కర్నూలు: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి ఎస్సీ, ఎస్టీ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 1న చిప్పగిరిలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 38 మందిపై కేసు నమోదు కాగా, ఆయనను అరెస్టు చేసి కర్నూలు జిల్లా జైలులో రిమాండ్‌కు తరలించారు. గత 68 రోజులుగా జైలులో ఉన్న విరూపాక్షికి తాజాగా బెయిల్ లభించింది. ఇప్పటికే మరో కేసులోనూ ఆయనకు బెయిల్ మంజూరైంది. ఎమ్మెల్యే విరూపాక్షికి అండగా నిలిచిన పార్టీ అధినేత వైయస్ జగన్ కర్నూలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఆలూరు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ఆగస్టు 13న వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ములాఖత్ ద్వారా ఎమ్మెల్యేతో మాట్లాడి పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్‌లో ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని వైయస్ జగన్ విమర్శించారు. సంగాల గ్రామంలో దాడికి గురైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త గిరిని కాపాడేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. దాడిలో ఎమ్మెల్యే సోదరుడి చేయి విరిగినా వారినే నిందితులుగా చేశారని పేర్కొన్నారు. ఒక టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చించి ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో భారీగా పోలీసులు వచ్చి ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి తలుపులు, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి తీసుకెళ్లారని జగన్ గుర్తుచేశారు. పగటిపూట నోటీసులు ఇచ్చి విచారణకు పిలవకుండా అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బాధితులే నిందితులుగా మారుతున్న పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.