స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి 

అనంత వెంకటరామిరెడ్డి

 కళ్యాణదుర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

కళ్యాణదుర్గం: స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అనంత‌పురం జిల్లా అధ్య‌క్షుడు  
అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిశీలకుడు మహిందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ టీడీపీతో పోరాడి అభ్యర్థులను గెలిపించుకున్నామని, ఇప్పుడు కూడా క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన అభ్యర్థులను స్థానిక ఎన్నికల బరిలో నిలిపి వారి విజయానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డబ్బున్నవాడే గెలుస్తాడనే అపోహను వీడి ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వ అవినీతి, అరాచకాలను వివరించాలని సూచించారు. విద్యుత్‌ చార్జీల పెంపు, రైతులు, విద్యార్థులు, ఆర్డీటీ సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రజలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, అరాచక పాలన నుంచి ప్రజలను రక్షించుకోవాలంటే ఐక్యంగా పనిచేసి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ఐదు లక్షల పింఛన్లు తొలగించి, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని కొత్త పింఛన్ల పేరుతో నాటకాలు ఆడుతోందని పేర్కొన్నారు. గతంలో వైయ‌స్ఆర్‌సీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంతో పాటు కూటమి పాలనలో జరుగుతున్న దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న రోజుల్లో కార్యకర్తలకు పెద్దపీట వేసి వారినే నాయకులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎవరికి భయపడకుండా ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ పోరాటాలు వైయ‌స్ఆర్‌సీపీకి కొత్త కాదని, గొంచితండాలో ప్రారంభించిన పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఆర్డీటీ కోసం పోరాడామని తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించడం లేదని, కొండ మొదలు గుట్ట వరకు ఏదీ వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఒక్క ఎకరాకైనా సాగునీరు అందించారా అని ప్రశ్నించారు. చెరువులకు నీరు అందించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బెల్ట్‌ షాపులు, ఇసుక దోపిడీ జరుగుతోందని, ఇదే కూటమి ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసే అభ్యర్థులను బరిలో నిలిపి సమష్టి కృషితో గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

Back to Top