పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు గురై నలుగురు మృతి చెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్న కోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు గురై మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పండుగ వేళ నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం కలచివేసిందని వైయస్ జగన్ అన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి, తక్షణ ఆర్థిక సహాయం అందించాలని వైయస్ జగన్ కోరారు.