ఇంత‌లా దిగ‌జారాలా చంద్ర‌బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ సూటి ప్ర‌శ్న‌

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు, కుట్రలకు తెగబడుతున్న చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గూండాల అరాచకాలు, ఎస్ఈసీ వ్యవహార శైలి, సుప్రీంకోర్టు తీర్పు సహా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

‘‘స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అన్ని ఆధారాలను ఎస్‌ఈసీ, గవర్నర్‌కు సమర్పించాం. సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లాం. కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ నెల  25 వరకు అభ్యర్థుల తుది జాబితా వాయిదా వేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. మా నామినేషన్లను అడ్డుకుంటున్నారంటే అర్థమేంటి?. వ్యవస్థ దిగజారిపోయిందని అర్థమవుతోంది. అడ్డగోలు అబద్ధాలు.. దాపరికాలు, డ్రామాలు ఎందుకు? అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

‘‘పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే.. నామినేషన్లు ఎందుకు అడ్డుకున్నారు? ప్రజలకు మంచి చేశారన్న నమ్మకం మీకుంటే నామినేషన్లను అడ్డుకోవద్దు. ప్రజల తీర్పును బుల్డోజ్‌ చేయాలని చేస్తున్నారా?. నామినేషన్‌ వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించడంతో పాటు బందోబస్తు, సీసీ టీవీ రికార్డింగ్‌ చేయాలని ఆదేశించింది. సుప్రీం ఇంత స్పష్టంగా చెప్పినా బాబులో మార్పు వచ్చిందా?. చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలా మారిన డీజీపీలో మార్పు వచ్చిందా?. డీఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లలో మార్పు వచ్చిందా?. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Back to Top