స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యం

చీపురుపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి: బొత్స సత్యనారాయణ

గరివిడి: చీపురుపల్లి నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఐక్యంగా పనిచేయాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం గరివిడిలోని క్యాంప్‌ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వ్యక్తులు రావచ్చు.. పోవచ్చు.. పార్టీ మాత్రం శాశ్వతమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ నెల 12న జరగనున్న వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

పార్టీ కోసం అందరూ ఒక కుటుంబంలా ఐక్యంగా పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటామని యువ నాయకురాలు డాక్టర్‌ బొత్స అనూష, యువ నాయకుడు డాక్టర్‌ బొత్స సందీప్‌ తెలిపారు. బొత్స సత్యనారాయణ సూచనలతో అందరూ కలిసి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జిల్లా పార్లమెంటు పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ నాయకత్వంలో పార్టీ కోసం ఐక్యంగా పనిచేస్తామని వారు తెలిపారు.
 

Back to Top