విజయవాడ: పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్, 66వ డివిజన్‌లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ‘గడప గడపకు వైయస్ఆర్‌సీపీ’ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ కార్పొరేటర్ జానారెడ్డి పాల్గొని ప్రజలను నేరుగా కలుసుకుని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1వ డివిజన్ లెనిన్‌నగర్ పరిధిలోని రైల్వే గేట్ వరకు సుమారు వెయ్యి కుటుంబాలను కలిసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందేవని, ప్రస్తుతం సచివాలయ వ్యవస్థను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీల భారం, సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు, ఉమ్మడి కుటుంబాల మ్యాపింగ్ తదితర అంశాలను ప్రస్తావించారు. జగన్ హయాంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 27 వేల మందికి, అమరావతి ఆర్5 జోన్‌లో వేలాది మందికి ఇళ్ల స్థలాలు అందించామని మల్లాది విష్ణు తెలిపారు. జగనన్న కాలనీల పట్టాలను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిలిచిపోయిన ఆర్‌ఓబీ పనులను త్వరగా పూర్తి చేయాలని, అమృత్ పథకం కింద మంచినీటి పనులను వేగవంతం చేయాలని కోరారు. నగరంలో పారిశుధ్య సమస్యలు, చెత్త కుప్పల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నంద్యాల మెడికల్ కాలేజీ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాజీనామా చేయాలని కోరారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికలకు వైయస్ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని మల్లాది విష్ణు తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.