తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విమ్స్‌లో 116 పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు, అవినీతి జరిగాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. పాథాలజీ విభాగంలో ఒకే ఉద్యోగానికి ఇద్దరికి నియామక పత్రాలు ఇవ్వడంపై కోర్టును ఆశ్రయించగా, ఇద్దరికీ అర్హతలు లేవని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. స్విమ్స్‌లోని 116 పోస్టులను అమ్ముకున్నారని భూమన ఆరోపించారు. ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో నారా ఆదిశేషయ్య, లోకేష్ సూచనల మేరకు పోస్టులు సిద్ధం చేశారని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాల తరహాలోనే స్విమ్స్ 116 పోస్టుల ఎంపికలోనూ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. డాక్టర్ పోస్టుల నుంచి కింది స్థాయి ఉద్యోగాల వరకు నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని అన్నారు. డాక్టర్ జగదీష్, సీఎం చంద్రబాబు బంధువు నారా ఆదిశేషయ్య కనుసన్నల్లోనే పోస్టుల ఎంపిక జరిగిందని భూమన ఆరోపించారు. స్విమ్స్‌లో ఇంత పెద్దఎత్తున పోస్టుల భర్తీలో అవినీతి గతంలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.