స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం : త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ సత్తా ఏంటో చూపుదామని  పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేసి, యువజన విభాగం చురుగ్గా పనిచేయాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నగరంలోని పలు డివిజన్లకు చెందిన యువజన విభాగం నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశానికి అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, నీట్ పేపర్ లీకేజీపై యువత ఉద్యమించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించారని, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని కోరారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఒక్కరికీ అందించలేదని, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని తెలిపారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, హామీలను అమలు చేయాలని ప్రశ్నించే పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టులు చేసినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు పాలనకు, వైయ‌స్ జగన్ పాలనకు మధ్య ఉన్న తేడాను వాస్తవాలతో ప్రజలకు వివరించాలని సూచించారు. వైయ‌స్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకే నోటిఫికేషన్‌తో 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశామని, కూటమి ప్రభుత్వం 16 వేల టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలకు పాల్పడి ప్రచార ఆర్భాటం చేస్తోందని పేర్కొన్నారు. వైయ‌స్ జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, అందరూ కలిసికట్టుగా వైయస్ఆర్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు చంద్రమోహన్‌రెడ్డి, ఇసాక్, సంపంగి రామాంజినేయులు, శ్రీనివాసులు, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


 

Back to Top