లోక్‌భవన్‌కు వైయ‌స్‌ జగన్‌.. గవర్నర్‌తో భేటీ

నామినేషన్ల అడ్డగింతలు, దాడులపై అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు

మూడు రోజులుగా టీడీపీ దౌర్జన్యాలు.. అభ్యర్థుల హక్కులను కాలరాస్తున్నారని వివరణ

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ శ్రేణుల దౌర్జన్యాలు, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు ఎదురైన అడ్డంకులను మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం లోక్‌భవన్‌కు వెళ్లిన వైయ‌స్‌ జగన్‌ గవర్నర్‌తో భేటీ అయి, మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన ఆయన, అదే అంశాలను గవర్నర్‌కు వివరించి ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

నామినేషన్లకు అడ్డంకులు.. పలుచోట్ల దాడులు

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడం వంటి ఘటనలు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయని వైయ‌స్‌ జగన్‌ గవర్నర్‌కు వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి కడప జిల్లాలో దాడులు, కత్తిపోట్ల ఘటనల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు గాయపడగా, పులివెందులలో పోలీసుల కాల్పుల్లో ముగ్గురు గాయపడినట్లు పేర్కొన్నారు.

పలు మున్సిపాలిటీల్లో నామినేషన్ల అడ్డగింతలు

పులివెందులలో 16 వార్డులు, ప్రొద్దుటూరులో 19 వార్డులు, కడపలో 54 వార్డులకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు అడ్డంకులు ఎదురయ్యాయని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు వెల్లడించాయి. యర్రగుంట్ల, కమలాపురం, రాయచోటిలో చైర్మన్‌, కౌన్సిలర్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకుండా అడ్డుకున్నారని తెలిపాయి.

రాజంపేట, బద్వేల్‌లో చైర్మన్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, వార్డు స్థానాలకు నామినేషన్లు పడలేదని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో చైర్మన్‌ అభ్యర్థితో పాటు 25 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని, అనంతపురం జిల్లా తాడిపత్రిలో నాలుగు వార్డుల నామినేషన్లకు అడ్డంకులు ఎదురయ్యాయని వివరించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి

నామినేషన్లు దాఖలు చేయడం ప్రతి అభ్యర్థి హక్కు అని, ఎలాంటి భయాలు, ఒత్తిళ్లు లేకుండా ఎన్నికల ప్రక్రియ సాగాల్సిన అవసరం ఉందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. అభ్యర్థులకు భద్రత కల్పించి, నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులు సృష్టించిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం, గవర్నర్‌ జోక్యంతో రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని వైయ‌స్ఆర్‌సీపీ విజ్ఞప్తి చేసింది.

Back to Top