విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం పాత 41వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ ఎండి. ఇర్ఫాన్ ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. హరిజనవాడ, అవుట్ ఏజెన్సీ, రంగూన్ సాహెబ్ వీధి, ప్రెసిడెంట్ వీధి, మసీదు వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ నాయకులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డివిజన్‌లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, ఇళ్ల ముందు మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీఎంసీ కమిషనర్, సీఎంహెచ్‌ఓ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఈఈలతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను క్షేత్రస్థాయికి పిలిపించి పరిస్థితులను చూపించినట్లు పేర్కొన్నారు. భారీ భవన నిర్మాణ వ్యర్థపు నీటిని డ్రైనేజీలోకి వదులుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తాగునీటి సమస్యపై కూడా వెలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే కృష్ణా నది ఉన్నప్పటికీ ప్రజలకు గుక్కెడు తాగునీరు అందడం లేదని విమర్శించారు. నిత్యావసర ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, ఇళ్లను రద్దు చేయడం కక్షపూరిత చర్యగా పేర్కొన్నారు. డివిజన్‌లో అర్హత ఉన్నప్పటికీ పింఛన్ అందడం లేదని ఓ స్థానికుడు తన సమస్యను వివరించినట్లు తెలిపారు. రంగూన్ సాహెబ్ వీధిలో గతంలో మంజూరైన రోడ్డు పనులు ఇంకా ప్రారంభం కాలేదని వెలంపల్లి పేర్కొన్నారు. ఏళ్లుగా పనులు చేపట్టని కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేసి రీటెండర్ ద్వారా పనులు పూర్తి చేయాలని కమిషనర్‌ను డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి, కనీస నిర్వహణ కూడా లేదని విమర్శించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయితే నిడమర్రు, అమరావతిలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.