ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం

డీఏ బకాయిలను వెంటనే నగదు రూపంలో చెల్లించాలి

పీఆర్సీ నియమించి ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి

 తాడేప‌ల్లి: ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన డీఏలను సకాలంలో చెల్లించకుండా కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రతి ఆరు నెలలకు చెల్లించాల్సిన డీఏల్లో ఐదు బకాయిలు ఉండగా, ప్రస్తుతం రెండు డీఏలకు మాత్రమే ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని తెలిపారు.

డీఏ అనేది ప్రభుత్వ దయతో ఇచ్చే కానుక కాదని, ఉద్యోగులు, పెన్షనర్ల హక్కు అని స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిలను వాయిదాల పేరుతో కాకుండా వెంటనే నగదు రూపంలో చెల్లించాలని కోరారు. ఉద్యోగుల బకాయిలను జీపీఎఫ్‌లో, సీపీఎస్ ఉద్యోగుల బకాయిలను ప్రాన్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం సరిపోదని, వారికి తక్షణ ఆర్థిక ప్రయోజనం కల్పించాలని అన్నారు.

గతంలో ప్రకటించిన నాలుగు విడతల బకాయిల్లో ఒక్క విడత కూడా చెల్లించలేదని, ప్రభుత్వం జారీ చేసిన జీవోలనే అమలు చేయలేని పరిస్థితి నెలకొందని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏను బొనాంజా, దీపావళి కానుకగా ప్రచారం చేయడం సరికాదని, హక్కులను కానుకలుగా చూపించవద్దని స్పష్టం చేశారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, డీఏలతో పాటు పీఆర్సీ, సరెండర్ లీవ్ బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వెంటనే పే రివిజన్ కమిషన్‌ను నియమించి, ఉద్యోగులకు ఇంటరిమ్ రిలీఫ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, ఎన్నికల సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు. పండగల నేపథ్యంలో పెండింగ్ డీఏ బకాయిలను వెంటనే నగదు రూపంలో చెల్లించి ఉద్యోగులు, పెన్షనర్లకు న్యాయం చేయాలని, వారి సహనాన్ని ప్రభుత్వం పరీక్షించవద్దని స్పష్టం చేశారు.
 

Back to Top