తాడేపల్లి: చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో డీఎస్సీ స్కామ్ అనేది ఓ ఆణిముత్యమని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో డీఎస్సీ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. డీఎస్సీ స్కామ్‌ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారని, కొడుకును కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతూ వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారని అన్నారు. ఇలాంటి స్కామ్‌ల వల్లే కాక్రోచ్‌లు (కాక్రోచ్ జనతా పార్టీ.. జెన్‌జీ ఉద్యమాన్ని ఉద్దేశించి) పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. డీఎస్సీ కుంభకోణంలో పై నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారని, తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చేశారని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం (తెలంగాణ)లో జరగని ఈవెంట్ల పేరుతో ఉద్యోగాలు ఇచ్చిన కేసును ఆధారాలతో సహా చూపించారని పేర్కొన్నారు. ఆ జూడో అసోషియేషన్ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గరి బంధువు, టీడీపీ ఎంపీ భరత్ అని తెలిపారు. సాఫ్ట్‌బాల్ విషయంలోనూ ఇదే జరిగిందని, దాని అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవి అని గుర్తు చేశారు. ఈ వ్యవహారాలకు సంబంధించిన ఆధారాల ఆధారంగా దొంగ సర్టిఫికెట్లను గుర్తించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంటూ.. కుంభకోణం జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.