కాకినాడ : రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం జాతీయ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో నిలువునా వెన్నుపోటు పొడుస్తోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు బలవంతంగా చేతుల్లోకి తీసుకుని కేవలం సొంత లాభం, కాంట్రాక్టర్ల స్వప్రయోజనాల కోసమే తాపత్రయపడుతున్నారని కాకినాడ లో మీడియా తో మాట్లాడిన కన్నబాబు గుర్తు చేశారు. విదేశీ నిపుణుల బృందం ఇప్పటికే ఏడుసార్లు ప్రాజెక్టును పరిశీలించి నాణ్యతా లోపాలు, డయాఫ్రమ్ వాల్‌లోని డొల్లతనాన్ని ఎండగడుతూ కేంద్ర జల సంఘం (CWC), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA)లకు నివేదిక ఇచ్చినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. తాను చేయని పనులను తానే చేసినట్లు డబ్బా కొట్టుకుంటూ, డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని సినిమా కలెక్షన్ల రికార్డులా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మరోవైపు ప్రాజెక్టు ఎత్తును కేంద్రం 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదిస్తున్నా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నోరు మెదపకుండా అంగీకరించిందని, దీనివల్ల 75 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి గ్రావిటీ ద్వారా నీరందే అవకాశం లేకుండా పోయిందని, ఫలితంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటు రాయలసీమకు శాశ్వత అన్యాయం జరుగుతోందని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఆయన ఏమన్నారంటే.. ప్రచార పిచ్చి పీక్స్.. పాలన గాలికొదిలేశారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన పూర్తిగా గాడి తప్పింది. ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ ఆధారంగానే నెట్టుకొస్తోంది. ఏ రోజు ఏ హెడ్‌లైన్ పెట్టించుకోవాలి, టీవీల్లో ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ వేయించుకోవాలనే తాపత్రయమే తప్ప ప్రజలకు ఏది ప్రాధాన్యత అనేది బాబుకు పట్టడం లేదు. దీని కోసం అద్దె మైకులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను పెట్టుకుని ప్రచారం చేయించుకుంటున్నారు. దశాబ్దాల ప్రజల కల అయిన పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తూ భవిష్యత్ తరాలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారు. చరిత్రలో ఎవరికీ లేని విధంగా ఒక వెన్నుపోటు పార్టీగా కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు కూడా వెన్నుపోటు పొడుస్తోంది. విదేశీ నిపుణులు హెచ్చరించినా స్పందన లేదా?.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత పూర్తిగా లోపించిందని కేంద్రం నియమించిన అమెరికా, కెనడా తదితర దేశాలకు చెందిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. హిల్స్‌బర్గర్, డేవిడ్ బి, జియానో ఫ్రానో డిసిస్కో లాంటి ప్రముఖ నిపుణులు ఇప్పటికే 7 సార్లు ప్రాజెక్టును సందర్శించి నాణ్యతా లోపాలను నిర్ధారించారు. ఆగస్టు 28నే CWC, PPAలకు నివేదికలు ఇచ్చారు. రేపు అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో 8వ సారి మళ్లీ వస్తున్నారు. నిపుణులు లేవనెత్తిన ఏ ఒక్క అభ్యంతరానికీ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు సరికదా, కనీసం ఒక్క సమీక్ష కూడా జరపలేదు. ఇంతటి జాతీయ స్థాయి ప్రాజెక్టుకు నాణ్యత సర్టిఫికెట్ కాంట్రాక్టరే ఇచ్చే విడ్డూరపు వ్యవస్థ ఎక్కడైనా ఉందా? కట్టేవాడే సొంతంగా ల్యాబ్ పెట్టుకుని సర్టిఫికెట్ ఇచ్చుకునే దౌర్భాగ్యం రాష్ట్రంలో నడుస్తోంది. మోదీ ఇచ్చిన ‘ఏటీఎం’ సర్టిఫికెట్‌ను కొనసాగిస్తున్నారు.. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు లాక్కున్నారు. గతంలో రాజమండ్రి సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే చంద్రబాబుకు 'పోలవరం అంటే ఏటీఎం' అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్‌ను బాబు ఇప్పటికీ నిలబెట్టుకుంటూ పోలవరాన్ని దోచుకుంటున్నారు. ఎవరి జేబులు నింపడం కోసం, ఏ కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టును నాసిరకంగా నిర్మిస్తున్నారు? ఏమీ లేకుండానే ఇప్పటివరకు ఏడుసార్లు రిబ్బన్లు కట్ చేసిన ఘనత చంద్రబాబుది. ఎవరో చేసిన పనికి కొబ్బరికాయలు కొట్టి నేనే చేశానని చెప్పుకోవడం ఆయనకు అలవాటు. డయాఫ్రమ్ వాల్ లోపాల పుట్ట.. రికార్డుల పేరిట మోసం.. డయాఫ్రమ్ వాల్ మందం 1.5 మీటర్లు ఉండాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో అనేక చోట్ల కేవలం 0.9 మీటర్లే ఉందని నిపుణులు తేల్చారు. తవ్వకాలకు వాడిన కట్టర్ యంత్రం మందం 1.5 మీటర్లు ఉందని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్యానెల్స్‌ను గట్టి రాతి పొరల్లోకి దించకుండానే పనులు మమ అనిపించారు. ఎంత పరిమాణంలో కాంక్రీట్ వాడారో ఇప్పటికీ స్పష్టత లేదు. డయాఫ్రమ్ వాల్‌లోని మొత్తం 365 ప్యానెల్స్‌లో దాదాపు 10 శాతం (38 ప్యానెల్స్‌లో) లోపాలు, నీటి బుడగలు కనిపించాయని నిపుణులు నివేదిక ఇచ్చారు. పైగా గ్రేడింగ్ చేయని పెద్ద బండరాళ్లతో నిర్మాణం చేస్తుండటంతో వాటి మధ్య నుంచి నీరు ప్రవహిస్తే డ్యామ్ భద్రతకే ముప్పు వాటిల్లుతుంది. ఇంతటి తీవ్రమైన లోపాలుంటే 439 రోజుల్లో పూర్తి చేశామంటూ సినిమా కలెక్షన్ల రికార్డుల్లా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ఇది ఇంటి ముందు వేసే సీసీ రోడ్డు కాదు.. భవిష్యత్ తరాల ప్రాజెక్టు!. ఎత్తు కుదింపుతో ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీవ్ర ద్రోహం.. పోలవరం పూర్తిస్థాయి ఎత్తు 45.72 మీటర్లు కాగా, దాన్ని 41.15 మీటర్లకు కేంద్రం కుదిస్తే కూటమి ప్రభుత్వం ఎలా ఆమోదించింది?. ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 194 టీఎంసీల నుంచి ఏకంగా 119 టీఎంసీలకు (75 టీఎంసీలు) పడిపోయింది. నీటి మట్టం తగ్గితే గ్రావిటీ ద్వారా కాలువల్లోకి నీరు పారే అవకాశమే లేదు. గతంలో 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని భావిస్తే, ఎత్తు కుదింపు వల్ల కేవలం 1.95 లక్షల ఎకరాలకే పరిమితం కానుంది. దీనివల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ శాశ్వతంగా కలగానే మిగిలిపోనుంది. అనకాపల్లికి గ్రావిటీపై నీళ్లు తీసుకెళ్తామని చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి మోసాలు. అటు కృష్ణా డెల్టా స్థిరీకరణ దెబ్బతింటుంది, రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో కలిపి తెచ్చిన రూ.47 వేల కోట్ల అంచనా నిధులను సైతం ఈ ప్రభుత్వం కాపాడుకోలేకపోయింది. పోలవరం శాశ్వత ప్రాజెక్టు.. నాణ్యత, లోపాలపై సమాధానం చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు మన తరానికే కాదు, భవిష్యత్ తరాల కోసం నిర్మిస్తున్న శాశ్వత ప్రాజెక్టు. నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలు, ప్రాజెక్టులో గుర్తించిన లోపాలు, వాటిని ప్రభుత్వం ఏ విధంగా సరిచేసిందో ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలి. కాంట్రాక్టర్ ఇచ్చే సర్టిఫికెట్లతోనే నాణ్యతను నిర్ధారించడం కాకుండా, నిపుణుల నివేదికలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను బయటపెట్టాలి. పోలవరం ప్రాజెక్టుకు 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టి, అనుమతులు సాధించి ముందుకు తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు తన వల్లే వచ్చిందన్నట్లుగా క్రెడిట్ తీసుకోవడం కాకుండా, గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన ఆలస్యం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణమైన డిజైన్ లోపాలపై కూడా సమాధానం చెప్పాలి. బాబుది క్రెడిట్ కోసం ఆరాటం- నిర్మాణ ఘనత వైయస్.జగన్ దే... చంద్రబాబు నాయుడు పోలవరాన్ని తానే తీసుకొచ్చానని, తానే వాటర్‌మ్యాన్ అన్నట్లుగా క్రెడిట్ తీసుకోవడం కంటే ప్రాజెక్టు ఎలా ప్రారంభమైందో, ఎవరి హయాంలో ఏ పనులు జరిగాయో ప్రజలకు చెప్పాలి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో స్పిల్‌వే గేట్లు, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, కాఫర్ డ్యామ్ పనులు, గోదావరి డైవర్షన్ వంటి పలు పనులు జరిగాయి. పోలవరం నాణ్యతపై నిపుణుల నివేదికల్లో వ్యక్తమైన ఆందోళనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణాలు, ప్రాజెక్టులోని లోపాలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. క్రెడిట్ కోసం ప్రచారం చేయడం కాదు.. పోలవరం భద్రంగా, నాణ్యతతో పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జవాబుదారీతనం వహించాలి. డీలిమిటేషన్ పేరుతో మైండ్ గేమ్.. స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సిద్ధం.. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో నాయకులను పార్టీలోకి ఆకర్షించేందుకు చంద్రబాబు చౌకబారు మైండ్ గేమ్ ఆడుతున్నారని కన్నబాబు మండిపడ్డారు. కేంద్రంలో రాజ్యాంగ సవరణ, మెజారిటీ రాష్ట్రాల ఆమోదం లేకుండా డీలిమిటేషన్ ఎలా సాధ్యమన్న ఆయన.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్న చరిత్ర టీడీపీదేనని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టులో తీర్పు రాకుండానే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందని బీసీలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు, మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు వైఎస్సార్‌సీపీ సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వ మోసాలను గమనిస్తున్నారని.. త్వరలోనే వీరికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.