టీచర్ల నియామకాల్లోనే దొంగలు పడితే.. భావితరాల భవిష్యత్తు ఏమిటి?

డీఎస్సీలో ప‌దుల సంఖ్య‌లో న‌కిలీ టీచ‌ర్లు.. 

సాక్ష్యాధారాలతో అక్రమాలు బయటపడినా లోకేష్‌ ఎందుకు మౌనం?

 నారా లోకేష్‌ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి: పేర్ని నాని

తాడేపల్లి: గురువుల నియామకాల్లోనే దొంగలు పడిన పరిస్థితిపై ఉద్యమం చేయాల్సి రావడం సిగ్గుచేటని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గురు పరిరక్షణ దీక్షలో ఆయన మాట్లాడుతూ నకిలీ ఉపాధ్యాయులతో భావితరాలకు ప్రమాదం పొంచి ఉందని, సమాజం దారి తప్పే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే బాధ్యత కూడా టీచర్లదే కాబట్టి వారిని అక్రమాలకు ఉపయోగించుకోవచ్చనే ఆలోచనతోనే అడ్డదారిలో అక్రమార్కులకు టీచర్ పోస్టులు కట్టబెట్టారా అనే అనుమానం కలుగుతోందన్నారు.

రెండేళ్లుగా విద్యాశాఖలో అడుగడుగునా అనుమానాలే

ఎంత వద్దని మొత్తుకున్నా లోకేష్‌ విద్యాశాఖనే ఎంచుకున్నాడని చంద్రబాబు చెప్పారని పేర్ని నాని గుర్తుచేశారు. డబ్బులు దండుకోవడం కోసమే నారా లోకేష్‌ విద్యావ్యవస్థను ఎంచుకుని మంత్రి అయ్యాడా అనే అనుమానం కలుగుతోందన్నారు. రెండేళ్లుగా నారా లోకేష్‌ వేసిన ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉందని, మంత్రి పదవి ఆయనకు మెహర్బానీ కోసమే తప్ప బాధ్యతగా వ్యవహరించిన ఒక్క సందర్భం కూడా లేదని అన్నారు. రెండేళ్లలో ఏ శాఖపై రానన్ని ఆరోపణలు, అవకతవకలు విద్యాశాఖపై వచ్చినా లోకేష్‌ వివరణ ఇచ్చుకునే ధైర్యం చేయలేదన్నారు. అయితే అన్ని శాఖలపైనా లోకేష్‌ పెత్తనం చేస్తారని పేర్ని నాని పేర్కొన్నారు.

 నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలా?

డీఎస్సీ అక్రమాలను బయటపెడుతున్న మీడియా ఛానళ్ల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయిస్తున్నారని పేర్ని నాని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ చేసిన పోరాటం ఫలితంగానే ఈరోజు అన్ని మీడియా ఛానళ్లు డీఎస్సీ అక్రమాలను బయటకు తీసుకొస్తున్నాయని చెప్పారు. మొన్నటి వరకు స్పోర్ట్స్‌ డీఎస్సీలోనే అక్రమాలు జరిగాయని అంతా అనుకున్నారని, ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ అక్రమాలు జరిగినట్లు రుజువైందన్నారు. నకిలీ రిజర్వేషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వడం, నకిలీ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు సృష్టించడం, టెట్‌ లేకుండానే ఉద్యోగాలు ఇవ్వడం, డిగ్రీ కూడా అవసరం లేని పరిస్థితి కల్పించడం వంటి అక్రమాలు జరిగాయని పేర్ని నాని పేర్కొన్నారు.

ప‌దుల సంఖ్య‌లో న‌కిలీ టీచ‌ర్లు.. లోకేష్‌ రాజీనామా ఎప్పుడు?

ఒక్క నకిలీ టీచర్‌ ఉద్యోగం పొందినా తాను రాజీనామా చేస్తానని నారా లోకేష్‌ చెప్పారని పేర్ని నాని గుర్తుచేశారు. ఇప్పుడు ప‌దుల సంఖ్య‌లో న‌కిలీ టీచ‌ర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నార‌ని, మరి నారా లోకేష్‌ ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. తండ్రీకొడుకులకు సైకో బుద్ధులు ఉన్నాయి కాబట్టే టీచర్‌ ఉద్యోగాలను కూడా అమ్మేసుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సాక్ష్యాధారాలతో డీఎస్సీ అక్రమాలు బయటపడిన తర్వాత ఇక చర్చలు అనవసరమని, నారా లోకేష్‌ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని పేర్ని నాని స్పష్టం చేశారు.
 

Back to Top