పోతిరెడ్డిపాడుపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం 

నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి

నంద్యాల జిల్లా: రాయలసీమ జీవనాడి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌పై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు సాగు, తాగునీరు అందించే కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విషయంలో ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపడం లేదని, గేట్లకు మరమ్మతులు కూడా చేయలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయలసీమకు నీరు అందించాల్సిన ప్రాజెక్టులు, కాలువలు, హెడ్‌ రెగ్యులేటర్ల నిర్వహణను పట్టించుకోకుండా ప్రాంత ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని కాటసాని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే రాయలసీమ రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని, రాయలసీమకు నీరు అందకుండా చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని సమాధి చేస్తోందని మండిపడ్డారు.

 ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్లే రోప్ తెగిపోయింది:  మాజీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి
ప్రభుత్వ చేతకానితనం, నిర్లక్ష్యం వల్లే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ రోప్‌ తెగిపోయే పరిస్థితి వచ్చిందని వైయ‌స్ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్తే పోలీసులు అడ్డుకోవడం దారుణమని, శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ దిగువకు అరకొరగా మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నా కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారని, రైతుల గోడు చంద్రబాబుకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని ప్రభుత్వం ఉందంటే అది టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు.

తెలంగాణలో కల్వకుర్తి, పాలమూరు, డిండి ప్రాంతాల్లో లిఫ్ట్‌ల సామర్థ్యాన్ని పెంచుతుంటే ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేకపోయారని శిల్పా చక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో 750 అడుగుల వద్దే నీటిని ఎత్తిపోస్తున్నారని, రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టు వల్ల చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని నిలదీశారు. గురుశిష్యుల మధ్య చీకటి ఒప్పందాలతో రాయలసీమను తాకట్టు పెట్టారని, నెల్లూరు, కోస్తా, చెన్నై ప్రాంతాలకు నీరు వెళ్లడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆరోపించారు. రైతు పక్షాన చంద్రబాబు ఎప్పుడైనా నిలిచారా అని ప్రశ్నిస్తూ, రెండు కళ్ల సిద్ధాంతంతో రాయలసీమను సర్వనాశనం చేసిన చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు. రాయలసీమ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని శిల్పా చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top