విజయవాడ: లెనిన్ సెంటర్‌లో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా విశ్వనాథ సత్యనారాయణ రచనలు నిలిచాయని మల్లాది విష్ణు తెలిపారు. ‘వేయిపడగలు’, ‘రామాయణ కల్పవృక్షం’ వంటి గొప్ప కావ్యాలను అందించిన విశ్వనాథ.. జ్ఞానపీఠ్, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న మహనీయుడని పేర్కొన్నారు. విజయవాడ వాసిగా తెలుగువారందరూ గర్వించదగ్గ గొప్ప సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ అని అన్నారు. ఆయన సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. రాబోయే జగన్మోహన్‌రెడ్డి 2.0 ప్రభుత్వంలో విశ్వనాథ సత్యనారాయణ జయంతిని అధికారిక సాహితీ దినోత్సవంగా ప్రకటిస్తామని మల్లాది విష్ణు తెలిపారు. రాష్ట్రంలోని కవులు, రచయితలను గౌరవించి, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.