సర్వేపల్లిలో టీడీపీ ఖాళీ అవుతోంది: కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ఇస్లాంపేటకు చెందిన 30 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ కాబోతుందని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఆయన నివాసంలో వెంకటాచలం మండలం కురిచర్లపాడు పంచాయతీ ఇస్లాంపేటకు చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. వారికి కాకాణి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అధికారంలో లేకపోయినా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీలో చేరడం శుభపరిణామమని కాకాణి పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్, కార్పొరేషన్ మేయర్, వార్డు స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయని తెలిపారు.

పోలీసుల ఒత్తిళ్లు, ఇతర ఇబ్బందులు ఎదురైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు వెనుకడుగు వేయకుండా ఎన్నికల విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. మరోవైపు, వైయ‌స్ఆర్‌సీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారిని చూసి టీడీపీ నేతలు కండువాలు కప్పి చేరికల పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. పార్టీలో చేరిన కుటుంబాలకు, వారిని సమన్వయం చేసిన స్థానిక నాయకులకు కాకాణి కృతజ్ఞతలు తెలిపారు.

 

Back to Top