వివేకా మ‌ర్డ‌ర్ కేసుతో చంద్ర‌బాబు రాజ‌కీయ ఆట‌లు

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వివేకా హ‌త్య కేసును వాడుకుంటున్నారు 

మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ ఆగ్ర‌హం 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ 

వివేకా హ‌త్య కేసును చంద్ర‌బాబు రాజ‌కీయ ఆట‌గా మార్చేశాడు

హ‌త్య‌కు గురైన వివేకా కుమార్తె సునీత క‌లిసేది చంద్రబాబునే

వివేకాను తానే గొడ్డ‌లితో చంపానన్న ద‌స్త‌గిరి భార్య‌తో వెళ్లి క‌లిసిందీ చంద్ర‌బాబుని

రాజకీయాల్లోకి వ‌స్తానంటూ మ‌రో ప్ర‌ధాన నిందితుడు సునీల్ యాద‌వ్ ప్ర‌క‌ట‌న‌లు

వారి ప్ర‌క‌ట‌న‌ల వెనుక ఉన్న‌ది కూడా టీడీపీ నేత‌లే 

ఈడీ లాంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఆడించేదీ చంద్ర‌బాబే 

ఈ ప‌రిణామాల‌తో రాష్ట్ర ప్ర‌జ‌లు విస్తుపోతున్నారు

సాకె శైల‌జానాథ్ స్ప‌ష్టీక‌ర‌ణ 

ఈడీ లాంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను వెనుక నుంచి ఆడిస్తున్న‌ది చంద్ర‌బాబే 

ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు రావ‌డం వెనుక కుట్ర‌దారుడు ఆయ‌నే 

ఆ వెంట‌నే సునీత దంప‌తులు చంద్ర‌బాబుని క‌ల‌వ‌డం యాధృచ్ఛికం కాదు

హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు ద‌స్త‌గిరికి టీడీపీ కార్యాల‌యంలో ఏం ప‌ని? 

నిందితుల బెయిల్ ర‌ద్దుకు సునీత ఎందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదు? 

సాకె శైల‌జానాథ్ సూటి ప్ర‌శ్న‌లు  

తాడేపల్లి:  వైఎస్ వివేకా మ‌ర్డ‌ర్ కేసును చంద్ర‌బాబు క్విడ్ ప్రోకో మాదిరిగా వాడుకుంటున్నాడ‌ని, వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్తతో కలిసి నేరుగా చంద్రబాబును కలవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు వెళ్లిన నేపథ్యంలోనే ఈ సమావేశం జరగడం, దర్యాప్తు సంస్థలను చంద్రబాబే డైరెక్ట్ చేస్తున్నారనడానికి నిదర్శనమని స్పష్టం చేశారు. దీంతోపాటు ఇటీవ‌లే వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి తన భార్యతో కలిసి టీడీపీ కార్యాల‌యంలో చంద్రబాబును కలవడం.. ఇవ‌న్నీ చూస్తుంటే వివేకా హ‌త్య కేసు ద‌ర్యాప్తు చంద్ర‌బాబు కనుస‌న్న‌ల్లోనే జ‌రుగుతున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంద‌న్నారు. లిక్క‌ర్ కేసు మాదిరిగానే వివేకా హ‌త్య కేసును కూడా చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నాడ‌ని, వైఎస్సార్సీపీపై బుర‌ద‌జ‌ల్ల‌డం రివాజుగా మారిపోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తామే వివేకాని హత్య చేశామని చెప్పిన ప్రధాన నిందితులకు టీడీపీ అండ, సకల సదుపాయాలు లభిస్తున్నాయని ఈ పరిణామాలు నిర్ధారిస్తున్నాయ‌ని చెప్పారు. వివేకా కేసులో 15కుపైగా పిటిషన్లు వేసిన సునీత, తామే హత్య చేశామని చెప్పిన నిందితుల బెయిల్‌ రద్దు కోసం మాత్రం ఎందుకు ఒక్క పిటిషన్‌ కూడా వేయలేదని ప్రశ్నించారు. మరోవైపు సునీల్‌ యాదవ్‌ రాజకీయాల్లోకి వస్తానని మాట్లాడటం, సునీత బాగా పోరాడుతున్నారని దస్తగిరి  మీడియా ముందు చెప్పడం వెనుక ఉన్న రాజకీయ కుమ్మక్కును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వివేకా హత్య కేసును ట్రయల్‌కు తీసుకెళ్లి దోషులకు శిక్ష పడేలా చేయాల్సింది పోయి చంద్రబాబు రాజకీయ కుట్రలకు, విష రాజకీయాలకు ఈ కేసును వేదికగా మార్చారని ఆరోపించారు. నిందితులు సునీతను పొగడడం, వీరందరి వెనుక చంద్రబాబు స్క్రీన్ ప్లే నడపడం చూస్తుంటే వివేకానంద రెడ్డి మరణం తర్వాత కూడా ప్రతిరోజూ రాజకీయ హత్యకు గురవుతున్నారని శైలజానాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు రావ‌డం.. చంద్ర‌బాబుని సునీత క‌ల‌వ‌డం యాధృచ్ఛికం కాదు: 

వివేకానందరెడ్డి హత్య కేసును చంద్రబాబు ఒక క్విడ్ ప్రో కో మాదిరిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జెడ్పీ చైర్మన్ స్థానం కోసం సునీత దంపతులు ఆశ పెట్టుకున్నారని, వారికి సంబంధించిన బంధువు ఆ స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఆ విషయాల గురించి మాట్లాడుకోవడానికే వారు చంద్రబాబును కలిశారని, చంద్రబాబును కలిసి జెడ్పీ చైర్మన్ పదవిని కోరడం క్విడ్ ప్రో కో కాక ఏమవుతుంది.  అంతేకాకుండా ఇటీవ‌లే వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి కూడా తన భార్యతో కలిసి చంద్రబాబుని టీడీపీ కార్యాలయంలో కలవడం, చంద్రబాబుకు వకాల్తా పుచ్చుకున్నట్టుగా సునీతమ్మ గారు బాగా ఫైట్ చేస్తున్నారని, ఆమెకు సపోర్టు చేయాలని చెప్పడం చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు సునీల్ యాదవ్ రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ క‌లిపి చూస్తే, వివేకా కేసును రాజకీయాల‌కు వాడుకున్నందుకు గాను వీరందరికీ రాజకీయ ఆశ్రయం కల్పిస్తామని చంద్రబాబు ఏమైనా హామీ ఇచ్చారా అనే అనుమానం కలుగుతోంది.

నిందితుల బెయిల్ ర‌ద్దుకు సునీత ఎందుకు ప్ర‌యత్నించ‌డం లేదు?:

సుప్రీంకోర్టు తదుపరి దర్యాప్తు అవసరం లేదని చెప్పిన తర్వాత ఇక ట్రయల్ జరగాలి. సాక్షులను ప్రవేశపెట్టాలి, దోషులకు శిక్ష పడాలి. కానీ కేసును ముందుకు తీసుకెళ్లడం కంటే పిటిషన్లు, పొడిగింపులు, భారీ ఫీజులు తీసుకునే న్యాయవాదులతో వాదనలు అంటూ ప్రక్రియను సాగదీస్తున్నారనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. వివేకానందరెడ్డి ని తామే గొడ్డలితో నరికి నరికి చంపామని చెప్పిన వ్యక్తులే ఇవాళ బయట తిరుగుతూ రాజకీయంగా మాట్లాడుతున్నారు. పైగా వివేకా హ‌త్య కేసులో సునీత 15 సార్లు పిటిషన్లు వేశారు. కానీ తామే హత్య చేశామని చెప్పిన వారు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అస‌లు వారి బెయిల్ రద్దు చేయాలని కనీసం ఒక్కసారైనా కోర్టుకు వెళ్లారా? సత్వరంగా విచారణ జరగాలని, దోషులకు కఠిన శిక్షలు పడాలని కోరారా? సుప్రీంకోర్టు తదుపరి విచారణ అవసరం లేదని చెప్పిన తర్వాత కూడా కేసును ట్రయల్‌కు తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇవన్నీ పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా ప్రయాణం చేస్తూ వివేకా హత్య కేసును రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారనే అనుమానం బలపడుతోంది. సునీతని దస్తగిరి పొగడటం, సునీల్ యాదవ్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం వంటి పరిణామాలు చూస్తుంటే ఈ రాజకీయ కుమ్మక్కు వెనుక అసలు కథ ఏమిటో చంద్రబాబు  సమాధానం చెప్పాలి. అధికారంలో ఉన్నది చంద్రబాబే కాబట్టి ఈ కేసు ఎందుకు ఆలస్యం అవుతోందో, ఎవరు అడ్డుపడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్య‌త ఆయ‌న‌పైనే ఉంది. 

ట్ర‌య‌ల్ జ‌రిగి నిందితుల‌కు శిక్ష ప‌డాల‌నేదే వైఎస్సార్సీపీ డిమాండ్‌: 

వివేకానందరెడ్డి ఆత్మ ఇవన్నీ చూసి రోజూ కుమిలి కుమిలి ఉంటుందనిపిస్తోంది. ఒక మనిషిని హత్య చేసిన కేసులో నిజాలు వెలుగులోకి వచ్చి, ట్రయల్ జరిగి, దోషులకు శిక్ష పడాలి. అదే మా డిమాండ్. రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికలు వచ్చినప్పుడల్లా వివేకా హత్య కేసును బయటకు తీసి రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబు మానుకోవాలి. లిక్కర్ కేసు మాదిరిగా వివేకా కేసును కూడా ఎన్నికల రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదు. ఒక హత్య కేసును రాజకీయ కుట్రలకు, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మార్చడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని సాకె శైల‌జానాథ్ స్ప‌ష్టం చేశారు.

Back to Top