అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

అనంతపురం: జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కోరారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ అందించేలా ప్రభుత్వానికి నివేదికలు పంపాలని కోరారు. హంద్రీనీవా నుంచి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చెరువులను నింపిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పాటు ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు చెరువులకు వెంటనే నీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి అనంతపురం జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కోరారు.

Back to Top