సోమశిలకు శ్రీశైలం నీరు విడుదల చేయాలి

 నెల్లూరు బ్యారేజీ ముట్టడికి వైయ‌స్ఆర్‌సీపీ పిలుపు.. రైతులతో కలిసి ఆందోళన

నెల్లూరు జిల్లా : సోమశిలకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన ‘చలో నెల్లూరు బ్యారేజీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. సాకే శైలజానాథ్ కూడా రైతులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. నెల్లూరు బ్యారేజీపైకి వెళ్లకుండా పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, రైతులను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సాకే శైలజానాథ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా రైతులతో కలిసి బ్యారేజీ ముందు బైఠాయించారు.

 సోమశిల డెడ్‌స్టోరేజీ దశకు చేరుకుంది

సోమశిల జలాశయం డెడ్‌స్టోరేజీ దశకు చేరుకుంటున్నా శ్రీశైలం నుంచి నీటిని సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోందని కాకాణి ప్రశ్నించారు. నీరు అందక నెల్లూరు జిల్లాలో వేల ఎకరాల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.  పక్క రాష్ట్రం తెలంగాణ నీటిని వినియోగించుకుంటుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని కాకాణి నిలదీశారు. శ్రీశైలం జలాలను వినియోగించుకోవాల్సిన సమయంలో ప్రభుత్వం స్తబ్దత వహించడం వెనుక కారణాలేమిటని ప్రశ్నించారు.

  రాయలసీమ లిఫ్ట్‌ను ఎందుకు నిలిపివేశారు?

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును నిలిపివేయడం ద్వారా ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని కాకాణి పేర్కొన్నారు. సాగునీటి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నెల్లూరు బ్యారేజీ పరిశీలనకు పోలీసుల అనుమతి తీసుకున్నప్పటికీ తమను బ్యారేజీపైకి వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని కాకాణి ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తారనే భయంతోనే అడ్డుకుంటున్నారా అని నిలదీశారు. రైతులకు సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులను మోహరించడం సరికాదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. శ్రీశైలం జలాలను సకాలంలో సోమశిలకు విడుదల చేసి పంటలను కాపాడే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
 

Back to Top