కల్పిస్తూ, అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. శిఖండిలా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇదంతా చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరంగా, అప్రజాస్వామికంగా ఉందో మూడు, నాలుగు రోజులుగా చూస్తున్నాం. నామినేషన్లు వేయనివ్వకపోగా.. మా నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టిస్తున్నారు. వైయస్ఆర్సీపీ పోటీలో ఉంటే ఎంతగా భయపడుతున్నారో, ప్రభుత్వ వైఫల్యం ఎక్కడ బయటపడుతుందో అని ఇలాంటి దాడుల కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి పరిధిలోని దుగ్గిరాల మండలంలో దళిత నాయకుడు రాజయ్యను టార్గెట్ చేశారు. ఆయన ఈసారి మా పార్టీ తరఫున ఎంపీపీగా పోటీ చేసి గెలుస్తారనే భయంతో పాత ఫిర్యాదులతో పీడీ చట్టం ప్రయోగించారు. దళిత, సీనియర్ నాయకుడిని ఇక్కడి నుంచి తరలించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. కడప జిల్లాలో భయోత్పాతం సృష్టిస్తున్నారు: అభ్యర్ధులు పోటీ చేయకుండా చూడటం, నామినేషన్లు వేయకుండా చూడటం, అక్కడా విఫలమైతే ఆ నామినేషన్లను విత్ డ్రా చేయించేందుకు కుట్రలు చేస్తున్నారు. అక్కడా విఫలమైతే నామినేషన్లు తిరస్కరించేలా చేస్తున్నారు. అలాగే కుల సర్టిఫికెట్లు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. తిరుపతిలో మా అభ్యర్ధి జేబీ శ్రీనివాస్ నామినేషన్ వేస్తే ఆయన ఇంటి వద్దకు వచ్చి జనసేన అభ్యర్ధి భర్త బెదిరిస్తున్నారు. నేను చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా.. మా అభ్యర్ధులపై దాడులకు పాల్పడుతున్న వారు పోలీసులా లేక రాక్షసులా. వీళ్లు మనల్ని రక్షించడానికి ఉన్నారా లేక మహిళలని కూడా చూడకుండా గూండాల్లా కొట్టేందుకు ఉన్నారా. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీళ్లు ఒప్పుకోరట. నియంతృత్వంలో అయినా, మన దేశంలో ఎమర్జెన్సీలో అయినా ఈ పరిస్ధితి లేదు. దీనిపై స్పందించడానికి ఎన్నికల సంఘం కూడా అవసరం లేదు, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత. నామినేషన్ వేయాలనుకుంటేనే పీడీ యాక్ట్ పెడతామంటే ఎలా. వీళ్లకు తెలిసిన ఏకైక విద్య చేతిలో తప్పుడు మీడియా ఉంది కాబట్టి ఎదురుదాడులు చేస్తున్నారు. కడప మేయర్ అభ్యర్ధి మీద నిన్న రాత్రి దాడి చేశారు. ఓ పక్కన అభ్యర్ధి భర్త మా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. మరోవైపు మేయర్ అభ్యర్ధి ఇంటి మీద దాడి చేశారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకోమని దాడులు చేసి భయోత్పాతం సృష్టిస్తున్నారు. కడపలో ఇప్పటికే 10-12 మంది నామినేషన్లు వేస్తే తిరస్కరించారు. 40-50 మంది నామినేషన్ వేద్దామనుకుంటే పోలీసులే అడ్డుకున్నారు. ఇక మిగిలింది మేయర్ అభ్యర్ధి. ఆయన ఇంటిపై దాడులు చేసి విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరికి కూటమి అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారంటూ వార్తలు రాయించుకుంటున్నారు. వందల మందిపై అక్రమ కేసుల బనాయింపు: చేతనైతే పోటీ చేయాలి కానీ ప్రత్యర్థుల్ని అడ్డుకుని ఏకగ్రీవం చేయించుకోవడం ఏంటి ? అధికారం ఉందన్న అహంతో చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు నాటిన విత్తనం రేపు పెద్ద చెట్టు అవుతుంది. అవే కాయలొస్తాయి. ఈ దాడులకు అండగా నిలుస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎస్ఈసీకి పలు ఫిర్యాదులు చేశాం. వాటిపై ఎస్ఈసీ స్పందించక పోయినా ఆ రికార్డు ఉంటుంది. నామినేషన్ వేశాక బెదిరించి, ఫోర్జరీలు చేసి విత్ డ్రా చేసుకున్నారని చెప్తారనే చిత్తూరులో వీడియోలు రికార్డు చేసి పెట్టాల్సి వచ్చింది. నామినేషన్ వేశాక విత్ డ్రా దశ పూర్తయ్యే వరకూ ఇలా జాగ్రత్త పడాల్సి వస్తోంది. నామినేషన్లు వేశాక మేం ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు చేసిన తప్పులు ఇవీ అని చెప్పుకోవాలి. కానీ ఇవేం లేకుండా ఈ దాడులు ఎదుర్కొని అభ్యర్ధుల్ని కాపాడుకోవాల్సి వస్తోంది. ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా రెండు గ్రూపులు ఘర్షణ చేసుకుంటే పోలీసులు జోక్యం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏమీ లేకుండానే, నామినేషన్ వేసే ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు పోలీసులు ఏకంగా, చట్ట విరుద్ధంగా రంగంలోకి దిగిపోతున్నారు. పులివెందులలో మా అభ్యర్ధులు రాఘవరెడ్డి, ఇతరుల మీద పోలీసులే రెండు హత్యాయత్నం కేసులు పెట్టారు. 921 మంది మీద ఇలా కేసులు పెట్టారు. ఇందులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో నాయకులందరి మీదా ఈ కేసులు పెడుతున్నారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 921 మంది క్షేత్రస్థాయి నాయకుల మీద ఇలా కేసులు పెడుతున్నారంటే అసలు అక్కడ ఎన్నికలు చేయించే ఉద్దేశం మీకు లేదు. జీవిత ఖైదు లేదా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. అరెస్టు చేశారు కాబట్టి వెంటనే బెయిల్ కూడా రాదు. 600 మంది ఎలా ఒకేసారి హత్యాయత్నం కేసులు పెడతారు? ఏ కేసులో అరెస్టు అయి బయటికి రాలేరో, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేయవచ్చో అలాంటి కేసులు పెట్టేస్తున్నారు. నాలుగుసార్లు గెలిచి, ఛీఫ్ విప్ గా కూడా పనిచేసిన జి.శ్రీకాంత్ రెడ్డి ఆఫీసునూ రాయచోటి లో కాల్చేశారు. తిరిగి అదే రాయచోటిలో 300 మందిపై ఎదురు కేసులు పెట్టారు. కడప, దర్శిలోనూ ఇలాగే హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. పులివెందుల పోలీసుల కాల్పులపై హైకోర్టు జడ్డితో విచారణ చేయాలి: ఈ కేసులకు వైయస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ భయపడరు. కానీ ఈ కేసుల వల్ల యాక్టివ్ గా ఎన్నికల్లో పాల్గొనకుండా కాస్త చికాకు అవుతుంది. అధికార బలం, మదంతో ఏకగ్రీవాలు చేసుకుని జగన్ కు ఝలక్ అని ప్రచారాలు చేసుకుంటున్నారు. కడపలో కార్పోరేటర్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, మేయర్ అభ్యర్ధి నామినేషన్ వేస్తే విత్ డ్రా చేసుకోమని బెదిరిస్తున్నారు. మీరు మాత్రం 66 వార్డుల్లో నామినేషన్లు వేసుకుని, మా పార్టీ నుంచి ఒక్క మేయర్ అభ్యర్ధి నామినేషన్ వేస్తే దానికీ భయపడుతున్నారు. స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ పక్కనపెడితే, అసలు బరిలో నిలబడటమే గగనం అన్నట్లుగా పరిస్ధితులు మార్చేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాటం చేస్తున్నాం. చట్టాలు అమలు చేయాల్సిన ప్రభుత్వం, ఎస్ఈసీలే ఇలా చేస్తుంటే ఇక మేం ఎవరికి చెప్పుకోవాలి. అందుకే మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పులివెందులలో మా అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు వెళ్తుంటే.. టీడీపీ కార్యకర్తలు, నాయకులకు పూర్తిగా అండగా నిలుస్తూ,ఇంకా వారికి ఏ కష్టం లేకుండా చేస్తూ పోలీసులే దాడులకు దిగారు, ఎలాంటి కవ్వింపు లేకుండా గాల్లోకి కాల్పులు జరిపారు. కాశ్మీర్ వంటి దేశ సరిహద్దుల్లో శత్రువులపై కాల్పులు జరిపినట్లు, ప్రజల ప్రాణాలంటే ఏ మాత్రం లెక్క లేకుండా కాల్పులు జరుపుతున్నారు. సినిమాల తరహాలో ఇష్టారాజ్యంగా పోలీసులు కాల్పులకు దిగుతున్నారు. నక్సలైట్లు ఉన్నప్పుడు కూడా ఇలా చేయలేదు. రాష్ట్ర ప్రాయోజిత హింసలా ఇది కనిపిస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిపై ఇలా కాల్పులకు చేయడం భయోత్పాతం సృష్టించడమే అవుతుంది. తాము ఉద్యోగం చేస్తున్నామో, గూండాయిజం చేస్తున్నామో పోలీసులకు తెలియడం లేదా? ఇదంతా వ్యవస్థీకృత, ముందస్తు నేరమే. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాలి. ఎస్ఈసీ ఇలాంటి పనులు చేయొద్దని కనీసం చిన్న వార్నింగ్ అయినా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతిమ తీర్పు ప్రజలదే కాబట్టి వారికే అన్ని విషయాలు వివరిస్తున్నాం. ప్రజలే దీనిపై ప్రశ్నించాల్సిన పరిస్ధితులు వచ్చాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పోటీ చేసి తీరాల్సిందే. ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపుతూ, ప్రజల్ని చైతన్య పరచడం ప్రజాస్వామ్యంలో నిత్యం జరగాల్సిన ప్రక్రియే. కాబట్టి ఎక్కడా వెనకడుగు వేసే ఉద్దేశం లేదు, అడుగు ముందుకే వేస్తాం. ఎంతవరకూ వీలైతే అంతవరకూ తీసుకెళ్తాం. అడ్డంకులపై సమిష్టిగా నిలబడతాం. ప్రజలు ఇచ్చే తీర్పు గౌరవిస్తాం. చంద్రబాబు తన ఖాతాలో ఎన్నీ సీట్లు వేసుకున్నా, చంకలు గుద్దుకున్నా ప్రయోజనం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.