డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’

నకిలీ అర్హతలతో ఉద్యోగాలు పొందిన వారిని ఏరివేయాలి

సీబీఐ విచారణతో నిజాలు నిగ్గుతేలాలి.. లోకేష్‌ రాజీనామా చేయాలి

తాడేపల్లి: గురు పూజోత్సవం సందర్భంగా డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ‘గురు పరిరక్షణ దీక్ష’ చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అనర్హులను గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కౌరు శ్రీనివాస్, పెన్మెత్స సురేష్‌బాబు, ఇసాక్, కల్పలతారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్‌కుమార్, రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం నిరసన చేపట్టారు.

మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? : వైవీ సుబ్బారెడ్డి

 మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరిపించాలని వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. గురు పూజోత్సవం సందర్భంగా తాడేపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహించిన ‘గురు పరిరక్షణ దీక్ష’లో ఆయన మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలకు సంబంధించి రోజుకో కొత్త అంశం బయటకు వస్తోందని తెలిపారు. అనర్హులు టీచర్లుగా నియమితులైనట్లు ప్రభుత్వం స్వయంగా తేల్చిందని చెప్పారు. నాలుగైదు జిల్లాల్లో రహస్యంగా విచారణ జరుగుతున్నట్లు పత్రికల్లో వస్తున్న వార్తలు చూస్తుంటే మెగా డీఎస్సీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా, అక్రమాలకు నిలయంగా మారిందో అర్థమవుతోందన్నారు.

నోటిఫికేషన్‌ నుంచి నియామకాల వరకు అక్రమాలే

నోటిఫికేషన్‌ జారీ నుంచి టీచర్ల నియామకాల వరకు అడుగడుగునా అక్రమాలు జరిగిన విషయం ఇప్పటికే స్పష్టమైందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో పాటు తప్పుడు రిజర్వేషన్లను ఉపయోగించి ఉద్యోగాలు పొందినట్లు రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోందన్నారు. ఇలాంటి అక్రమాలపై రహస్యంగా విచారణలు చేయడం కాకుండా సమగ్రంగా, పారదర్శకంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీబీఐ విచారణ ద్వారానే డీఎస్సీలో జరిగిన అక్రమాల పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.

లోకేష్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాలి

నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన సందర్భాన్ని ప్రస్తావించిన వైవీ సుబ్బారెడ్డి.. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలన్నదే వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన డిమాండ్‌ అని స్పష్టం చేశారు. అనర్హులు గురువులుగా వస్తే భావి పౌరుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. ప్రతిభావంతులైన అభ్యర్థులకు తప్పనిసరిగా న్యాయం జరగాలని స్పష్టం చేశారు. కష్టపడి అర్హత సాధించి టీచర్‌ పోస్టులు పొందిన వారిని తొలగించాలని వైయ‌స్ఆర్‌సీపీ కోరడం లేదని, అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందిన అనర్హులను మాత్రమే గుర్తించి చర్యలు తీసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

Back to Top