చంద్రబాబు ప్రెస్టేషన్‌ పీక్‌ లెవల్‌కు చేరింది

కలెక్టర్లను బెదిరించడం, అధికారులపై నెపం నెట్టడం సరికాదు

 మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు

తాడేప‌ల్లి: చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రెస్టేషన్‌ పీక్‌ లెవల్‌కు చేరినట్లు స్పష్టమవుతోందని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు అన్నారు. మహిళా ఐఏఎస్‌ అధికారి సునీతను ఉద్దేశపూర్వకంగా టార్గెట్‌ చేయడం, కలెక్టర్ల సమావేశాల్లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని పేర్కొన్నారు.

స్కిల్‌ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతోనే చంద్రబాబు ప్రతిసారీ ఆమెను టార్గెట్‌ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఒత్తిడి చేయడం వల్లే తాను సంతకాలు చేసినట్టు సునీత చెప్పారని, అందుకే ఆమెపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఒక దళిత మహిళా ఐఏఎస్‌ అధికారిపై ఈ విధంగా నోరు పారేసుకోవడం తగదన్నారు.

డీఎస్సీ అక్రమాల బాధ్యత అధికారులపైకి నెట్టడం సరికాదు

స్పోర్ట్స్‌ కోటాలో నారా లోకేష్‌ తన అనుచరులకు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చిన అంశాలకు సంబంధించిన ఆధారాలు బయటకు వచ్చినా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాల బాధ్యతను అధికారులపైకి నెట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి అధికారులు సంతకాలు చేయవద్దని తాము పదేపదే హెచ్చరించామని చెప్పారు.

అవినీతిలో అధికారులు భాగస్వాములు కావొద్దు

చంద్రబాబు, లోకేష్‌ అవినీతికి అధికారులు బాధ్యులు కావద్దని టీజేఆర్‌ సుధాకర్‌ బాబు సూచించారు. ఐఏఎస్‌ అధికారి సునీత మాదిరిగా అధికారులు ధైర్యంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్‌ అక్రమాలపై విచారణ జరిగి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

లోకేష్‌ రాజీనామా ఎప్పుడు?

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. డీఎస్సీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నారా లోకేష్‌ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. బాధ్యత తీసుకోవాల్సిన చోట అధికారులపై నెపం నెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ముందుగానే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదన్నారు. వర్షాభావ పరిస్థితులకు రైతులను సిద్ధం చేయకుండా ఇప్పుడు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని తెలిపారు.

పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలన్నీ ప్రజలను మోసం చేసేందుకే

చంద్రబాబు చెబుతున్న పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కల్లో వాస్తవం లేదని టీజేఆర్‌ సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను దగా చేస్తున్నారని అన్నారు.

పెన్షనర్లు, వృద్ధులు, వికలాంగులను అవమానించడం దుర్మార్గం

పెన్షనర్లు, వృద్ధులు, వికలాంగులను తాగుబోతులుగా పేర్కొనడం అత్యంత దుర్మార్గమని టీజేఆర్‌ సుధాకర్‌ బాబు అన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులను అవహేళన చేయడం తగదన్నారు. ఆ వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.
 

Back to Top