అనకాపల్లికి గోదావరి జలాల పేరుతో చంద్రబాబు డ్రామా

పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరిచ్చామంటూ ఆర్భాటం

అనకాపల్లి జిల్లా వైయస్సార్‌సీపీ నేతల ధ్వజం

అనకాపల్లిలోని వైయస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్, మాజీ ఎంపీ డాక్టర్‌ భీశెట్టి సత్యవతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాడుగుల నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్‌ ఈర్లి అనురాధ.  

పోలవరం ఎత్తు 41 మీటర్లకు కుదింపు

అలా ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిన చంద్రబాబు

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌

భూములు కార్పొరేట్లకు. సాగునీరు ప్రైవేట్‌ సంస్థలకా?

మరి అనకాపల్లి జిల్లా రైతుల పరిస్థితి ఏమిటి?

సూటిగా ప్రశ్నించిన మాజీ ఎంపీ డాక్టర్‌ బీశెట్టి సత్యవతి

పోలవరం డ్యామ్‌ పూర్తి కాకుండా నీటి విడుదలేమిటి? 

అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్‌ ఆక్షేపణ

తెచ్చింది పురుషోత్తపట్నం నీళ్లా? పోలవరం నీళ్లా?

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి

మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్‌ డిమాండ్‌.

గోదావరి నీటి తరలింపు రైతుల కోసం కాదు

కేవలం కార్పొరేట్‌ సంస్థల కోసమే

తేల్చి చెప్పిన మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ 

పోలవరం ప్రాజెక్టుకు పునాది వేసింది వైయస్సార్‌

వేగంగా పనులు కొనసాగించింది జగన్‌గారు

ఇప్పుడు క్రెడిట్‌ చోరీ చేస్తున్నది చంద్రబాబు

మండిపడ్డ పార్టీ మాడుగుల ఇన్‌ఛార్జ్‌ ఈర్లి అనురాధ

అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల చేశామని చెప్పడం పచ్చి బూటకమని, ఇది ప్రజలను నిలువునా మోసం చేయడమేనని వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. అనకాపల్లికి గోదావరి జలాలు అంటూ, సీఎం చంద్రబాబు నానా హంగామాతో పెద్ద డ్రామా చేశారని అనకాపల్లిలోని వైయస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన పార్టీ నేతలు ఆక్షేపించారు. అసలు పోలవరం డ్యామ్‌ నిర్మాణం పూర్తి కాకుండా, రిజర్వాయర్‌లో అసలు నీటి నిల్వలే లేకుండా నీటిని విడుదల చేశామంటూ జలహారతులు ఇవ్వడం కేవలం ప్రచార ఆర్భాటం, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ తప్ప మరొకటి కాదని వారు స్పష్టం చేశారు. పోలవరం కాలువల తవ్వకం నుంచి భూసేకరణ, అనుమతుల వరకు 80 శాతం పనులను పూర్తి చేసిన ఘనత దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని, ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని, ఇప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా తెచ్చిన గోదావరి జలాలను పోలవరం నీళ్లుగా చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. 
ప్రెస్‌మీట్‌లో ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:

అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించకుండా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లతో మోసం.
:గుడివాడ అమర్‌నాథ్‌. మాజీ మంత్రి.

– గడిచిన రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో నడుస్తున్నది పాలన కాదు, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రమే. పోలవరంలో 2014–19 మధ్య చంద్రబాబు చేసిన డిజైన్‌ లోపాలు, డయాఫ్రమ్‌ వాల్‌ వైఫల్యాలను సరిదిద్దడానికే జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది. నాడు సాక్షాత్తూ ప్రధాని మోదీ గారే పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు. ఎడమ కాలువ కోసం 6200 ఎకరాలు, కుడి కాలువ కోసం 6000 ఎకరాల భూసేకరణ జరిపి, 80 శాతం కాలువ పనులు పూర్తి చేసింది దివంగత నేత వైఎస్సార్‌. 193 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 38 లక్షల ఎకరాలకు నీరివ్వాలన్నది వైఎస్సార్‌ లక్ష్యం. కానీ చంద్రబాబు 2024లో కేంద్రం వద్ద మోకరిల్లి ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించడానికి అంగీకరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును నిలువునా సమాధి చేశారు.
పోలవరంలో 45 మీటర్ల నీరు నిలబడితేనే గ్రావిటీ ద్వారా ఉత్తరాంధ్రకు నీరు వస్తుంది.అనకాపల్లి జిల్లాలో 55 వేల హెక్టార్లలో వరి సాగు జరగాల్సి ఉండగా, తీవ్ర వర్షాభావం వల్ల సెప్టెంబర్‌ నాటికి కేవలం 5 వేల హెక్టార్లలోపే నాట్లు పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి, అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాల్సింది పోయి జగన్‌ గారిపై విషం చిమ్మడానికే సమయం కేటాయించారు. చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించలేకపోయారు. నర్సీపట్నంలో 30 శాతం పనులు పూర్తయిన మెడికల్‌ కాలేజీని నిలిపివేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్, విజయనగరం మెడికల్‌ కాలేజీలను జగన్‌ గారు తీసుకొస్తే... చంద్రబాబు మాత్రం ఉత్తరాంధ్రను దోచుకోవడానికే పరిమితమయ్యారు.

కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును కమీషన్ల కోసం తెచ్చుకుని పాడు చేశారు.
:డాక్టర్‌ భీశెట్టి. సత్యవతి. మాజీ ఎంపీ.

– విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులతో నిర్మించాల్సి ఉండగా, గతంలో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు రాష్ట్ర పరిధిలోకి తెచ్చుకుని సర్వనాశనం చేశారు.వైయస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్స్‌ ఆమోదింపజేసి ప్రాజెక్టును నిలబెట్టారు. ఈరోజు పోలవరం నీళ్లు తెచ్చామని చెబుతూ ఎవరిని మభ్యపెట్టడానికి జలహారతులు ఇస్తున్నారు? గూగుల్‌ లాంటి బహుళజాతి సంస్థల డేటా సెంటర్లకు నీరివ్వడం కోసం ఒప్పందాలు చేసుకుంటూ, రైతుల కోసమే నీళ్లు తెచ్చామని బూటకపు ప్రచారం చేస్తున్నారు. ఎల్‌–నినో ప్రభావంతో జిల్లాలో కరువు తాండవిస్తుంటే రైతులకు కనీస ఆర్థిక సాయం గానీ, వారిని అదుకునే ప్రయత్నాలు చేయకపోవడం దారుణం. జగన్‌ మోహన్‌ రెడ్డి గారి హయాంలో పేదలకు సెంటు స్థలాలిచ్చి ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు వేల ఎకరాల భూములను ధారాదత్తం చేస్తోంది. చంద్రబాబు కల్పిత ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారు, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం. 

చంద్రబాబుది క్రెడిట్‌ చోరీ.
:బొడ్డేటి ప్రసాద్‌. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు.

– పోలవరం ఎడమ కాలువ పేరుతో విడుదల చేసిన నీరు శారదా నది నీరు అసలు ఎక్కడికి వెళ్తుందో చెప్పే ధైర్యం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. పోలవరం ప్రాజెక్టు అనేది దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి కల, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆశయం. ఆ ప్రాజెక్టు క్రెడిట్‌ను చోరీ చేయడానికి చంద్రబాబు నాయుడు పడరాని పాట్లు పడుతున్నారు. మేమేమీ గోదావరి జలాలు రావడాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ ప్రజలను నిలువునా మోసం చేసే విధానాన్నే తీవ్రంగా తప్పు పడుతున్నాం. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ పూర్తి కాలేదు, రిజర్వాయర్‌లో నీటి నిల్వలు లేవు. అలాంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టును తామే ప్రారంభించినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. చంద్రబాబు ఇప్పటికైనా ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఆపి, డ్యామ్‌ నిర్మాణం పూర్తి చేసి, ఎడమ కాలువ పనులను సమగ్రంగా ముగించి రైతులకు శాశ్వతంగా సాగునీరు అందించాలి.

ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టిన కూటమి సర్కార్‌ అసలైన వెన్నుపోటు పార్టీ.
:పెట్ల ఉమాశంకర గణేష్‌. మాజీ ఎమ్మెల్యే.

– అనకాపల్లికి తీసుకొచ్చిన నీరు నిజంగా పోలవరం రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీరా? లేక పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా తోడిన గోదావరి జలాలా? అనేది చంద్రబాబు స్పష్టం చేయాలి. మొత్తం పోలవరం ప్రాజెక్టే పూర్తయిపోయినట్లు బిల్డప్‌ ఇస్తున్నారు. నాడు వైఎస్సార్‌ ఎడమ కాలువ పనులు మొదలుపెడితే ’ప్రాజెక్టు లేకుండా కాలువలు తవ్వి చేపలు పడతారా’ అని ఎగతాళి చేసిన తెలుగుదేశం నాయకులు, ఇవాళ వైఎస్సార్‌ తవ్విన ఆ 181 కిలోమీటర్ల కాలువల ద్వారానే నీళ్లు పారిస్తూ సిగ్గులేకుండా జబ్బలు చరుచుకుంటున్నారు. ఎడమ కాలువలో 79 శాతానికి పైగా పనులు ఆనాడే వైఎస్సార్‌ పూర్తి చేశారు. రుషికొండ భవనాలపై మాట్లాడే చంద్రబాబు, ఒక్కరోజు యోగా కార్యక్రమం కోసం రూ. 300 కోట్లు ప్రజాధనాన్ని తగలేసింది వాస్తవం కాదా? ఎన్నికల ముందు నిరుద్యోగ భతి రూ. 3 వేలు, మహిళలకు నెలకు రూ. 1500, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, 50 ఏళ్లకే పింఛన్లని నమ్మించి గద్దెనెక్కాక ప్రజలందరినీ నిలువునా వెన్నుపోటు పొడిచారు. ప్రతి మంగళవారం వేల కోట్ల అప్పులు తెస్తున్నా, నర్సీపట్నంలో వైయ‌స్‌ జగన్‌ మంజూరు చేసిన మెడికల్‌ కాలేజీని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు?.

తాళ్లపాలెం వద్ద లీకేజీలే చంద్రబాబు డొల్ల ప్రచారానికి నిదర్శనం.
:ఏ.అదీప్‌ రాజ్‌. మాజీ ఎమ్మెల్యే. పెందుర్తి.

– వారం రోజులుగా అనకాపల్లికి నీరిచ్చేస్తున్నామని కూటమి నేతలు ప్రచారం చేసుకున్నారు కానీ, పోలవరం రిజర్వాయర్‌ నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. పురుషోత్తపట్నం నుంచి ఎత్తిపోసిన నీటినే ఇక్కడికి మళ్లించారు. అసలు ఈ నీరు తెచ్చింది సాగు, తాగునీటి అవసరాల కోసమా లేక అచ్యుతాపురంలో పెట్టే డేటా సెంటర్ల కోసమో, నక్కపల్లిలో నిర్మించే ప్రైవేటు సంస్థల కోసమో ప్రజలకు చెప్పాలి. వ్యవసాయానికి నీరివ్వడానికి డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్‌ ఎక్కడా సిద్ధం చేయలేదు. తాళ్లపాలెం వద్ద హడావిడిగా పైపులైన్లు వేసి, మట్టి కప్పి వదిలేయడంతో అప్పుడే లీక్‌ అవుతున్నాయి. రైతుల పొలాలకు నీళ్లు వెళ్లే దారే లేనప్పుడు ఈ హడావిడి ప్రారంభోత్సవాలు ఎవరి కోసం? పోలవరం ప్రాజెక్టును ముందుకు నడిపిన ఘనత పూర్తిగా రాజశేఖరరెడ్డి గారిదే. కేవలం పరిశ్రమల కోసమే నీటిని మళ్లిస్తూ రైతుల కోసం తెచ్చినట్లు నాటకాలు ఆడటం మానుకోవాలి.

మోటార్లు పెట్టి తోడుకుంటే తప్ప పొలాలకు నీరందని దుస్థితి.
:ఈర్లి. అనురాధ. మాడుగుల నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్‌

– పోలవరం ప్రాజెక్టుకు అసలైన పునాది వేసి, నిధులు కేటాయించి, పనులు పరుగులు పెట్టించింది మహానేత రాజశేఖరరెడ్డి గారైతే, ఇవాళ చంద్రబాబు  క్రెడిట్‌ చోరీ చేస్తున్నారు. 2014–19 మధ్య బస్సులు పెట్టి జనాన్ని తీసుకెళ్లి ’జయం జయం చంద్రబాబు’ అని భజన చేయించుకున్నారే తప్ప ప్రాజెక్టును ఏనాడైనా పూర్తి చేశారా? వైఎస్సార్‌ హయాంలోనే కాలువలు, ప్రధాన పనులు పూర్తయ్యాయి. పోలవరం నుంచి వేల ఎకరాలకు నీరిచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు కానీ, పొలాలకు నీరందక రైతులు వర్షాభావ పరిస్థితుల్లో అల్లాడుతున్నారు. కెనాల్‌ నుంచి నీళ్లు తీసుకోవాలంటే రైతులు సొంతంగా మోటార్లు పెట్టుకుని తోడుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇది ఇక్కడి కరవు పరిస్థితి తీవ్రత చూపుతోంది.

Back to Top