అట్లాంటాలో ఘనంగా డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం

మహానేత సేవలను స్మరించుకున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం

భారీగా తరలివచ్చిన వైయ‌స్‌ఆర్‌ అభిమానులు, ఎన్‌ఆర్‌ఐలు

అట్లాంటా: అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టా (అట్లాంటా) నగరంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అట్లాంటా, ఆల్ఫారెట్టా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వైయ‌స్‌ఆర్‌ అభిమానులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్‌ఆర్‌ఐలు తరలివచ్చారు. మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తూ.. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయన అందించిన సంక్షేమ పాలనను గుర్తుచేసుకున్నారు.

ప్రజల గుండెల్లో చెరగని వైయ‌స్‌ఆర్‌ ముద్ర

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైయ‌స్ఆర్‌సీపీ డిప్యూటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని తెలిపారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన వైయ‌స్‌ఆర్‌ ప్రజా సంక్షేమానికి ఒక ప్రత్యేకమైన దిశను చూపించారని పేర్కొన్నారు. వైయ‌స్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల మనసుల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడిందని తెలిపారు. మహానేత వర్ధంతిని అమెరికాలోనూ పెద్ద ఎత్తున నిర్వహించడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఆశయ సాధనలో ఎన్‌ఆర్‌ఐల పాత్ర కీలకం

వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌ రత్నాకర్‌ పాండుగాయల మాట్లాడుతూ.. వైయ‌స్‌ఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎన్‌ఆర్‌ఐలు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మహానేత సేవా స్ఫూర్తి, ప్రజా సంక్షేమ ఆలోచనలు భవిష్యత్‌ తరాలకు చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. వైయ‌స్‌ఆర్‌ ప్రజల కోసం చూపిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అభిమానుల సహకారంతో విజయవంతం

కార్యక్రమ నిర్వాహకుడు, హోస్ట్‌ వెంకట్‌రెడ్డి దుగ్గిరెడ్డి మాట్లాడుతూ.. అట్లాంటా, ఆల్ఫారెట్టా పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైయ‌స్‌ఆర్‌ అభిమానులు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, ఎన్‌ఆర్‌ఐలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహానేతకు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రతి ఒక్కరి అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలు వెంకటరామిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి కొట్లూరు, గోపీనాథ్‌రెడ్డి, దినకర్‌, కృష్ణ, భూపాల్‌రెడ్డి తదితరులతో పాటు పలువురు వైయ‌స్‌ఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.

వైయ‌స్‌ఆర్‌ స్ఫూర్తి.. తరతరాలకు ఆదర్శం

మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమం అట్లాంటాలోని వైయ‌స్‌ఆర్‌ అభిమానులు, వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. పదిహేడేళ్లు గడిచినా వైయ‌స్‌ఆర్‌ జ్ఞాపకం చెరిగిపోలేదని, ఆయనపై తెలుగు ప్రజలకు ఉన్న అభిమానం సరిహద్దులు దాటి కొనసాగుతోందని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది. ప్రజల కోసం జీవించిన మహానేత సేవా స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. 

Back to Top