అక్రమ అరెస్టులు, దాడులు, కేసులతో ప్రజల తీర్పును మార్చలేరు!

ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనుకోవడం మూర్ఖత్వం

లేళ్ల అప్పిరెడ్డి, టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా చ‌ట్టానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించిన కొంద‌రు పోలీసు అధికారుల తీరుపై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో జాయింట్ డైరెక్టర్ రామారావుకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు, గ్రివెన్స్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు అంకంరెడ్డి నారాయ‌ణ‌మూర్తి, ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ యోహ‌న్ రాజు  ఫిర్యాదు చేశారు. అనంత‌రం అక్క‌డే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు మీడియాతో మాట్లాడారు.  

 స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై అక్రమ కేసులు

 చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్న 59 మంది పోలీసు అధికారులపై ఎస్ఈసీకి ఫిర్యాదు

 కేసుల వివరాలు ఇవ్వకుండా, పోలీసు సర్టిఫికెట్ల పేరుతో అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు

 హైకోర్టు ఆదేశాల మేరకు జూలై 15 వరకు ఓటర్ల జాబితా ఇచ్చి, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి

 కుప్పంలో విజయ్‌కుమార్ కిడ్నాప్, దుగ్గిరాలలో దాసరి వీరయ్య అరెస్టుపై చర్యలు తీసుకోవాలి

 అక్రమాలతో వైయ‌స్ఆర్‌సీపీని అడ్డుకోలేరు

 తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

 దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్ ప్రయోగం అధికార దుర్వినియోగమే

దళిత నాయకుడిని ఎన్నికలకు దూరం చేసే ప్రయత్నం

 చంద్రబాబుకు దమ్ముంటే అన్ని స్థానాల్లో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలి 

 అక్రమాలకు పాల్పడిన పోలీసు, ఎన్నికల అధికారులపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం

  అవసరమైతే జాతీయ స్థాయిలో న్యాయపోరాటం చేస్తాం

  మీడియా స‌మావేశంలో స్ప‌ష్టం చేసిన టీజేఆర్ సుధాక‌ర్‌బాబు 

విజ‌య‌వాడ‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను పోటీకి దూరం చేసేందుకు కొందరు పోలీసు అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు, అరెస్టులు, దాడులతో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారుల తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ రామారావుకు వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యోహన్ రాజు, త‌దిత‌రుల‌తో క‌లిసి వారు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్క‌డే లేళ్ల అప్పిరెడ్డి, టీజేఆర్ సుధాక‌ర్‌బాబు మీడియాతో మాట్లాడారు. అధికార బలంతో అభ్యర్థులను అడ్డుకున్నంత మాత్రాన ప్రజల తీర్పును మార్చలేరని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనుకోవడం మూర్ఖత్వమని స్పష్టం చేస్తూ, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
మీడియాతో లేళ్ల అప్పిరెడ్డి, సుధాక‌ర్‌బాబు ఏమ‌న్నారంటే..

- 59 మంది పోలీసు అధికారులపై ఎస్ఈసీకి ఫిర్యాదు: లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

`స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తూ, వేధింపులకు పాల్పడుతున్న 59 మంది పోలీసు అధికారులను గుర్తించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను రాబోయే ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉంటుందనే భ్రమలో కొందరు అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఏ దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి.

- కేసుల వివరాలు దాచి.. అభ్యర్థులను వేధించడం సరికాదు

అభ్యర్థులు తమపై నమోదైన కేసుల వివరాలు అడిగితే పోలీసులు చెప్పడం లేదు. కేసులు లేవని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరినా నిరాకరిస్తున్నారు. మరోవైపు నామినేషన్‌కు పోలీసు సర్టిఫికెట్ తప్పనిసరంటూ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసు సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఎస్ఈసీ జాయింట్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై క్షేత్రస్థాయి అధికారులకు వెంటనే సర్క్యులర్ జారీ చేయాలి. హైకోర్టు ఆదేశాల ప్రకారం జూలై 15 వరకు నమోదైన ఓటర్ల వివరాలతో జాబితాను అందుబాటులోకి తెచ్చి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి. చనిపోయినవారి పేర్లు, ద్వంద్వ ఓట్లను పరిశీలించి నిబంధనల ప్రకారం జాబితాను సరిచేయాలి.

- కుప్పంలో కిడ్నాప్.. దుగ్గిరాలలో దాసరి వీరయ్య అరెస్టు

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి విజయ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసిన ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న దాసరి వీరయ్యను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపడం దారుణం. వీరయ్య అజ్ఞాతంలో లేరు.. స్థానికంగానే ఉంటూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఆయన పోటీలో ఉంటే వైయ‌స్ఆర్‌సీపీ గెలుస్తుందనే భయంతోనే ఎన్నికలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అరెస్టును హైకోర్టులో సవాలు చేస్తాం. అరెస్టులు, అక్రమ కేసులతో వైయ‌స్ఆర్‌సీపీని పోటీ నుంచి తప్పించలేరు. ప్రజాస్వామ్యంలో బ్యాలెట్లతో గెలవాలి కానీ, బుల్లెట్లతో కాదు. ప్రజల ఓటు హక్కును, అభ్యర్థుల పోటీ హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది` లేళ్ల అప్పిరెడ్డి తేల్చి చెప్పారు.

- దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్ ప్రయోగం అధికార దుర్వినియోగమే: టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే

` దీర్ఘకాలంగా ప్రజాప్రతినిధులుగా సేవలందించిన కుటుంబానికి చెందిన దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్ ప్రయోగించి రాజమండ్రి జైలుకు పంపడం అధికార దుర్వినియోగం. ఐదుసార్లు సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా ప్రజలకు సేవ చేసిన కుటుంబాన్ని రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారు. దుగ్గిరాల ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి ప్రజల మద్దతు ఉందనే భయంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అభ్యర్థులందరికీ స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పించి ఎన్నికలు నిర్వహించాలి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజల మద్దతును అడ్డుకోలేరు. దళిత నాయకుడిపై అధికార అహంకారాన్ని చూపించడం సిగ్గుచేటు.

అక్రమాలకు పాల్పడిన అధికారులపై న్యాయపోరాటం ఆగదు

చట్టాన్ని ఉల్లంఘించి అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసు అధికారులు, రిటర్నింగ్ అధికారులు, కలెక్టర్ల వివరాలను ఎస్ఈసీకి అందజేశాం. ఈ అక్రమాలను ఇంతటితో వదిలిపెట్టం. అవసరమైతే మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో కార్యకర్తల హక్కుల కోసం న్యాయపోరాటం కొనసాగిస్తాం. కార్యకర్తల కోసం ఎస్ఈసీని, గవర్నర్‌ను కలవడానికి కూడా వెనుకాడని నాయకత్వం మాది. అరెస్టులు, దాడులు, బెదిరింపులతో వైయ‌స్ఆర్‌సీపీని అణచివేయాలనుకోవడం అసాధ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ప్రతి అభ్యర్థికి పోటీ చేసే హక్కు కల్పించేందుకు చివరివరకు పోరాడతాం` అని టీజేఆర్ సుధాక‌ర్‌బాబు స్ప‌ష్టం చేశారు.

Back to Top