కర్నూలు: విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డిని కర్నూలు పోలీసులు నిర్బంధించి, ఆళ్లగడ్డకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు వైయస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఆళ్లగడ్డలో తన సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంపై పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఇలా నిర్బంధించడం ఏమిటని వైయస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్రెడ్డి ప్రశ్నించారు. అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డుకోవడం అన్యాయమని, ఎన్నికల పేరుతో నాయకులను నిర్బంధించడం సరికాదని వైయస్ఆర్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, రాజకీయ నాయకుల స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాలని కోరారు.