వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు.. మున్సిపల్‌ కార్పొరేషన్లలో జోరు!

  ఇంటింటికీ చేరుతున్న అభ్యర్థులు.. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన
 
మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నేతల విస్తృత ప్రచారం

తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. మేయర్‌ అభ్యర్థితో పాటు తమ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. నగరాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

 ఎన్టీఆర్‌ జిల్లా – తిరువూరులో సంక్షేమ పాలనకు ప్రజల ప్రశంసలు

తిరువూరు 13వ వార్డులో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుందరయ్య కాలనీలో ప్రచారం సందర్భంగా ఓ వృద్ధురాలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అమలైన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన విధానం ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని ప్రశంసించారు.

 కర్నూలు – ఏడో వార్డులో విస్తృత ప్రచారం

కర్నూలు నగరంలోని ఏడో వార్డులో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, మేయర్‌ అభ్యర్థి సుశీల, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కార్పొరేటర్‌ అభ్యర్థి వరలక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 తిరుపతి – వాసు యాదవ్‌ విజయమే లక్ష్యంగా ప్రచారం

తిరుపతి నగరంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 33వ వార్డులో వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహించిన ప్రచారంలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. మేయర్‌ అభ్యర్థి వాసు యాదవ్‌తో పాటు కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కోరారు. ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, వాసు యాదవ్‌ విజయం సాధిస్తారని భూమన ధీమా వ్యక్తం చేశారు.

తిరుపతిలో కూటమి పాలనలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో రహదారుల నిర్మాణం, పట్టణ విస్తరణతో తిరుపతి అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని గుర్తుచేశారు. మేయర్‌ అభ్యర్థి వాసు యాదవ్‌తో పాటు కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 కృష్ణా జిల్లా – గుడివాడలో ఇంటింటి ప్రచారం

గుడివాడలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి, ఇతర అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్న తదితరులు ప్రచారంలో పాల్గొని ప్రజలను కలిశారు.

 కర్నూలు – ప్రజా సమస్యలే ప్రచార అజెండా

కర్నూలు మేయర్‌ అభ్యర్థి సుశీల ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. నిరుద్యోగులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రస్తుత పాలనలో పింఛన్లు, సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను కోరుకుంటున్నారని, స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 అనంతపురం – మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌కు మద్దతుగా పిలుపు

అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైయ‌స్ఆర్‌సీపీ మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌ నగర అభివృద్ధికి తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వ విధానాలు, నగరంలో నెలకొన్న సమస్యలను ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని తెలిపారు.

కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నాయని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల సమయంలో నామినేషన్లకు అడ్డంకులు ఎదురవడం, దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలపై కూటమి నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 విజయవాడ సెంట్రల్‌ – గత అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారం

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని 59, 61, 72వ వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్పొరేటర్‌ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీ, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్లు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఆరోగ్యశ్రీ సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో మళ్లీ ఓట్లు కోరుతూ వస్తున్న కూటమి నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులకు అడ్డంకులు సృష్టించడం, వాహనాలపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

 విజయవాడ పశ్చిమ – ప్రజా వ్యతిరేక పాలనకు ఓటుతో సమాధానం చెప్పాలి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 44, 54వ వార్డుల్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కార్పొరేటర్‌ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు.

నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పోలీసులను ఉపయోగించి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయాలని చూస్తున్నారని వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

 విశాఖపట్నం – గంగవరంలో వరుదు కల్యాణి ప్రచారం

విశాఖపట్నం జీవీఎంసీ 94వ వార్డులో వైయ‌స్ఆర్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార ర్యాలీకి వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తిప్పల నాగిరెడ్డి, దేవన్‌రెడ్డి, మాజీ మంత్రి బాలరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. గంగవరం ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగట్టారు.

 ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరికలు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మైసన్నగూడెంకు చెందిన సుమారు 50 కుటుంబాలు టీడీపీ, జనసేన పార్టీల నుంచి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకుడు జెట్టి గురునాథరావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమిలో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం లభించకపోవడంతోనే వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

 కర్నూలు – కల్లూరు అర్బన్‌లో ప్రచారం

కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్‌ 33వ వార్డు అబ్బాస్‌నగర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి గాజుల శ్వేతారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు.

 నంద్యాల – భారీగా తరలివచ్చిన ప్రజలు

నంద్యాల పట్టణంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగింది. ఎస్‌బీఐ కాలనీ, బయటి పేట, ఓల్డ్‌టౌన్‌ ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్‌ బాషా, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి అమీర్‌ బాషా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

విజ‌య‌మే ల‌క్ష్యంగా ప్ర‌చారం

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రచారం ఊపందుకుంది. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రజల స్పందనను తమకు అనుకూలంగా మలుచుకుని స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.

 

1/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh2

2/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh3

3/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh4

4/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh5

5/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh6

6/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh7

7/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh8

8/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh9

9/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh10

10/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh11

11/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh12

12/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh13

13/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh14

14/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh15

15/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh16

16/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh17

17/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh18

18/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh19

19/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh20

20/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh21

21/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh22

22/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh23

23/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh24

24/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh25

25/26

Intense Election Campaigning by YSRCP in Andhra Pradesh26

Back to Top