తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు లభించిన అదనపు పది రోజుల గడువును పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీ ఐడీ కార్డుల పంపిణీని కార్యకర్తలను మరింత క్రియాశీలం చేసే కార్యక్రమంగా నిర్వహిస్తూ, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు సమావేశాలు, ‘వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’ ప్రచారాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఎన్నికల సన్నద్ధత మాటల్లో కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించేలా పటిష్టమైన క్యాలెండర్, సమయపట్టికతో కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీ/పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యే/నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ, ‘వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’ ప్రచారం తదితర అంశాలపై సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. - ఎస్‌ఐఆర్‌పై ప్రతి ఓటును కాపాడేలా పనిచేయాలి “ఎస్‌ఐఆర్‌కు అనుకోకుండా మరో పది రోజుల సమయం లభించింది. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. గతంలో మనం పంపిన డూప్లికేట్ ఓటర్ల జాబితాలను బూత్ స్థాయి ఏజెంట్లతో మరోసారి పరిశీలించాలి. మన ఓటర్లు పొరపాటున తొలగించబడి ఉంటే ఫారమ్-6 ద్వారా తిరిగి చేర్పించే ప్రక్రియను పూర్తి చేయాలి. హైదరాబాద్‌కు సంబంధించిన డూప్లికేట్ ఓటర్ల జాబితాలను కూడా మరోసారి పరిశీలించి, అవసరమైన వివరాలతో సంబంధిత అధికారులకు సమర్పించాలి. ప్రతి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న నోటీసులు, విచారణలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి.” - స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి “స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. అభ్యర్థులను ముందుగానే గుర్తించాలి. వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చే అవకాశాలను పరిశీలించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. ఎన్నికల సన్నద్ధత మాటల్లో కాకుండా చేతల్లో కనిపించాలి. జిల్లా స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయి వరకు సమావేశాలు నిర్వహించాలి. ప్రతి యూనిట్‌లో పార్టీ పరిస్థితి, స్థానిక సమస్యలు, ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరగాలి.” - ఐడీ కార్డుల పంపిణీని పార్టీ బలోపేతానికి ఉపయోగించాలి “ఐడీ కార్డుల పంపిణీ కేవలం కార్డులు అందించే కార్యక్రమంగా కాకుండా పార్టీ శ్రేణులను మరింత క్రియాశీలం చేసే కార్యక్రమంగా ఉండాలి. కార్డు అందుకున్న ప్రతి ఒక్కరి నుంచి రసీదు తీసుకోవాలి. ఎవరి కార్డు ఎక్కడికి చేరిందనే విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో పంపిణీ చేయాల్సిన కార్డులు, అసెంబ్లీ స్థాయిలో ఇవ్వాల్సిన కార్డులు, మండల స్థాయిలో పంపిణీ చేయాల్సిన కార్డులపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.” - ‘వెన్నుపోటు పాలన’ను గ్రామస్థాయికి తీసుకెళ్లాలి “‘వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’ ప్రచారం గ్రామస్థాయి వరకు వెళ్లాలి. గడపగడపకు వెళ్లి ప్రజలకు ఈ పాలనలో ఎదురవుతున్న సమస్యలను వివరించాలి. రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యలను కూడా ప్రచారంలో భాగం చేయాలి. గ్రామం, వార్డు స్థాయిలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు ముందుండాలి. అవసరమైన చోట మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కూడా పాల్గొనాలి.” - ప్రతి కార్యక్రమానికి పక్కా క్యాలెండర్ ఉండాలి “ఇప్పటి నుంచి ప్రతి కార్యక్రమానికి క్యాలెండర్, సమయపట్టికను క్రమబద్ధంగా రూపొందించుకోవాలి. ఏ కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ఆధ్వర్యంలో జరగాలి అనేది ముందుగానే నిర్ణయించాలి. జిల్లా పరిస్థితులకు అనుగుణంగా రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు కలిసి ప్రణాళిక రూపొందించాలి. ప్రతి కార్యక్రమం జరగకముందు, జరిగిన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలి. మనం సిద్ధంగా ఉన్నామనే స్పష్టమైన సందేశం ప్రజల్లోకి వెళ్లాలి.” - పార్టీ సన్నద్ధత రాష్ట్రవ్యాప్తంగా కనిపించాలి “175 నియోజకవర్గాలు, 26 జిల్లాల్లో జరిగే సమావేశాలు పార్టీ ఎన్నికల సన్నద్ధతకు బలమైన సందేశం ఇవ్వాలి. మనం ఒక అడుగు ముందుకేసి, దూకుడుగా సిద్ధమవుతున్నామనే విషయం స్పష్టంగా కనిపించాలి. ప్రత్యర్థులు కూడా మన సన్నద్ధత గురించి మాట్లాడుకునే స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించాలి. కేంద్ర కార్యాలయం నుంచి అందిస్తున్న కంటెంట్‌ను జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూడా సమర్థంగా ఉపయోగించుకోవాలి. స్థానిక సమస్యలు, స్థానిక నాయకుల భాగస్వామ్యంతో ప్రత్యేక కంటెంట్ రూపొందించి ప్రచారం చేయాలి.” - ఐడీ కార్డులతో పాటు పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి “ఐడీ కార్డుల పంపిణీతో కమిటీలన్నీ మళ్లీ క్రియాశీలం అవుతాయి. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే ఉన్న కంట్రోల్ రూమ్‌లు, సహాయక వ్యవస్థలు, సామాజిక మాధ్యమాల బృందాలను సమన్వయం చేసుకుని ప్రతి కార్యక్రమాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి.” - ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలి “స్థానిక సంస్థల ఎన్నికలను రాబోయే సాధారణ ఎన్నికలకు సన్నాహకంగా కూడా ఉపయోగించుకోవాలి. పార్టీకి అవసరమైన వ్యవస్థను ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకోవాలి. ఇది మనకు సన్నాహక కార్యక్రమంలా, ముందస్తు సాధనలా ఉపయోగపడుతుంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగాలి. కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారం అందిస్తాం. అయితే ప్రధానంగా క్షేత్రస్థాయిలోనే ప్రణాళిక, అమలు జరగాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలి.”