విజయవాడ: రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియలో అరాచకాలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలను వాయిదా వేసి, రూల్ 7 ప్రకారం నామినేషన్ల దశ నుండి మళ్లీ షెడ్యూల్ విడుదల చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వరుస ఫిర్యాదులు సమర్పించింది. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని లేళ్ల అప్పిరెడ్డి లేఖల్లో పేర్కొన్నారు. పుంగనూరు, పులివెందుల, తిరుపతి, బద్వేలు, మైదుకూరు, ధర్మవరం, కడప తదితర ప్రాంతాల్లో దాడులు, బెదిరింపులు, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు భయాందోళనల మధ్య గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, మరికొన్ని చోట్ల అడ్డంకులను నివారించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పుంగనూరులో పార్టీ లోక్‌సభాపక్ష నేత పి.వి. మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిందని, ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడగా వాహనాలు దెబ్బతిన్నాయని లేఖలో ప్రస్తావించారు. రాయచోటిలో బెదిరింపులు, వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి, వాహనాలకు నిప్పంటించడం, గాయాల ఘటనలను కూడా ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి, ధర్మవరం, కడప తదితర ప్రాంతాల్లో నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన వ్యక్తులతో పాటు విధుల్లో నిర్లక్ష్యం లేదా పక్షపాతం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కును హింసతో, అధికార దుర్వినియోగంతో హరించకుండా ఎన్నికల కమిషన్ తక్షణ జోక్యం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. ఎమ్మార్వో కార్యాలయాల్లో పెండింగ్‌లో 915 దరఖాస్తులు: పులివెందులలో ఎన్నికల విధుల నిర్వహణపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్, డీఎస్పీ మురళీ నాయక్‌తో పాటు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించి, నిష్పక్షపాత అధికారులను నియమించాలని పార్టీ కోరింది. పులివెందులలో పోలీసు బలప్రయోగం, టియర్‌గ్యాస్, గాల్లోకి కాల్పులు జరిగినట్లు ఫిర్యాదుల్లో పేర్కొంది. మైదుకూరులో 11వ వార్డు అభ్యర్థి కిరణ్మయి నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారని, బద్వేలులో 32వ వార్డు అభ్యర్థి సానపురెడ్డి సుప్రజ నామినేషన్ పత్రాలను బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించింది. వైఎస్సార్ కడప జిల్లాలో నిబంధనల్లో లేని పోలీసు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ)ను సాకుగా చూపి నామినేషన్ల స్వీకరణకు అడ్డంకులు సృష్టిస్తున్నారని పార్టీ అభ్యంతరం తెలిపింది. ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలను మాత్రమే కోరేలా రిటర్నింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. చట్టవిరుద్ధంగా నామినేషన్లను తిరస్కరించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 915 దరఖాస్తులు ఎమ్మార్వో కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయని లేఖలో వెల్లడించింది. ఈ జాప్యం వల్ల అర్హులైన అభ్యర్థులు నామినేషన్లకు అవసరమైన పత్రాలను సమకూర్చుకోలేక పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. జిల్లా కలెక్టర్, సంబంధిత రెవెన్యూ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసి, అర్హులైన దరఖాస్తుదారులకు సర్టిఫికెట్లు వెంటనే మంజూరు చేయాలని కోరింది. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడానికి గల కారణాలను పరిశీలించి, ఉద్దేశపూర్వక జాప్యానికి పాల్పడినట్లు తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని డిమాండ్ చేసింది. పోలింగ్ కేంద్రంలో నిరంతర సీసీటీవీ రికార్డింగ్‌తో పాటు ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్: ఎన్నికల ప్రక్రియలో హింస, బెదిరింపులు, నామినేషన్ల అడ్డగింతలను అరికట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ కోరింది. నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఆర్పీఎఫ్)ను మోహరించాలని విజ్ఞప్తి చేసింది. అభ్యర్థులు, ప్రతిపాదకులు, వారి అధీకృత ప్రతినిధులకు నామినేషన్ కేంద్రాలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు తగిన భద్రత కల్పించాలని కోరింది. ప్రతి నామినేషన్ కేంద్రం, పోలింగ్ కేంద్రంలో నిరంతర సీసీటీవీ రికార్డింగ్‌తో పాటు ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. స్ట్రాంగ్ రూమ్‌ల ప్రవేశ ద్వారాలు, పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచి, బ్యాలెట్ పెట్టెల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కౌంటింగ్ కేంద్రాల్లోనూ సీసీటీవీ పర్యవేక్షణ, రికార్డుల భద్రత, విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాలని కోరింది. అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు భద్రతతో కూడిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట జిల్లా కలెక్టర్ లేదా సీనియర్ అధికారి పర్యవేక్షణలో కేంద్రీకృత నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. అభ్యర్థులు నేరుగా కేంద్రాలకు చేరుకోలేని పరిస్థితులు ఉన్నందున, నిబంధనలకు అనుగుణంగా సురక్షితమైన ఆన్‌లైన్ నామినేషన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. హింస, బెదిరింపులు లేదా అడ్డంకుల కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన ప్రతి అర్హుడికి మరో అవకాశం కల్పించి, వారి పోటీ హక్కును పరిరక్షించాలని స్పష్టం చేసింది. ఆ ప్రాంతాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలి: హింసాత్మక ఘటనలు, అధికారుల పక్షపాత వైఖరి, ధ్రువీకరణ పత్రాల జాప్యం కారణంగా ఎన్నికల ప్రక్రియ తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కోరింది. నామినేషన్లు స్వేచ్ఛగా దాఖలు చేసుకునే పరిస్థితులు లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయడం లేదా తిరిగి ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. ఏపీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిబంధనలు–2026లోని రూల్ 7 ప్రకారం వర్తించే విధానాలను పరిశీలించి, అవసరమైన చోట నామినేషన్ల దశ నుంచి ఎన్నికల ప్రక్రియను తిరిగి చేపట్టాలని కోరింది. అభ్యర్థులకు నామినేషన్ దాఖలుకు తగిన అవకాశం కల్పించకుండా ఎన్నికలను ముందుకు తీసుకెళ్లడం స్వేచ్ఛాయుత పోటీ సూత్రానికి విరుద్ధమని పార్టీ పేర్కొంది. నామినేషన్ పత్రాలను చించివేసినవారు, అభ్యర్థులను బెదిరించినవారు, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన లేదా అడ్డంకులకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల పాత్రపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరింది. ఎన్నికల కమిషన్ జారీ చేసే ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేసింది. అవసరమైతే భారత ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని, రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణ చేపట్టాలని కోరింది. అర్హులైన ప్రతి అభ్యర్థికి సమాన అవకాశం, ప్రతి ఓటరుకు భయంలేని వాతావరణం కల్పించడం ఎన్నికల కమిషన్ బాధ్యత అని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల నిర్వహణకు భద్రత, పారదర్శకత, నిష్పక్షపాత అధికార యంత్రాంగం, నిబంధనల అమలు అత్యవసరమని పేర్కొంటూ లేళ్ల అప్పిరెడ్డి ఎస్‌ఈసీ తక్షణ జోక్యాన్ని కోరారు.