రెండో పులివెందుల జీడీ నెల్లూరు.. 

స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరాలి

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర్ రెడ్డి

చిత్తూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీ చేసి ఘన విజయం సాధించాలని, ఆ విజయాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. పుత్తూరులోని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ గుర్తింపు కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీని ప్రారంభించారు. కార్యక్రమంలో జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మితో పాటు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

 జీడీ నెల్లూరులో వైయ‌స్ఆర్‌సీపీకి పటిష్టమైన పునాది

జీడీ నెల్లూరు నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీకి రెండో పులివెందులగా నిలిచిందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలి. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి అత్యధిక విజయాలు సాధించి జగనన్నకు కానుకగా అందించాలి.

  ప్రతి కార్యకర్త కీలకం

గుర్తింపు కార్డుల పంపిణీతో పార్టీ కార్యకర్తలకు మరింత బాధ్యత, గుర్తింపు లభిస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఆరు మండలాల్లో పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడుతూ వైయ‌స్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసి, ప్రతి స్థానంలో బలమైన అభ్యర్థులను నిలబెట్టి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని భూమన కరుణాకర్ రెడ్డి సూచించారు.

Back to Top