తాడేపల్లి: పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా పేరుతో కొంతమంది అభ్యర్థులకు ప్రత్యేక ప్రయోజనం కల్పించేలా నియామక ప్రక్రియ సాగిందనే అనుమానాలు ఉన్నాయని, దీనిపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమా? అని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రవిచంద్ర సవాల్ చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నియామకాలకు సంబంధించిన పూర్తి డేటాను ప్రభుత్వం వెంటనే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని కోరారు. కటాఫ్ మార్కులు, కేటగిరీ, మెరిట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, ఎంపిక ప్రాతిపదిక వంటి పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థుల పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్‌ను రద్దు చేయడంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయనే అనుమానాలు నిరుద్యోగ అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయని, నియామకాల్లో పారదర్శకతపై అభ్యర్థులకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని కోరారు. పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. బ్యాక్‌లాగ్ పోస్టులు ఏ నిబంధన ప్రకారం చేర్చారు? జగన్ గారి హయాంలో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని, ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించామని, ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రక్రియను కూడా చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జూలైలో 6,100 పోస్టుల నోటిఫికేషన్‌ను సవరించి 79 బ్యాక్‌లాగ్ పోస్టులను అదనంగా చూపించిందని పేర్కొన్నారు. 6,100 పోస్టులకు 79 పోస్టులు అదనంగా చూపించినప్పుడు మొత్తం నియామకాలు 6,179 అవుతాయని తెలిపారు. మరి ప్రభుత్వం 6,100 పోస్టులే భర్తీ చేశామని ఎందుకు చెబుతోందని ప్రశ్నించారు. 79 బ్యాక్‌లాగ్ పోస్టులను ఏ నిబంధనల ప్రకారం చేర్చారు? ఎవరికి కేటాయించారు? ఏ కేటగిరీకి ఇచ్చారు? దీనిపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ఎంపిక వివరాలన్నీ పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి స్పోర్ట్స్ కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి ఎందుకు పెంచారు? 20 క్రీడలను 67 క్రీడలకు ఎందుకు పెంచారు? ఈ మార్పులకు ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులు ఏ క్రీడలో పాల్గొన్నారు? ఏ సర్టిఫికెట్ సమర్పించారు? ఆ సర్టిఫికెట్‌ను ఎవరు వెరిఫై చేశారు? ఆ అభ్యర్థి సాధించిన మెరిట్ ఎంత? వారికి వర్తించిన కటాఫ్ మార్కులు ఎన్ని? ఈ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కానిస్టేబుల్ సెలక్షన్ లిస్టులో కేవలం అభ్యర్థి పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఉన్నాయని తెలిపారు. అభ్యర్థి రిజర్వేషన్ కేటగిరీ, మెరిట్, స్పోర్ట్స్ కోటా, ఎన్‌సీసీ, ఎంఎస్‌పీ తదితర వివరాలను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన పూర్తి డేటాను ప్రభుత్వం వెంటనే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని కోరారు. కటాఫ్ మార్కులు, అభ్యర్థుల కేటగిరీ, మెరిట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, ఎంపికకు ప్రాతిపదికగా తీసుకున్న అంశాలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో పబ్లిక్ డొమైన్‌లో సెలక్షన్ లిస్టు జగన్ గారి హయాంలో ఎస్ఐ నియామకాల సందర్భంగా అభ్యర్థుల రిజర్వేషన్, మెరిట్, కేటగిరీ, వివిధ సర్టిఫికెట్లకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచామని తెలిపారు. అదే పారదర్శకతను కానిస్టేబుల్ నియామకాల్లో ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. గుంటూరు రూరల్‌లో జనరల్ కేటగిరీ కటాఫ్ 138 మార్కులు ఉంటే స్పోర్ట్స్ కేటగిరీలో 88 మార్కులు ఉన్నాయని చెబుతున్నారని, అంటే 50 మార్కుల తేడా ఎందుకు వచ్చిందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే నెల్లూరులో జనరల్ కేటగిరీ కటాఫ్ 138 మార్కులు ఉంటే స్పోర్ట్స్ కేటగిరీలో 98 మార్కులు ఉన్నాయని చెబుతున్నారని, 40 మార్కుల వ్యత్యాసానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో కొంతమంది అభ్యర్థులకు ప్రత్యేక ప్రయోజనం కల్పించారనే అనుమానాలు నిరుద్యోగ అభ్యర్థుల్లో ఉన్నాయని, ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ తక్షణం స్పందించాలి పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రజల ముందుంచాలని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థుల పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. చివరి నిమిషంలో పరేడ్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నించారు. పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్ రద్దుపై హోంమంత్రి అనిత వెంటనే స్పందించి నిరుద్యోగ అభ్యర్థులకు సమాధానం చెప్పాలని కోరారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ నియామకాలపై వస్తున్న ఆరోపణలు, అనుమానాలపై స్పందించాలని తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పాలంటే పూర్తి వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని స్పష్టం చేశారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి నిజంగా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలీస్ కానిస్టేబుల్ నియామకాలపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పానుగంటి చైతన్య, ఏ. రవిచంద్ర కోరారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమా? అని సూటిగా ప్రశ్నించారు. నియామకాల్లో పారదర్శకతపై అభ్యర్థులకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని, ప్రతి అభ్యర్థికి సంబంధించిన ఎంపిక వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పానుగంటి చైతన్య, రవిచంద్ర స్పష్టం చేశారు.